సామాజిక మార్పు ఉపాధ్యాయులతోనే సాధ్యం

ప్రపంచ దేశాల్లో భారత్‌ అగ్రగామిగా నిలవడానికి ఉపాధ్యాయులు తమ వంతు పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అభిలషించారు. సమాజంలో మార్పు అనేది ఉపాధ్యాయులతోనే సాధ్యమన్నారు. ప్రస్తుతం ఆంగ్ల భాష అవసరం ఏర్పడినా మాతృభాషను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అమ్మ మాట, అమ్మ బాట, తెలుగు సంస్కృతిని మరవరాదన్నారు. గుంటూరులో శుక్రవారం డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, గురువులకు జరిగిన ప్రతిభా పురస్కారాల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత విద్యార్థులు, గురువులను సన్మానించిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ అనంతరం వారిని ఉద్దేశించి కీలకోపన్యాసం చేశారు. దేశంలో అన్ని రంగాల్లో మానవ వనరుల కొరత ఉందని, దీన్ని గుర్తెరిగి మంచి నైపుణ్యం కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దడానికి గురువులు శ్రమించాలని ఆకాంక్షించారు. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గురువులు, విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కార్పొరేట్‌ విద్య ఎంత వేళ్లూనుకున్నా ఇప్పటికీ గ్రామీణ విద్యార్థులు మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పేద విద్యార్థులను మెరికల్లా తయారు చేసి వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కోరారు. ప్రతి విద్యార్థి కష్టపడటం, నిజాయితీగా ఉండే గుణాలను అలవర్చుకుంటే ఉన్నత స్థానాలను అధిరోహించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఎంతోమంది విదేశాలకు వెళ్లి ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని, వారు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని జన్మభూమికి వెచ్చించాలని సూచించారు. 15 ఏళ్లుగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు, ఆ ఫలితాల సాధనకు కష్టపడుతున్న ఉపాధ్యాయులను గుర్తించి సన్మానిస్తున్న డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ పాతూరి నాగభూషణాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ రామకృష్ణ, జడ్పీ ఛైర్మన్‌ జానీమూన్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, చలపతి విద్యా సంస్థల అధినేత వైవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com