సినిమా ఎప్పుడు?

మహానటుడు, మహానాయకుడు ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర తెరకెక్కనుందని తెలిసినప్పటి నుంచీ సర్వత్రా ఆసక్తి నెలకుంది. అందునా యన్టీఆర్ నటనా వారసుడు బాలకృష్ణనే ఆ చిత్ర కధానాయకుడు కావడంతో అభిమానులు ఆనందం అంబరమంటింది. ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన జీవిత గాధ చుట్టూ మరో రెండు సినిమాలనూ ప్రారంభిస్తామని కొందరు ప్రకటించారు. అవి అసలు కార్యరూపం దాల్చకముందే బాలకృష్ణ కధానాయకుడిగా యన్.టీ.ఆర్ చిత్రం తేక దర్శకత్వంలో ఆరంభమయింది. ఈ ఏడాది దసరా పండగకే ఈ చిత్రం దియేటర్లో సందడి చేస్తుందనీ ప్రకటించారు. అయితే దర్శకుడు తేజ సారీ చెబుతూ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో మరీ ఈ సినిమాకు దర్శకుడెవరు అన్న ఆసక్తి నేలకుంది.
**ఎందువల్ల?
మహానటుడు ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకం. అందులోని ప్రతి పుట ప్రేక్షకులకు సుపరిచితమే. కేవలం యన్టీఆర్ చిత్రసీమలో ప్రవేశించకముందు కొన్ని ఘట్టాలు జనానికి ఎరుక ఉండవు. ఇక రాజకీయ రంగంలో మహానాయకునిగా ఎన్టీఆర్ పరివర్తన చెందిన తీరు తెలుగునేలనే కాదు యావత్ భారతదేశమూ ఎన్నటికి మరచిపోలేదు. అంతటి ఘనచరిత గల నందమూరి తారకరాముని జీవిత గాధను తెరపై ఆవిష్కరించడానికి పూనుకోవడం సాహసమే. ఆ సాహసానికి నడుమ బిగించారు బాలకృష్ణ. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జీవితగాదలను వెలువడిన పలు పుస్తకాలను పరిశోధించి, తమ తండ్రి జన్మ స్థలం నిమ్మకూరులో పలువురిని సంప్రదించి ఆ మాహానుభావుని జీవిత విశేషాలను సేకరించి ఓ రూపం తీసుకు వచ్చారు. యన్టీఆర్ వీరాభిమానులు ఎందఱో ఈ యజ్ఞంలో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా యన్టీఆర్ జీవితంలోని ఎ చిన్న అంశాన్నయినా ఇట్టే చెబుతూ, అందుకు తగ్గ ఆధారాలను సైతం చూపించగల ధీశాలి కొమ్మినేని వెంకటేశ్వరరావు. ‘యన్.టీ.ఆర్’ బయోపిక్ తెరరూపం దాల్చడానికి విశేషక కృషి చేసారు. ఇలా ఎందరో యన్.టీ.ఆర్ జీవితగాదను తెరకెక్కించడంలో పాలుపంచుకున్నారు. అలాంటి అద్భుత గాధను కేవలం మూడు గంటల వ్యవధిలో చిత్రంగా మలచడం సాధ్యం కాదని దర్శకుడు తేజకు నిదానంగా తెలిసింది. దాంతో యన్టీఆర్ బయోపిక్ కు తాను సంపూర్ణ న్యాయం చేయలేనని (బాలయ్యతో ఇంకేమైనా ఉందొ!!!) తేజ భావించారు. తనను క్షమించమంటూ ఈ ప్రాజెక్టు నుండి గౌరవంగా తప్పుకున్నారు తేజ. మరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు చిత్రసీమలో విశేషంగా చర్చనీయంశమయింది.
**మరి దర్శకుడెవరు?
యన్టీఆర్ తో పలు బ్లాక్ బ్లస్టర్స్ తెరకెక్కించిన కె.రాఘవేంద్రరావు అయితే ఈ బయోపిక్ కు న్యాయం చేయగలడని పలువురి అభిప్రాయం. ఆరంభంలోనే రాఘవేంద్రరావును సంప్రదించగా, పెద్దాయన కధను మూడు గంటల్లో చూపించే సాహసం తానూ చేయలేనని చెప్పినట్లు సమాచారం. ఇక యన్టీఆర్ తో ఎంతో చనువు ఉన్నా, ఆయనకు దర్శకత్వం వహించే అవకాశం సీనియర్ డైరెక్టర్ సంగీతం పేరూ వినిపిస్తోంది. ఇక బాలయ్య వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూపొందించిన క్రిష్ పేరును కూడా కొందరు చెబుతున్నారు. ఇలా పలు పేర్లు వినిపిస్తున్నా, కొందరు బాలకృష్ణనే ‘యన్.టీ.ఆర్’ బయోపిక్ కు దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. గతంలో ‘నర్తనశాల’ చిత్రంలో మెగాఫోన్ పట్టాలని బాలయ్య ప్రయత్నించారు. అది సఫలీకృతం కాలేదు. ఇప్పుడు తన తండ్రి జీవితగాధను తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకునిగా మారితే బాగుంటుందని బాలయ్య సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమయితే ఎన్నో చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించి విజయం సాధించిన యన్టీఆర్ బాటలోనే బాలయ్య సైతం పయనించినట్టవుతుంది. మరీ అదే జరిగినా? అన్నది పలువురి సందేహం.
**అసలు వస్తుందా?
మహానటుడు యన్టీఆర్ ను రాజకీయాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. అంతటి మహానటుని జీవితగాధను తెరకెక్కించడం కత్తి మీద సాము అనే ఇతర పార్టీలలోని అన్నగారి అభిమానుల అభిప్రాయం. ఇక తెలుగుదేశం పార్టీ అభిమానులు సైతం సువర్ణాక్షర లిఖితమైన యన్టీఆర్ జీవిత గాధను ఈ సమయంలో తెరకెక్కించకుండా ఉంటేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తెరచి పెట్టినటువంటి యన్టీఆర్ జీవిత గాధలోని ఏ చిన్న అంశాన్ని సినిమాలో చూపించలేక పోయినా, జనం అసంతృప్తి చెందే అవకాశం ఉంది. అందువల్ల మరికొన్ని తరాలు గడిస్తే తప్ప యన్టీఆర్ లాంటి అద్భుతమైన వ్యక్తీ జీవితాన్ని తెరకెక్కించ రాదనీ పరిశీలకులు అంటున్నారు. నిజానికి యన్టీఆర్ పుట్టుక నుంచి ఆయన చలన చిత్రసీమలో ప్రవేశించడం, సూపర్ స్టార్ గా వెలుగొందడం, తరువాత తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం తొమ్మిది నెలలలోనే రాజ్యాధికారం చేపట్టడంతో కధ ముగిసేలా స్క్రిప్ట్ రూపొందించారు. ఈ కాదాంశాన్ని తెరకెక్కించాలన్నా కనీసం ఆరు గంటల ప్రదర్శనా సమయం పడుతుందని తేజ లాంటి వారి అభిప్రాయం. అందువల్ల యన్టీఆర్ జీవితగాధను కొన్ని భాగాలుగా రూపొందించి విడుదల చేస్తే బాగుంటుందని పలువురి అభిప్రాయం. ఇలా ఎన్నెన్నో అభిప్రాయాలకు తావిస్తున్న నందమూరి తారకరాముని జీవితగాధ తెరపై ఆవిష్కృతమయ్యేదేప్పుడో? ఇదే తెలుగువారిలో ప్రస్తుతం చర్చనీయాంశమయింది. మరి ఏమవుతుందో చూద్దాం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com