సిలికానాంద్ర ప్రాజెక్టులకు కనకవర్షం–ఇది ఆనంద్ సామర్థ్యానికి నిదర్శనం-TNI ప్రత్యేకం


ఒకేఒక్కడు కలలు కంటున్నాడు… అనుచరుల బృందం సహకారంతో వాటిని సాకారం చేస్తున్నాడు. నిజాయితీగా చేసే పనిలో చిత్త శుద్ధి ఉంటే చాలు. సమాజానికి ఉపయోగపడే ఏ పనికైనా సహకరించడానికి వేలాది మంది దాతలు ప్రపంచ వ్యాప్తంగా సిద్దంగా ఉన్నారని నిరూపిస్తున్నారు కూచిభొట్ల ఆనంద్. సిలికానాంద్ర స్థాపించినపుడు ఇది కేవలం తెలుగు వారికి చెందిన చిన్న సంస్థగానే అందరూ భావించారు. చూపులకు చిన్నవ్యక్తిగా కనిపించే సిలికానాంద్ర వ్యవస్థాపకుడు ఎవరూ ఊహించని విధంగా అద్భుతాలనే సాధిస్తున్నాడు. కూచిభొట్ల ఆనంద్ ఒక ప్రాజెక్టు గురించి రూపకల్పన చేస్తున్న సమయంలో సిలికానాంద్ర సభ్యులు, ఆయన సన్నిహితులు, సహచరులు కొద్దిగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ ప్రాజెక్టును అమలు చేయగలమా? అని వారంతా కొంత ఆందోళన చెందుతూ ఉంటారు. ఇప్పటి సమాజంలో అంతగా ప్రాచూర్యం పొందని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులను పది మందికి పరిచయం చేయడంలో వాటిని ప్రాచూర్యంలోకి తేవడంలో దిట్టగా కూచిభొట్ల ఆనంద్ పేరు ప్రఖ్యాతులు పొందారు.
**అన్నమయ్య కీర్తనల గురించి కేవలం ఆధ్యాత్మిక వేత్తలకు మాత్రమే పరిచయం ఉంది. సామాన్యుడికి కూడా అన్నమయ్య కీర్తనల మాధుర్యాన్ని వినిపించడం కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆనంద్ సారధ్యంలో సిలికానాంద్ర చేపట్టిన ‘అన్నమయ్య లక్ష గలార్చన’ ఓ అద్భుతాన్ని సృష్టించింది. ఆనంద్ లో ఉన్న ప్రతిభా పాటవాలను బయటకు తీసుకువచ్చింది.
**ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన కూచిపూడి నాట్యం ఇక్కడ తెలుగు ప్రజలకు అంతగా పరిచయం లేదు. ఆ సమయంలో అమెరికాలో సిలికానాంద్ర నిర్వహించిన “ప్రపంచ కూచిపూడి నాట్యోత్సవం” ఆ నాట్యాన్ని ప్రపంచం నలుమూలలకు విస్తరింపజేసింది. సిద్దేంద్ర యోగి సృష్టించిన కూచిపూడి నృత్యానికి ఎందరో నాట్యాచార్యులు ప్రాచూర్యంలోకి తెచ్చినప్పటికి దానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తీ కూచిభొట్ల ఆనంద్ అనడంలో సందేహం లేదు. ప్రతి రెండేళ్ళకొక సారి ఆనంద్ సారధ్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ కూచిపూడి నాట్య సమ్మేళనం ఎందరో ఔత్సహితులకు కూచిపూడి నాట్య కళ పై మక్కువ పెరిగేలా చేస్తుంది. అదేవిధంగా సిలికానాంద్ర ఆద్వర్యంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ వాయిద్యకారుల సమ్మేళనం’ , ‘ప్రపంచ తెలుగు అంతర్జాల సదస్సు’ తదితర సిలికానాంద్రలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు అద్భుతమైన స్పందన లభించింది.
**’మనబడి’ మహాసముద్రంలా వ్యాపిస్తోంది.
సిలికానాంద్ర ఆద్వర్యంలో సిలికాన్ వ్యాలిలో ఉన్న తెలుగు పిల్లలకు ,మాతృబాష నేర్పడం కోసం ఏర్పాటు చేసిన ‘మనబడి’ అమెరికా ఎల్లలు దాటి ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. ప్రస్తుతం మనబడిలో పదివేల మంది ప్రవాస తెలుగు విద్యార్ధులు ప్రపంచం నలుమూలల శిక్షణ పొందుతున్నారు.
** సిలికానాంద్ర విశ్వవిద్యాలయం తెలుగు జాతికే గర్వకారణం
అమెరికా నడిబొడ్డున భారత సంతతి ముఖ్యంగా తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్న మిల్ పిటాస్ లో నగరం నడిబొడ్డున జాతీయ రహదారి పక్కనే సిలికానాంద్ర ఆద్వర్యంలో ఏర్పాటైన విశ్వవిద్యాలయం తెలుగు జాతికే గర్వకారణం వంటిది. దీనికి మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చి మరికొంత విరాళాన్ని ఇవ్వటానికి సిద్దంగా ఉన్న డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఔదార్యం చాలా గొప్పది. హనిమిరెడ్డి వంటి దాతలు ఆనంద్ చేపట్టిన ప్రతి కార్యక్రామానికి వెన్నుదన్నుగా నిలుస్తూ కళలను ప్రోత్సహిస్తున్నారు.
**ఎక్కడ కూచిపూడి.. ఎందుకీ సంజీవని.
కూచిపూడి నృత్యం అంటే ప్రాణంతో సమానంగా చూసుకునే కూచిభొట్ల ఆనంద్ ఆ నాట్యం పుట్టిన కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దత్తత గ్రామం అంటే ఎలా ఉండాలో చేతల్లో చూపించారు. కూచిభొట్ల ఆనంద్ ప్రస్తుతం కూచిపూడిలో 25 కోట్ల రూపాయల వ్యయంతో సిలికానాంద్ర నిర్మిస్తున్న ఐదంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి శరవేగంగా రూపు దిద్దుకుంటుంది. వచ్చే దసరా నాటికి దీనిని ప్రారంభించాలని కూచిభొట్ల ఆనంద్ కూచిపూడిలోనే మకాం వేసి అమెరికాలో ఉన్న భార్యా బిడ్డలకు దూరంగా ఉంటూ నిద్రాహారాలు మాని సంజీవని ఆస్పత్రి పూర్తీ చేయడమే తన ఊపిరిగా కృషి చేస్తున్నారు.
*’వెల్ డన్’ రవి ప్రకాష్
వాస్తవానికి రవి ప్రకాష్ కి ఉన్న వృత్తికి కూచిభొట్ల ఆనంద్ చేపడుతున్న కార్యక్రమాలకు ఏమాత్రం సంబంధం లేదు. అసలు వీరిద్దరి వృత్తులే పరస్పరం విరుద్దమైనవి. అన్నమయ్య లక్ష గళార్చనతో రవిప్రకాష్ లో ఉన్న కళా హృదయాన్ని తట్టిలేపారు. కూచిభొట్ల ఆనంద్ అన్నమయ్య లక్ష గలార్చనలో రవి ప్రకాష్ ఇచ్చిన ప్రోత్సాహం ఆనంద్ లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆనంద్ చేపట్టిన చాలా కార్యక్రమాలకు రవిప్రకాష్ పరోక్షంగా సహాయసహకారాలు అందిస్తూ వచ్చారు. ఆనంద్ చేపట్టిన కార్యక్రమాలకు ఆకర్షితుడైన రవిప్రకాష్ నాలుగు కోట్ల రూపాయలు భారీ విరాళాన్ని సంజీవని ఆస్పత్రికి అందించి తెలుగు జాతి విస్తుపోయేలా చేశాడు. రవిప్రకాష్ ఇచ్చిన భారీ విరాళం పైన, ఆనంద్ చేపడుతున్న సమాజ సేవా కార్యక్రమాల పైన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు వారు, ఈ విషయం పై చర్చించుకుంటున్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని చిత్తశుద్దితో చేపడితే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చునని నిరూపిస్తున్నాడు ఆనంద్. దివి తాలూకాలో ఒక దళిత ఉపాద్యాయుడు తనకు వస్తున్న ఫించన్ మొత్తాన్ని సంజీవని ఆస్పత్రికి విరాళంగా అందించాడు అంటే ఆ ఘనత సిలికానాంద్ర కుటుంబానికే దక్కుతుంది.
** సిలికానాంద్ర కుటుంబానికి శతకోటి వందనాలు
సిలికానాంద్ర ప్రారంభం నుండి నాకు ఆ సంస్థ సభ్యులతో సాన్నిహిత్యం ఉంది. ఆనంద్ అనే వ్యక్తీ కేవలం దానికి వ్యవస్థాపకుడు. వివిధ ప్రాజెక్టుల కలలను సారధి మాత్రమే. ఆయన కలలను సాకారం చేసే చిత్తశుద్ధి కలిగిన సిలికానాంద్ర కుటుంబానికి శతకోటి వందనాలు. బతుకు తెరువు కోసం పొట్ట చేతబెట్టుకుని భార్యా బిడ్డలతో అమెరికా వెళ్ళిన కూచిభొట్ల ఆనంద్ ఉద్యోగాన్ని వదలివేసి కేవలం తెలుగు జాతి సేవలోనే తరిస్తున్నారు. ఆయనకు అన్ని విధాల తగిన భార్య కూచిభొట్ల శాంతి లభించడం ఆనంద్ పూర్వజన్మ సుకృతం. మండలి బుద్దప్రసాద్ వంటి మార్గదర్శకుడు లభించడం మరొక అదృష్టం. తమ ఉద్యోగాలు త్యజించి ఆనంద్ వెంటే సమాజ సేవలో పాల్గొంటున్న కొండుభట్ల దీనబాబు, చామర్తి రాజు, కొండిపర్తి దిలీప్ వంటి వ్యక్తుల సహాయసహకారాలు లభించడం కూడా సిలికానాంద్ర ప్రాజెక్టు దిగ్విజయం కావడానికి ప్రధాన కారణమవుతోంది. సిలికానాంద్ర కుటుంబానికి శతకోటి వందనాలు. – కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్ట్.










More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com