సుప్రీంకోర్టులో అవాంఛిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి


న్యాయచరిత్రలో తొలిసారిగా దేశ సర్వోన్నత న్యాయస్థాన సీనియర్‌ న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడారు. అది కూడా ఒకేసారి నలుగురు జడ్జీలు మీడియా ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నివాసంలో చలమేశ్వర్‌ సహా సీనియర్‌ జడ్జీలు జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ కీలక సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థపై సీనియర్‌ న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జస్టిస్‌ చలమేశ్వర్‌ మాట్లాడుతూ..‘భారత చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది. స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం మనలేదు. సుప్రీంకోర్టు పవిత్రత నిలబడలేకపోతే ప్రజాస్వామ్యానికి చేటు. సుప్రీంకోర్టులో పాలనా వ్యవస్థ సరైన క్రమంలో లేదు. గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో అవాంఛిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాలపై మేం నలుగురం చర్చించి కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం. పాలనా వ్యవస్థను సరిదిద్దాలని కోరాం. అయితే ఆయనను ఒప్పించడంలో మేం విఫలమయ్యాం. జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం తప్ప మా ముందు మరో మార్గం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం. ఇలా సమావేశం పెట్టడం బాధాకరమే అయినా.. తప్పలేదు. సుప్రీంకోర్టు వ్యవస్థకు, దేశానికి మేం బాధ్యత కలిగి ఉన్నాం. జరుగుతున్న పరిణామాలపై దేశానికి పూర్తి వివరాలు తెలియజేస్తూ మేం మా బాధ్యతను నిర్వర్తిస్తున్నాం’ అని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు పంపించిన ఏడు పేజీల లేఖను జడ్జీలు మీడియాకు ఇచ్చారు. ‘సుప్రీంకోర్టు వెలువరించిన కొన్ని తీర్పులు న్యాయవ్యవస్థ పనితీరు, హైకోర్టుల స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపించే విధంగా ఉన్నాయని మేం భావిస్తున్నాం. కొన్ని కేసుల విచారణలో ధర్మాసనాల కేటాయింపు హేతుబద్ధంగా జరగక.. ‘వారికి అనుకూలంగా’ మాత్రమే జరిగింది. సుప్రీంకోర్టు వ్యవస్థకు ఇబ్బందులు తీసుకురాకుండా ఉండేందుకు వాటి గురించి మేం ఇక్కడ వివరాలను ప్రస్తావించడంలేదు. కానీ వాటి వల్ల సుప్రీం వ్యవస్థకు కొంత నష్టం జరిగింది. సుప్రీం న్యాయమూర్తుల్లో సమానంగా ఉండే వారిలో ముందుండే వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి. ఆయన ఎవరికీ ఎక్కువ కాదు.. తక్కువ కాదు.’ అని లేఖలో పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com