సేవా రంగంలో తానా సముద్రం వంటిది-డల్లాస్‌లో జంపాల


ఆవిర్భావం నాడు తెలుగు సంస్కృతి, సాంప్రదాయలకు ఆలవాలంగా భాసిల్లిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నేడు సేవా కార్యక్రమాలకు చిరునామాగా మారి సముద్రం అంత విశాలంగా విస్తరించిందని అధ్యక్షుడు డా.జంపాల చౌదరి పేర్కొన్నారు. సెయింట్ లూయిస్ నగరంలో మే28వ తేదీ నుండి జరగనున్న 21వ తానా మహాసభల నిర్వహణ నిధుల సేకరణ కార్యక్రమాన్ని శనివారం నాడు ఇర్వింగ్‌లోని అమరావతి సమావేశ మందిరంలో నిర్వహించారు. సుగన్ చాగర్లమూడి పరిచయ వాక్యాల అనంతరం కొండ్రుకుంట చలపతి సమన్వయంలో సాగిన ఈ కార్యక్రమంలో ప్రసంగించిన జంపాల తానా ఆవిర్భావ ఆశయాల పరిరక్షణ నేడు ద్వితీయ స్థానానికి జరగ్గా మొదటి స్థానాన్ని సేవా కార్యక్రమాలు ఆక్రమించాయని తెలిపారు. టీం స్క్వేర్ ఆధ్వర్యంలో గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే నాలుగు దుర్ఘటనల బాధితులకు సాయపడినట్లు వెల్లడించారు. డెట్రాయిట్ మహాసభలకు నిధులు అధికంగా అందినందున వారు అధికంగా ఖర్చు చేశారని అయితే వాటి పారదర్శకతలో ఎక్కడా లోపాలు లేవని పేర్కొన్నారు. డెట్రాయిట్ సభల పద్దులను 15మంది సభ్యులతో కూడిన తానా డైరక్టర్ల బోర్డుకు సమర్పించగా అవి 12మంది సభ్యుల ఓటుతో ఆమోదముద్ర పొందాయని ఇప్పుడు వీటిపై రాద్ధాంతం చేయడం వెనుక అర్థం లేదని తెలిపారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో మొత్తం 7100 నూతన సభ్యులు జేరగా వారిలో 5940 మంది తమ ధృవీకరణ పత్రాలు సమర్పించి తమ సభ్యత్వాలను నిర్థారించుకున్నారని మిగిలిన 1200 మంది తమ దరఖాస్తులు సమర్పిస్తే వాటిని కూడా ఆమోదిస్తామని పేర్కొన్నారు. సభ్యుల నిర్థారణ కమిటీలో అయిదుగురు సభ్యుల ఆమోదం ఉంటేనే సభ్యత్వాన్ని ఆమోదించడం జరుగుతుందని వెల్లడించారు. డెట్రాయిట్ మహాసభల నుండి పాఠాలు నేర్చుకుని సెయింట్ లూయిస్ మహాసభల ఖర్చును తానా కార్యవర్గానికి ముందస్తుగా సమర్పించి వారి అంగీకారం ఆమోదం అందిన మొత్తాన్నే ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు జంపాల తెలిపారు. 21వ మహాసభలకు తానా కార్యవర్గం ఇప్పటి వరకు 1.7మిలియన్ డాలర్లను ఆమోదించిందని, ఒకవేళ నిధులు ఎక్కువగా అందిన పక్షంలో ప్రతి రెండు వారాలకు ఒకసారి కార్యవర్గ ఆమోదాన్ని తిరిగి అభ్యర్థిస్తామని ఆయన తెలిపారు. సెయింట్ లూయిస్ సభల సమన్వయకర్త చదలవాడ కూర్మనాథరావు ప్రసంగిస్తూ 501C స్థాయి కలిగిన సేవా రంగ సంస్థలకు అమెరికా ఆదాయపన్ను శాఖ నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా సెయింట్ లూయిస్ సభల నిర్వహణా ఖర్చులు ఉంటాయని ఈ ఎడాది తొలిసారిగా సాంకేతిక లాకర్ సదుపాయంతో ప్రతి పైసా రాబడి-ఖర్చులను పారదర్శకంగా పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డల్లాస్, హ్యూస్టన్ ప్రవాసులు 21వ తానా మహసభాలకు 203,000 డాలర్లు విరాళంగా అందించారు. దాతలకు జంపాల, చదలవాడలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పోలవరపు శ్రీకాంత్, డా.రాఘవేంద్ర ప్రసాద్, డా.తోటకూర ప్రసాద్, డా.అడుసుమిల్లి రాజేష్, తాళ్లూరి పూర్ణచంద్రరావు, దేవినేని పరమేష్, కన్నెగంటి మంజులత, జంపాల అరుణ, డా.నల్లూరి ప్రసాద్, కొడాలి నాగశ్రీనివాస్, కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, కేసీ చేకూరి, బొర్రా విజయ్, కన్నెగంటి చంద్ర, కొణిదెల లోకేష్ నాయుడు, కోడూరి కృష్ణారెడ్డి, యు.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More News

One thought on “సేవా రంగంలో తానా సముద్రం వంటిది-డల్లాస్‌లో జంపాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com