సోయా పాలు గుండె గారను తగ్గిస్తాయి

నానాటికీ పెరిగిపోతున్న వ్యాధుల్ని గమనిస్తే, ఆహార పానీయాల్లో పోషకాలే కాదు, ఔషధ గుణాలు కూడా ఉండడం ఎంతో అవసరమని బోధపడుతుంది. అలాంటి వాటిలో సోయా పాలకు అత్యున్నత స్థానం ఉంది. సోయాబీన్‌ పాలు ఆవుపాల కన్నా, గేదెపాల కన్నా శ్రేష్ఠమైనవే కాక చాలా చవక కూడా. పాలఫ్యాక్టరీలు పంపిణీ చేసే హోమోజినైజ్డ్‌ పాలతో పోలిస్తే సోయాబీన్‌ పాలు ఎంతో మెరుగు. ఈ పాలలో మన శక్తికీ, స్వస్థతకూ ఉపకరించే ఇనుము, ఫాస్ఫరస్‌, నియాసిన్‌, విటమిన్‌-సి ఎంతో అధిక శాతంలోనూ, మన రక్త ప్రసరణ వ్యవస్థకు హానికలిగించే కొవ్వు చాలా తక్కువ శాతంలో ఉన్నాయి.
****మాంసకృత్తులు పుష్కలం
ఒక కప్పు ఎండు సోయాబీన్లలో 240 గ్రాముల మాంసకృత్తులు లభిస్తాయి. మేకమాంసంలో 225, కాలేయంలో 180, చేపల్లో 175 గ్రాములు, జున్నులో 170, కోడిమాంసంలో 350 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి. అంటే మాంసాహారం కన్నా సోయాబీన్‌ చాలా శ్రేష్ఠం. పైగా చవక. మన శరీరానికి అవసరమైన 14 అమినో ఆమ్లాలలో 10 ఆమ్లాలు సోయాలో లభిస్తాయి. సోయాబీన్‌ పాలతో, ఆవుపాలతో చేసుకునే వంటకాలంటిన్నింటినీ, టీ, కాఫీ, పెరుగు, మజ్జిగ, పన్నీరు, మిల్క్‌షేక్స్‌, ఐస్‌క్రీమ్‌, స్వీట్లు, బిస్కట్లు, కేకుల వంటివి చేసుకోవచ్చు. సోయాబీన్‌ పాలు, అధికరక్తపోటు, అధిక కొలెస్ర్టాల్‌, మధుమేహం, కీళ్లనొప్పులు, ఆస్తమా, బ్రోంకైటిస్‌, సైనసైటిస్‌ సమస్యలు ఉన్నవారు కూడా ఈ పాలను నిస్సంకోచంగా వాడవచ్చు.
****సోయా పాల తయారీ ఇలా
ఒక కిలో సోయాబీన్లతో 8 లీటర్ల సోయా పాలు తయారవుతాయి. ఈ లెక్కన మీకు కావలసిన పాలకు సరిపోయే సోయాబీన్లు తీసుకోండి. తెల్లని సోయాబీన్ల కన్నా గోధుమ రంగు సోయాబీన్లను వినియోగించి తయారు చేసిన పాలు నాణ్యంగానూ, రుచిగానూ ఉంటాయి. మీరు తీసుకున్న సోయాబీన్లకు 5 రెట్ల పరిమాణంలో మంచినీళ్లు తీసుకుని వాటిని 8 గంటల పాటు నానబెట్టాలి. ఉదయం నీటిని ఒంచివేసి మంచినీళ్లతో బీన్సును మరో రెండు సార్లు శుభ్రం చేయాలి. నానబెట్టిన తరువాత పరిమాణంలో అవి రెట్టింపు అవుతాయి.
****నానబెట్టిన బీన్సుకు మూడు రెట్ల పరిమాణంలో నీరు తీసుకుని బాగా మరగించాలి. అందులో కప్పు బీన్సుకు, ఒక టీ స్పూను చొప్పున సోడా ఉప్పు కలపాలి. ఆ తరువాత మరుగుతున్న నీళ్లలోనే బీన్సును తటాలున వేసి అయిదు నిమిషాలు నాననివ్వాలి. ఆ తరువాత నీటిని ఒంచివేసి బీన్సును మళ్లీ వేడినీటితో కడగాలి. మళ్లీ మరిగించిన నీటిలో సోడా ఉప కలిపి అందులో బీన్సును వేసి మరో అయిదు నిమిషాలు నాననివ్వండి. మరోసారి వేడి నీటితో బీన్సును శుభ్రం చే యాలి. పై విధంగా శుభ్రం చేసిన ఒక కప బీన్సుకు నాలుగు లేక ఐదు కప్పుల మరుగుతున్న నీటిని కలపాలి. ఆపైన మిక్సీలో వేసి నాలుగు నిమిషాల పాటు అత్యధిక వేగంతో రుబ్బాలి. మిక్సీ పాత్ర పరిమాణాన్ని బట్టి, మీరు నానబె ట్టిన బీన్సు మోతాదును బట్టి ఈ ప్రక్రియను నాలుగైదు సార్లు చేయవలసి రావచ్చు. ఇప్పుడు పల్చని గుడ్డను నాలుగైదు పొరలుగా వేసి సోయాగుజ్జును వడగట్టండి. వడగట్టిన తరువాత పాత్రలో మిగిలే ద్రవమే సోయా పాలు. గుడ్డ మీద మిగిలిన గుజ్జు వ్యర్థ పదార్థం కాదు. అందులో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ గుజ్జుతో వడలు, దోశలు, మురుకుల్లాంటివి చేసుకోవచ్చు. తయారైన సోయాబీను పాలను రెట్టింపు పరిమాణంలో ఉన్న పాత్రలో పోసి, గరిటెతో తిప్పుతూ, 15 నిమిషాలు అఽధిక వేడితో కాచి, ఆ తరువాత మరో 7 నిమిషాలు సన్నని సెగలో వేడి చేయాలి. ఈ ప్రక్రియకు పాలు పొంగకుండా కాచే పాత్రను కూడా వాడవచ్చు. ఈ పాలను ప్రతి వ్యక్తీ రోజుకు ఒక లీటరు చొప్పున వాడితే, పోషక లోపాలవల్ల వచ్చే వ్యాధులన్నింటినీ నిరోధించవచ్చు.
*****ఔషధ గుణాలు అపారం
సోయాబీన్‌ పాలలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. సోయాబీను పాలు స్త్రీల నెలసరి సమస్యలను, స్త్రీల నెలసరి ముగింపు సమస్యలను, వక్షోజ క్యాన్యర్లను, స్త్రీ జననాంగ క్యాన్సర్లను నివారిస్తాయి. సోయాలో ఉన్న లెసితిన్‌ అనే పదార్థం కొలెస్ర్టాల్‌ను తగ్గించడంతో పాటు, గుండె గోడలకు పట్టిన గారను తొలగిస్తుంది. ప్రతినిత్యం సోయాపాలను ఉపయోగిస్తే 50 శాతం ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా చేసుకోవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com