సౌదీలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటే జైల్లో తోస్తారు

ప్రపంచమంతా ప్రేమే! ఒక్కోచోట ఒక్కోలా.. కానీ అక్కడ మాత్రం..ఏటా ఫిబ్రవరి 14ను ‘ప్రేమికుల దినోత్సవం(వాలెంటైన్స్ డే)గా జరుపుకుంటారని అందరికీ తెలిసిందే. కొత్తగా ప్రేమలో పడిన యువతీ యువకులు.. ఎప్పుడెప్పుడు తమ ప్రేమను తమ ప్రియుడు లేదా ప్రియురాలికి వ్యక్తం చేద్దామా అని ఈ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక మన దేశంలో అయితే భజరంగ్ దళ్ కార్యకర్తలు ఫిబ్రవరి 14న చేసే హడావుడి అంతా ఇంతాకాదు. ఆ రోజున ఎక్కడ, ఏ పార్కులో ప్రేమికులు జంటగా కనిపించినా అక్కడికక్కడే బలవంతంగా తాళి కట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవం గురించి, దీనిని ఏయే దేశాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం!

రేపే ప్రేమికుల దినోత్సవం….
ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం మళ్లీ వచ్చేసింది. అమ్మాయిలైతే.. ‘యూ ఆర్ మై వాలెంటైన్’ అంటూ అబ్బాయిలకు, అబ్బాయిలైతే.. ‘నువ్వే నా ప్రేమదేవత’ అంటూ అమ్మాయిలకు తమ ప్రేమను వ్యక్తం చేసే రోజు. నిజానికి ఏడాదిలో ఏ రోజైనా తమ ప్రేమను వ్యక్తం చేయొచ్చు.. అది వేరే సంగతి. కానీ ప్రేమించుకుంటున్న వారి దృష్టిలో ఈ ప్రేమికుల దినోత్సవానికి ఉండే ప్రాముఖ్యత వేరు. ఆ రోజు వాళ్లది.. అంతే. అదే మరి ప్రేమ వైరస్ మహిమ! ప్రేమ.. ఎప్పుడు ఎవరి మధ్యనైనా పుట్టవచ్చు. ఎవరికైనా సోకవచ్చు. రెండు హృదయాలను ఒక్కటి చేయొచ్చు. అందుకే, ప్రపంచమంతా ప్రేమకు గులామై.. ప్రేమికులకు సలాం కొడుతోంది.

వాలెంటైన్స్ డే అంటే…
వాలెంటైన్స్ డేకి సంబంధించి చాలా కథలు ఉన్నాయి. పలువురు పలురకాలుగా చెబుతుంటారు. అయితే దీని గురించి బాగా ప్రచారంలో ఉన్న కథేమిటంటే… మూడో శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యాన్ని చక్రవర్తి క్లాడియస్ పరిపాలిస్తుండేవాడు. అతడికి వివాహ వ్యవస్థపై అసలు నమ్మకం ఉండేది కాదు. పెళ్లి చేసుకోవడం వల్ల మగాళ్ల బుద్ధి, సామర్థ్యం నశిస్తాయనే అపోహలో ఉండేవాడు. దీంతో తన సామ్రాజ్యంలోని సైనికులు, అధికారులు వివాహం చేసుకోకూడదని ఆజ్ఞాపిస్తాడు. అంతే ప్రేమికులంతా విలవిలలాడిపోతారు. అలాంటి సమయంలో.. చక్రవర్తి క్లాడియస్ ఆజ్ఞను వాలెంటైన్ అనే వ్యక్తి వ్యతిరేకించి దగ్గరుండి పలువురు సైనికులు, అధికారులకు వివాహం జరిపిస్తాడు. దీంతో తన ఆజ్ఞను ధిక్కరించాడనే కోపంతో వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరితీయిస్తాడు క్లాడియస్. అలా ప్రేమ కోసం, ప్రేమికుల కోసం తన ప్రాణాలను ఆర్పించిన వాలెంటైన్‌కు గుర్తుగా అప్పట్నించి ఏటా ఆ రోజును ప్రేమికులు సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు.

ఎక్కడ, ఎలా జరుపుకుంటారంటే.
ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారుగానీ అన్ని దేశాల్లో ఈ వేడుకలు ఒకే రకంగా ఉండవు. ఒక్కో దేశంలో ఒక్కోరకంగా జరుపుకుంటారు. కొన్ని దేశాలు ఫిబ్రవరి 14న కాకుండా, ప్రేమ కోసం ప్రత్యేక దినాలు పాటిస్తున్నాయి. జపాన్‌లో… ఫిబ్రవరి 14న అమ్మాయిలే అబ్బాయిలకు గిఫ్టులిస్తారు. మళ్లీ మార్చి 14న అబ్బాయిలు అమ్మాయిలకు నచ్చవి గిఫ్టులుగా తిరిగివ్వాలి. దీన్ని ‘వైట్ డే’ అంటారు. చైనాలో… ఈ ప్రేమికుల రోజును 7వ నెల 7వ తేదీన క్విజీ ఫెస్టివల్‌గా జరుపుకుంటారు. ఇంగ్లాండ్‌లో… జాక్ వాలెంటైన్ వేషంలో చిన్నారులకు గిఫ్టులు పంచుతారు.

మరికొన్ని కొన్ని దేశాల్లో ఇలా….
దక్షిణాఫ్రికాలో… నచ్చిన వ్యక్తుల పేర్లను భుజాలపై హార్ట్ షేపులో పచ్చబొట్టు పొడిపించుకుంటారు. జర్మనీలో… కామానికి, లక్‌కు ప్రతీకగా భావించే పందులు, హార్ట్ షేప్ గడ్డిపూల స్టిక్కర్లతో గిఫ్టులు పంచుకుంటారు. బల్గేరియాలో… ఫిబ్రవరి 14ను ‘వైన్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. బ్రజిల్‌లో… ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 కాదు, ఇక్కడ జూన్ 12ను సెయింట్ ‘ఆంటోనీస్ డే’ను ‘డయా డస్ నమోరడస్’ పేరుతో ప్రేమికుల రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారు. వేల్స్‌లో అయితే… జనవరి 25న ‘సెయింట్ డ్వైన్వెన్స్ డే’ను ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ఘనాలో.. ‘నేషనల్ చాక్లెట్ డే’గా వేడుకలు జరుపుకొంటారు. ఫిలిప్పీన్స్‌లో.. ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగుతాయి. ఫిన్లాండ్, ఎస్టోనియాల్లో.. ఫిబ్రవరి 14ను స్నేహితుల దినోత్సవంగా జరుపుకొంటారు.

సౌదీ అయితే జైలుకే…
మరికొన్ని దేశాలు ఈ రోజును పూర్తిగా బ్యాన్ చేశాయి. సౌదీ అరేబియాలాంటి దేశాల్లో ఆ రోజు ఎర్ర గులాబీ పట్టుకున్నా జైలు ఊచలు లెక్కపెట్టాలి. లేదా బహిరంగ శిక్షకు సిద్ధం కావాలి. మన దేశంలో ప్రేమికుల దినోత్సవం రోజున నచ్చిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఈ ప్రేమికుల రోజును వ్యతిరేకించే వర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. పాకిస్తాన్‌లో కూడా ఇస్లామిక్ పార్టీలు వాలెంటైన్స్ డేను వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ కొన్ని నగరాల్లో దీనిని అధికారికంగానే నిషేధించారు. ఫ్రాన్స్‌లో కూడా వాలెంటైన్స్ డే రోజున జరిగే ‘లవ్ లాటరీ’ విద్వేషాలకు దారితీస్తుండడంతో అక్కడి ప్రభుత్వం నిషేధించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com