స్వామి వారికి నగదు కొరత

తిరుమల, తిరుపతి దేవస్థానం ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఏటా నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోతుంది. అదే నిష్పత్తిలో ఆదాయం పెరుగుదల కనిపించడంలేదు. తాజాగా రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపిన 2018-19 వార్షిక బడ్జెట్‌లోనూ అదే విషయం ప్రస్ఫుటించింది.తితిదే పాలకమండలి, ప్రత్యేకాధికారి ఆమోద ముద్ర లేకుండానే..బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే. ఈసారి దేవస్థానం వార్షిక బడ్జెట్‌లో మూడో వంతు జీతాలు, పింఛన్లకే వెచ్చించాల్సి వస్తోంది. శాశ్వత ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బంది జీతభత్యాలు, విశ్రాంతి ఉద్యోగుల పింఛన్లకు భారీగా కేటాయింపులు ఉన్నాయి. రూ.1,100 కోట్ల మొత్తాన్ని కేవలం ఈ రెండు అంశాలకే కేటాయించింది. దేవస్థానంలో దాదాపు 8,500 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. వీరికి గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు తితిదే వెచ్చింది. నూతన ఆర్థిక సంవత్సరంలో రూ.600 కోట్లు వరకు వ్యయం కాగలదని అంచనా వేసి, నిధులు కేటాయించింది. అదే విధంగా పొరుగు సేవల సిబ్బంది 15 వేల మంది వరకు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. వీరికి గత ఆర్థిక సంవత్సరంలో రూ.215.75 కోట్లు జీతాల రూపేణా వ్యయం చేసింది. రాగల సంవత్సరంలో కూడా రూ.214.25 కోట్లు వరకు వ్యయం కాగలదని అంచనా వేసింది. గత నాలుగేళ్లుగా పరిశీలిస్తే జీతాలు, పింఛన్లు కోసం ఏటా రూ.100 కోట్ల వ్యయం పెరుగుతోంది. డిపాజిట్లు పరిశీలిస్తే భారీగా తగ్గుదల కనిపిస్తోంది. డిపాజిట్ల మొత్తం పెరుగుతున్నా.. ఆ మేరకు వడ్డీ రాబడి రాకుండా తగ్గడం గమనార్హం. దేవాదాయ, ధర్మాదాయ చట్టం మేరకు ఆలయాలకు వచ్చే ఆదాయంలో కొంత శాతం బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలనే నిబంధన ఉంది. ఆ ప్రకారం తితిదే ఏటా బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు చేస్తోంది. భక్తులు వచ్చిన విరాళాలతో పాటు తితిదే రాబడి నుంచి చేసిన డిపాజిట్లు మేరకు ప్రస్తుతం రూ.11 వేల కోట్ల నిల్వ ఉంది. డిపాజిట్ల పరంగా పరిశీలిస్తే 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.672 కోట్ల నిధులను డిపాజిట్‌ చేసింది. ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్లకు తగ్గిపోయింది. అదే విధంగా నిర్వహణ వ్యయంలో భాగంగా ఇంజినీరింగ్‌ పనులకు, మరమ్మతులు, విద్యుత్తు ఛార్జీలు తదితరాలు భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఇంజినీరింగ్‌ పనులకు 2014లో రూ.150 కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.280 కోట్లకు పెరిగింది. ఇక విద్యుత్‌ ఛార్జీలు రూ.55 కోట్ల నుంచి రూ.75 కోట్లకు పెరిగిపోయాయి. ఈ తరహాలోనే ఇతర ఖర్చులూ హెచ్చాయి. వ్యయానికి తగ్గట్టుగా తితిదే రాబడిలో వృద్ధి కన్పించడం లేదు. హుండీ, డిపాజిట్లపై వచ్చే వడ్డీ ద్వారానే తితిదేకు ప్రధానంగా ఆదాయం సమకూరుతుంది. హుండీ ఆదాయంలో పెరుగుదల కొంత కనిపించినా… డిపాజిట్లపై వడ్డీ రేట్లు పడిపోవడంతో ఏటా రూ.200 కోట్ల తరుగుదల నమోదవుతుంది. తరుగుదల రెండేళ్లుగా ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఆదాయానికి, వ్యయానికి మధ్య అంతరం పెరిగిపోవడంతో డిపాజిట్ల మొత్తాన్ని తితిదే తగ్గించుకుంటోంది. ఈ విషయం తాజా బడ్జెట్‌లో స్పష్టమైంది. వార్షిక బడ్జెట్టు మొత్తం కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తగ్గుదల కనిపించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com