హెచ్-4 ఉద్యోగస్థులకు జూన్‌లో చరమగీతం

హెచ్‌-4 వీసా వర్క్‌ పర్మిట్‌ రద్దు ప్రక్రియకు సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి యూఎస్‌ న్యాయస్థానానికి తెలియజేశారు. అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు ఈ హెచ్‌-4 వీసా ద్వారా వివిధ కంపెనీల్లో పని చెయ్యొచ్చు. ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని రద్దు చేసే యోచనలో ట్రంప్‌ ప్రభుత్వం ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హెచ్‌-4 వీసాను రద్దు చేయడం వల్ల దాని ప్రభావం దాదాపు 70వేల మందిపై పడుతుందని హెచ్‌-1బీ వీసాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అమెరికా న్యాయస్థానం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌)ని వివరణ కోరింది. హెచ్‌-4వీసా వర్క్‌ పర్మిట్‌ రద్దు ప్రతిపాదన ప్రక్రియ తుది దశకు చేరిందని, జూన్‌లో దీనికి సంబంధించి క్లియరెన్స్‌ వస్తుందని డీహెచ్‌ఎస్‌ న్యాయస్థానానికి తెలియజేసింది. డీహెచ్‌ఎస్‌ దగ్గర నుంచి క్లియరెన్స్‌ వచ్చిన తర్వాత దాన్ని ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌కు పరిశీలన నిమిత్తం పంపిస్తామని ట్రంప్‌ యంత్రాంగం కోర్టుకు తెలియజేసింది. 2015లో ఒబామా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ హెచ్‌4 వీసా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ వీసా విధానం ద్వారా పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. దీనిని రద్దు చేయడం వల్ల భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్‌-1బీ వీసాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయకుండా ఉండాలని కోరుతూ అమెరికాలోని దాదాపు 130 మంది శాసనకర్తలు ట్రంప్‌ యంత్రాంగాన్ని అభ్యర్థించాయి. ఇండో-అమెరికన్‌ శాసనకర్త ప్రమీలా జైపాల్‌ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌ సభ్యులు ట్రంప్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ వీసా విధానాన్ని రద్దు చేయడం వల్ల అమెరికాకు ఎంతో నష్టం వాటిల్లే ప్రమాదముందని శాసనకర్తలు లేఖలో పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com