హైదరాబాద్ మెట్రో వింతలు ఎన్నెనో!

లాభాపేక్ష లేకుండా ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలి. వ్యక్తిగత వాహనాల తగ్గింపు, ఇంధన పొదుపు, వాయు కాలుష్య తీవ్రత, ప్రమాదాల తగ్గుదల ఇలా ఎన్నో ప్రయోజనాలున్న ప్రజా రవాణా వ్యవస్థ ప్రజలకు భారంగా మారితే అది ఆ వ్యవస్థ మనుగడపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. నగరంలో ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌ రైళ్ల చార్జీలతో పోల్చితే మెట్రో ప్రయాణం భారంగా మారింది. ఇప్పటికే అవసరమైన ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో నగర వాసులు సొంత వాహనాల వినియోగానికే ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు ప్రత్యేక నిదర్శనం గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని వాహనాల సంఖ్య 54 లక్షలు కాగా, అందులో ద్విచక్ర వాహనాలే 42 లక్షల వరకు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు ప్రయాణం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతోందన్న అపవాదును మూటకట్టుకుంటోంది. నగరంలో అత్యంత రద్దీ మార్గాల్లో 30 కి.మీ మార్గంలో తిరుగుతున్న మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజుకు 80 వేలు దాటడం లేదు. అదే మెట్రో ప్రారంభంలో ఇవే మార్గాల్లో 1.60లక్షల నుంచి 2 లక్షల వరకు చేశారు. మెట్రో రైలు సేవలు ప్రారంభమై ఏడు నెలలు గడిచినా ప్రయాణికుల సంఖ్య పెరగడం లేదు. అత్యవసర పరిస్థితులు, తప్పనిసరి అయితేనే మెట్రోని ఆశ్రయించేందుకు నగరవాసులు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. దీనికంతటికి కారణం మెట్రో టికెట్‌ ధరలు భారంగా ఉండడమే. హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు రూపకల్పనలో మెట్రోలో కనీస ధర రూ.8, గరిష్ట ధర రూ.19.00లు మాత్రమే. అయితే, మెట్రో రైలు ప్రారంభం నుంచే చార్జీలను అమాంతంగా పెంచేశారు. కనీస ధరను రూ.8 నుంచి రూ.10కి పెంచిన అధికారులు, గరిష్ట ధరను మాత్రం రూ.19.00ల నుంచి ఒకేసారి రూ.60.00లకు పెంచారు. నగరంలో గంటలోపు 30 కి.మీ మార్గంలోనే ప్రయాణించే దూరానికి రూ.60 వరకు వసూలు చేయడం అంటేనే నగర వాసులను మెట్రో ప్రయాణానికి దూరం చేయడమేనని సామాన్యులు అంటున్నారు. ఢిల్లీలో విమానాశ్రయానికి ప్రతేక్యంగా ఉన్న మెట్రోలో అమలు చేస్తున్న ధరలతో సమానంగా హైదరాబాద్‌ మెట్రో ధరలు ఉన్నాయని నగరానికి చెందిన రాజేష్‌ తెలిపారు. ఢిల్లీలోని ఇతర మార్గాల్లో 14 మెట్రోస్టేషన్‌ల వరకు సుమారు 27 కి.మీ దూరానికి టికెట్‌ రూ.40లే ఉందని తెలిపారు. మెట్రో ప్రారంభం నుంచి అధికంగా ఉన్న టిక్కెట్‌ ధరలపై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేసినా, ప్రయాణానికి దూరంగా ఉన్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సంస్థకే అనుకూలంగా వ్యవహరిస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ పేరుతో మాయ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశానికి రోల్‌ మోడల్‌గా నిలిచిన ఢిల్లీ మెట్రోలో ధరలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయి. అక్కడ ఫేర్‌ ఫిఏ్సషన్‌ కమిటీ నివేదిక అంతా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. ఇక్కడ మాత్రం ఫేర్‌ ఫిక్సెషన్‌ కమిటీ అనేది మాటల్లోనే వినిపిస్తోంది. ప్రైవేటు చేతుల్లో ఉన్న హైదరాబాద్‌ మెట్రోలో టిక్కెట్‌ ధరలను ఇష్టారాజ్యంగా పెంచి లాభాలు రాబట్టుకోవాలన్న ప్రయత్నమే తప్ప, ప్రజా రవాణా వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు మాత్రం జరగడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం హైదరాబాద్‌ మెట్రో రైలు టికెట్‌ ధరలను ప్రజల కోణంలో పునరాలోచించి నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలవంతంగా రుద్దే ప్రయత్నం. హైదరాబాద్‌ మెట్రో రైలులో టిక్కెట్‌ ధరలు ఇతర నగరాలతో పోల్చుతున్నారే తప్ప, ఈ ప్రాజెక్టు కోసం నిర్మాణ సంస్థకు ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలను లెక్కలోకి తీసుకోవడం లేదు. నగరంలో నిర్మిస్తున్న మొదటి మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 290 ఎకరాల భూములను నిర్మాణ సంస్థకు ధారాదత్తం చేసింది. వీటికి తోడు మెట్రో స్టేషన్‌లలో వ్యాపార సంస్థల నిర్వహణ, మెట్రో ఫిల్లర్లకు, డివైడర్లపై వ్యాపార ప్రకటనల హక్కులు కూడా అప్పగించింది. ప్రాజెక్టు రూపకల్పనలోనే ఆదాయాన్ని ఏవిధంగా రాబట్టుకోవచ్చన్న స్పష్టమైన విధివిధానాలు ఉన్నాయి. దాని ప్రకారం మెట్రో టికెట్‌ల ద్వారా 40 శాతం, నిర్మాణ సంస్థకు కేటాయించిన 290 ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ద్వారా 50, మరో 10 శాతం వ్యాపార ప్రకటనల ద్వారా రాబట్టుకోవాలి. కానీ, వాటన్నింటినీ ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మెట్రోల కన్నా ఎక్కువగా చార్జీలు వసూలు చేయడం పట్ల ప్రయాణీకులు నిరసనతో ఉన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com