హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ ఆచార్య అప్పారావు హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు భగ్నం చేశారు. వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనకు ప్రతీకారంగా ఈ కుట్రకు వ్యూహరచన జరిగిందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. భద్రాచలం- చర్ల రోడ్డుపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా చందన్ మిశ్రా, పృథ్వీరాజ్ అనే ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. మావోయిస్టు నేత హరిభూషణ్ ఆదేశాలతో వీసీ హత్యకు పథక రచన చేసినట్టు వారు పోలీసులకు తెలిపారు. హెచ్‌సీయూలో ఎంఏ చదువుతున్న బెంగాల్‌కు చెందిన చందన్ మిశ్రాకు కృష్ణా జిల్లా కేసరపల్లికి చెందిన పృథ్వీరాజ్‌తో వర్సిటీలోనే స్నేహం ఏర్పడిందని ఎస్పీ వివరించారు. కుట్ర పన్నిన ఇద్దరినీ భద్రాచలం సరిహద్దులో అదుపులోకి తీసుకున్నట్టు విశాల్ గున్నీ పేర్కొన్నారు. హెచ్‌సీయూలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన దేశంలో సంచలనం కల్గించింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ విశ్వవిద్యాలయం వీసీగా ఉన్న ఆచార్య అప్పారావుపై విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేసి ఆయనను సస్పెండ్ చేయాలంటూ పెద్దఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.