హైదరాబాద్ సంగతి ఇక వదిలేయండి సారూ!

ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉన్నప్పుడే సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకు అందుతాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అన్ని సంక్షేమ పథకాల్లో అవినీతికి అడ్టుకట్టు వేశామన్నారు. విభజన నష్టం నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు పలు అంశాలను వివరించారు. ‘పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాం. రూ.200 ఉన్న ఫించన్‌ను రూ.వెయ్యి చేశాం. కనురెప్ప, వేలిముద్రల ఆధారంగా నిజమైన అర్హులకు సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి పనితీరు పారదర్శకంగా ఉండేలా చేశాం. పుష్కరాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అద్భుత ఫలితాలు రాబట్టాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో అన్ని కార్యక్రమాల్లోనూ సాంకేతిక పరికరాల వినియోగాన్ని పెంచుతాం. పుష్కరాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలు, ఫింగర్‌ ప్రింట్స్‌ గుర్తించే పరికరాలు, డీఎన్‌ఏ పరికరాలతో నేరాలకు అడ్డుకట్ట వేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేసి రైతులను రుణవిముక్తులను చేశాం. రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పుష్కరాల కోసం రూపొందించిన కైజాలా యాప్‌ ప్రస్తుతం ప్లాట్‌ఫామ్‌గా మారింది. రాష్ట్రంలో ప్రజలు ఏ శాఖపై అయినా ఫిర్యాదు చేయడానికి కైజాలా యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఫిర్యాదు ఏ శాఖకు చెందినదో సంబంధిత అధికారులకు చేరుతుంది. వ్యవసాయ రంగంలో ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాంగ్రెస్‌ పాలనలో రైతులకు విత్తనాలు, ఎరువులు దొరకలేదు. మా ప్రభుత్వంలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశాం. భూసార పరీక్షలు చేసి ఏ పంట వేయాలో రైతులకు ముందుగానే సూచనలు చేస్తున్నాం. వ్యవసాయ అనుబంధ రంగాలపైనా దృష్టి సారించాం. ఉద్యాన పంటలు, పాడి పరిశ్రమ, చేపల పెంపకం వంటి రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు కావాల్సినంత విద్యుత్‌ అందిస్తున్నాం. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు చెక్‌డ్యామ్‌లు, నీటి కుంటలు, చెరువుల్లో పూడికతీత వంటి చర్యలు చేపట్టాం. మెట్ట ప్రాంతాల్లో పంటలకు సాగునీరు అందించేందుకు రెయిన్‌గన్లు వినియోగిస్తున్నాం. కరవు, వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమలో వేరుశన గ పంట ఎండిపోతోంది. పంటను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు, సేవల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాం. సాంకేతికతతో వర్షాలు, ఉష్ణోగ్రతలు, వాతావరణ హెచ్చరికల వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలు అందుబాటులో ఉంచుతున్నాం. అన్ని శాఖల్లోనూ సాంకేతికత వినియోగంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.’ అని సీఎం వివరించారు. ఫైబర్‌ కనెక్టివిటీతో రాష్ట్రం స్వరూపమే మారిపోతుంది. దీనిద్వారా అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇళ్లలోనూ వైఫై సౌకర్యం కల్పిస్తాం. ప్రస్తుత తరం విద్యార్థుల్లో మేధస్సు ఎక్కువ ఉంది… ఇంటర్నెట్‌ సౌకర్యం అందిస్తే వారు అద్భుతాలు సాధిస్తారు. ప్రజాసాధికార సర్వే ద్వారా ప్రజల స్థితిగతులను అంచనా వేసిన వారి జీవనగతిని మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. పేదలకు నెలకు కనీసం రూ.10వేల ఆదాయం వచ్చేలా కృషి చేస్తాం. పెన్షన్‌, బీమా, సంక్షేమ పథకాలు అందరికీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. వీలైనంత ఎక్కువ మందికి సంక్షేమ ఫలితాలు అందజేయడమే సుపరిపాలన. మేము చేపట్టే ఈ బృహత్తర కార్యక్రమం దేశంలోనే మొదటిసారి. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో వ్యవస్థల్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు నిర్వీర్యం అయ్యాయి. అవినీతితో ఎందరో అధికారులు జైళ్లకు కూడా వెళ్లారు. మేం అధికారంలోకి వచ్చాక పాలనను గాడిలో పెట్టాం. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అమెరికాలో కంప్యూటర్ల ద్వారా, చైనాలో స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఎక్కువ పనులు చేసుకుంటున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకునే కైజాలా యాప్‌ను రూపొందించి కృష్ణా పుష్కరాల్లో వినియోగించుకున్నాం. టెక్నాలజీ పని చేయదు.. పనితనాన్ని సులభం చేస్తుంది. నన్ను నమ్ముకున్న ప్రజలకు పారదర్శక పాలన అందించి… వారి ముఖాల్లో సంతోషం చూడాలన్నదే నా విజన్‌. అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తాం. ఎలక్ట్రానిక్‌ తరగతులు ఏర్పాటుచేస్తాం. వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం ద్వారా వేరేచోట ఉన్న ఉపాధ్యాయులతో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తాం. మొక్కల పెంపకం, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలు చేపడుతున్నాం. వీటిలో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆనందంగా పనిచేస్తూనే.. ఉత్తమ పనితీరు కనబర్చేలా చేస్తాం. దేశంలో టెక్నాలజీపై అవగాహన లేని సమయంలో హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమ తీసుకొచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు వెళ్లి బిల్‌గేట్స్‌తో సమావేశమయ్యాను. ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ఆయన సహకారం తీసుకున్నాం. అప్పుడు నేను చేసిన కృషితోనే ప్రస్తుతం హైదరాబాద్‌ ఐటీలో మేటిగా తయారైంది. ఇదే తరహాలో విశాఖను ఐటీలో అగ్రగామిగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాజధాని అమరావతిలోనూ ఐటీ పరిశ్రమల హబ్‌ ఏర్పాటు చేస్తాం. విజయవాడ, విశాఖ వంటి నగరాలు దేశంలో ఎక్కడా లేవు… కానీ వాటి విలువ తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు హైదరాబాద్‌ నుంచి వచ్చామని చెబితే పాకిస్థాన్‌లోని హైదరాబాదా అని అడిగారు. అలాంటి హైదరాబాద్‌కు ప్రపంచపటంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాం. అమరావతి కోసం చేపట్టిన భూసేకరణ దేశంలోనే రికార్డు సృష్టించింది. వేలాది ఎకరాల భూమిని రైతులే స్వచ్ఛందంగా ఇవ్వడం దేశంలో ఇప్పటివరకు లేదు. అమరావతి నిర్మాణాన్ని విదేశీ సంస్థలకు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. స్వదేశీ సంస్థలతోనే నిర్మాణం చేయొచ్చు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అమరావతిని ప్రప్రంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకే సింగపూర్‌, జపాన్‌ లాంటి దేశాలను నిర్మాణంలో భాగస్వామ్యులను చేస్తున్నాం. నాకు ప్రచారం అవసరం లేదు. ప్రజలే నా గురించి మాట్లాడుకుంటారు. మినిమం 80శాతంం ప్రజలను తృప్తి పరిచేలా చేయాలన్నదే నా లక్ష్యం. పుష్కరాల నిర్వహణపై 98శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై కొందరు సోషల్‌మీడియాలో ఇష్టానుసారంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. నేరాలను, నేర ప్రవృత్తిని పెంచేలా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడమే కొందరు లక్ష్యంగా పెట్టుకున్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులకే నేరాలు చేయాలని అనిపిస్తుంది. మనిషికి నచ్చిన పని చేయడం.. దాని ద్వారా అతడికి ఆనందం కలిగించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. డబ్బు, టెక్నాలజీ ఆనందం కలిగించలేవు. మనకు నచ్చిన పని చేస్తేనే మానసిక ఆనందం కలుగుతుంది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విహార యాత్రలు మొదలైనవి వ్యక్తిగత జీవితంలో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. సముద్ర తీరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉంది. గోదావరి, కృష్ణా నదులు మన రాష్ట్రంలోనే సముద్రంలో కలుస్తాయి. ఎగువ రాష్ట్రాలు ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కడితే మన రాష్ట్రానికి నీటి విషయంలో అన్యాయం జరుగుతుంది. అందుకే దామాషా ప్రకారం నీరు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రం రూ.1800కోట్లు ఖర్చుపెడితే కేంద్రం రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంకా రూ.1700కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. తెలుగుజాతికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2018లోగా పూర్తిచేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాం’ అని చంద్రబాబు వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com