10వేల బుద్ధుల నగరం

సిటీ ఆఫ్ 10000 బుద్ధాస్ – పి.యస్.యమ్.లక్ష్మి, విశ్రాంత సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్, హైదరాబాద్.

ఏ దేశం వారైనా, ఏ మతంవారైనా, భగవంతుడుని ప్రపంచానికి ఆధారమని నమ్మి ఆ శక్తికి ఒక రూపాన్నిచ్చి ఆరాధిస్తారు. ఆ భగవంతునికి ఆలయాలు నిర్మించి, తద్వారా అనేకులు ఆ శక్తిని తెలుసుకోవటానికి, ఆ భగవంతుని ఆరాధించటానికి అవకాశం కల్పిస్తారు. ఆ మహనీయులు నడచిన మార్గంలో నడిచి తమ జీవితాలు ధన్యం చేసుకోవాలనుకుంటారు. అలాంటి ఒక పవిత్ర స్ధలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో నగారానికి 110 మైళ్ళ దూరంలోని లామేజ్ లో బౌద్ధారామం ఉంది. అమెరికాలో మొదట నిర్మించబడిన బౌధ్దారామాలలో ఇది కూడా ఒకటి. దీనిని ప్రారంభించినవారు వెస్ట్రన్ బుధ్దిజంలో ప్రముఖులైన హువాన్ హో. 1974లో రియాల్మ్ బుధ్దిస్ట్ అసోసియేషన్ వారు ఈ స్ధలాన్ని కొని 1976కల్లా ఇక్కడ ఇంటర్నేషనల్ సెంటర్ స్ధాపించారు.

హువాన్ హో తూర్పున మొదలయిన బౌధ్ద ధర్మాన్ని ప్రపంచమంతా వ్యాపింపచేయాలని, పశ్చమ దేశాలవారికి బుధ్దుడి ప్రవచనాలు అందజేయాలనే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ సంస్ధని స్ధాపించారు. ఈ బౌధ్దారామము, దానికి సంబంధించిన ఇతర భవనాలు ప్రస్తుతం 80 ఎకరాల స్ధలంలో నిర్మింపబడినా, ఇంకా చాలా భూమి తోటలతో, పొలాలతో, అడవులతో విలసిల్లుతున్నది. ఈ బౌధ్దారామం విశేషాలు.

హాల్ ఆఫ్ 10000 బుధ్దాస్
ఇదే ముఖ్యమైన హాల్. ఇందులో అందరికీ ప్రవేశం వున్నది. ఈ హాల్ లో ప్రవేశించగానే ఎదురుగా 20 అడుగుల ఎత్తయిన అవలోకితేశ్వర బోధిసత్వ విగ్రహం ఎత్తయిన ప్రదేశంలో దర్శనమిస్తుంది. ఈయనకి వెయ్యి చేతులు. హాలంతా ఎర్రటి తివాచీ పరచి వుంటుంది. దీనిమీద పచ్చని కుషన్స్ వేసి వుంటాయి. ప్రార్ధనలు చేసేవారు వాటిమీద తలలానించి ప్రార్ధిస్తారు. కొందరు ఇక్కడ మెడిటేషన్ కూడా చేస్తారు. అత్యంత ప్రశాంతంగా వుండే ఈ హాల్లోనే రెండు పెద్ద దీప స్తంభాలున్నాయి. వాటి మీదకూడా చిన్న చిన్న బుధ్ధ ప్రతిమలు వున్నాయి. ఇక్కడ గోడలకున్న అద్దాల వెనుక వున్న చిన్న చిన్న అరలలో ఒకే సైజులో వున్న బుధ్ధుని విగ్రహాలు పదివేలున్నాయి. వీటితోనే ఈ హాల్ కి, ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. రెండో అంతస్తులో ఈ సిటీకొచ్చిన కొత్తల్లో శ్రీ హో నివసించారు, వారి శిష్యులకి బోధించారు. ప్రస్తుతం ఇది మెమోరియల్ హాల్. ఇందులో గౌతమ బుధ్ధుడివి, మాస్టర్ హోయన్, మరియ హో ల అవశేషాలున్నాయి. దీనిలోకి ప్రత్యేక దినాలలో మాత్రమే ప్రవేశం వున్నది. ఇక్కడ ఇంకా విద్యా విలువలను పెంచటానికి స్కూల్స్, యూనివర్సిటీ, బౌధ్ధ సన్యాసులకు వసతి గృహాలు, అక్కడ నివసించేవారికోసం అతి పెద్ద డైనింగ్ హాల్, దర్శకుల కోసం వెజిటేరియన్ కేంటీన్ మొదలయినవి ఎన్నో వున్నాయి. కానీ దర్శకులని అన్ని ప్రదేశాలకూ అనుమతించరు. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో లేళ్ళు, నెమళ్ళు యధేఛ్ఛగా సంచరిస్తాయి.

City of 10K Budhdhas-TNI

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com