150 స్థానాల్లో ఆయనకు ప్రజామద్దతు

తమిళనాడులోని అత్యధిక శాసనసభ నియోజకవర్గాల్లో రజనీకాంత్‌కు ఆకర్షణ ఉందని, ఈ మేరకు ఓ రహస్య సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నిఘావర్గాలు నివేదిక పంపాయని ప్రచారం సాగుతోంది. దీంతో కంగుతిన్న సర్కారు అప్రమత్తమైనట్లు తెలిసింది. రజనీని లక్ష్యంగా చేసుకుని రాజకీయ విమర్శల దాడికి వ్యూహరచన చేసిందని సమాచారం. ప్రస్తుతం సూపర్‌స్టార్‌పై రాష్ట్రమంత్రులు చేస్తున్న విమర్శలకు ఇదే కారణమని తెలిసింది. రాజకీయ ప్రవేశాన్ని ఖరారు చేసినప్పటికీ ఇప్పటివరకు పార్టీని మాత్రం రజనీకాంత్‌ ప్రారంభించలేదు. ప్రస్తుతం ‘రజనీ పీపుల్‌ ఫోరం’ బలోపేతం చేస్తూ తన రాజకీయ అరంగేట్రానికి బలమైన పునాదులు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన రాజకీయ పార్టీ ప్రారంభంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల రజనీకాంత్‌ అమెరికాకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడులో ఆయనకు ప్రజామద్దతు ఎలా ఉందనే విషయాన్ని నిఘావర్గాలతో రాష్ట్ర ప్రభుత్వం రహస్య సర్వే చేయించిందని సమాచారం. రాష్ట్రంలోని 234 శాసనసభ నియోజకవర్గాల్లో 150 స్థానాల్లో ఆయనకు ప్రజామద్దతు ఉందనే విషయం వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో రజనీకాంత్‌కు 35 నుంచి 40 శాతం మేరకు ఓటు బ్యాంకు సిద్ధమైందని తేలినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో 15 శాతం దళితులు, 8 శాతం మైనారిటీలు, 15 శాతం ఇతర సామాజికవర్గం, రాజకీయ అసంతృప్తులు ఉన్నారని ప్రభుత్వానికి అందించిన నివేదికలో నిఘా వర్గాలు వెల్లడించాయని సమాచారం. ఇది అధికార పార్టీకి దిగ్భ్రాంతికి కలిగించిందని ప్రచారం సాగుతోంది. అందువల్ల ఇప్పటి నుంచే రజనీకాంత్‌పై రాజకీయ విమర్శల దాడి చేయాలని రాష్ట్రమంత్రులు, పార్టీ రాష్ట్ర నిర్వాహకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. ‘రజనీకాంత్‌ అధికారాన్ని చేజిక్కించుకోలేరు. కావాలంటే కారైకుడి ఆచ్చిని చేజిక్కించుకోగలర’ని రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూరు రాజు, ‘నిన్న కురిసిన వర్షంలో నేడు మొలిచిన పుట్టగొడుగు. త్వరలో కనిపించకుండా పోతారు’ అంటూ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ చేసిన వ్యాఖ్యలకు అధిష్ఠానం ఆదేశాలే కారణమని ప్రచారం జరుగుతోంది. ప్రైవేటు టీవీ ఛానెళ్లు నిర్వహించే చర్చావేదికల్లో కూడా రజనీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని అన్నాడీఎంకే వక్తలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రజనీకాంత్‌ను రాజకీయంగా దెబ్బతీయాలని అధికారపార్టీ కంకణం కట్టుకుందని విమర్శలు ఉన్నాయి. మరోవైపు అన్నివర్గాల ప్రజల మద్దతు కోసం రజనీకాంత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చెన్నై మదురవాయల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిన ఎంజీఆర్‌ విగ్రహావిష్కరణలో పాల్గొన్న రజనీకాంత్‌ ‘ఎంజీఆర్‌ తరహాలో సుపరిపాలనను అందిస్తాన’ని వ్యాఖ్యానించారు. దీని ద్వారా అన్నాడీఎంకే కార్యకర్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొద్దిరోజుల కిందట నగరంలో జరిగిన ‘కాలా’ ఆడియో ఆవిష్కరణ వేడుకల్లో రజనీ మాట్లాడుతూ.. ‘శివాజి’ విజయోత్సవంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తనను ప్రశంసిస్తూ మాట్లాడారని, ఆయన స్వరం మళ్లీ వినాలని ఆసక్తితో ఉన్నట్టు తెలిపారు. దీని ద్వారా తనకు కరుణానిధి వ్యతిరేకి కాదనే సంకేతాలు కూడా పంపారు. డీఎంకేలో స్టాలిన్‌ నాయకత్వాన్ని అంగీకరించని వారిని తాను ప్రారంభించనున్న పార్టీలోకి ఆహ్వానించడం కోసమే రజనీకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో జయలలిత మరణం, కరుణానిధి అనారోగ్యం కారణంగా ఏర్పడిన రాజకీయ శూన్యతను కచ్చితంగా భర్తీ చేయగలనని రజనీకాంత్‌ విశ్వసిస్తున్నారని సమాచారం. దీని కోసం అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని తెలిసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com