1976 యాపిల్ కంప్యూటర్. ధర కోట్లలో.

స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ సృష్టికర్త స్టీవ్‌ జాబ్స్‌ తన అరుదైన ఆవిష్కరణలతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. కంప్యూటర్‌.. ఫోన్‌.. టాబ్లెట్‌.. స్మార్ట్‌వాచీ వంటి ఆవిష్కరణలతోప్రపంచవ్యాప్తంగా ఆయన ఎంతో ఖ్యాతిని గడించాడు. అయితే ప్రారంభంలో తన ఆవిష్కరణలకు ఎంత ఆదరణ లభించిందో మనకుతెలియదుగానీ.. అప్పట్లో సృష్టించిన మొదటి యాపిల్‌-1 కంప్యూటర్‌ మాత్రం ఇప్పుడు అధిక ధరనే అర్జిస్తోంది. అవును మీరు విన్నది నిజమే.. అమెరికాకు చెందిన ‘ఛారిటీబజ్‌’ అనే సంస్థ స్టీవ్‌జాబ్స్‌ మొట్టమొదటిగా తయారుచేసిన యాపిల్‌ కంప్యూటర్‌ను వేలంలో పెట్టింది. ఈ వేలంలో వచ్చే పది శాతాన్ని సామాజిక అవసరాల కోసం ఉపయోగించనున్నారు. ఈ వేలం ప్రారంభమై వారం గడుస్తుంది. ప్రారంభమైన కొద్దిరోజులకే 270,000 డాలర్లు పలికింది. అంటే దాదాపు రూ. 1కోటి 8లక్షలకు పైనే.ఈ వేలం ముగియడానికి ఇంకా 5 రోజుల సమయం ఉంది. అప్పటికి ఇది సుమారు పది లక్షల డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొట్టమొదటి యాపిల్‌ కంప్యూటర్‌ అంటే ఆ మాత్రం క్రేజ్‌ ఉంటుంది కదా. ఈ యాపిల్‌-1 కంప్యూటర్‌ను స్టీవ్‌ తన సహ-భాగస్వామి అయిన స్టీవ్‌ వోజ్నాయిక్‌తో కలిసి రూపొందించాడు. 1976లో తయారుచేసిన ఈ కంప్యూటర్‌.. స్టీవ్‌ సొంత ఇంటిలో తయారుచేశారు. అందుకే దీనికి వేలంలో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఇలాంటి మొదటి తరం యాపిల్‌ కంప్యూటర్‌లు 200 పైగానే ఉండేవట. ప్రస్తుతం ఉన్నవి 60కంటే తక్కువేనని చెబుతున్నారు. వీటి ప్రత్యేకత గురించి చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ మొదటి యాపిల్‌ కంప్యూటర్లలోని విడిభాగాలన్నీ చేతితోనే తయారుచేశారట. ఇందులో ఉండే బేసిక్‌ లాంగ్వేజ్‌, ప్రోగ్రామింగ్‌ మెమోరీ క్యాసెట్‌ల రూపంలో ఉంటుంది. ప్రస్తుతం వేలంలో పెట్టిన కంప్యూటర్‌ను మొదట ఎవరు కొన్నారన్నది తెలియదు. కానీ అతని వద్ద నుంచి దీనిని 2000 సంవత్సరంలో 18,000 డాలర్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ వేలంలో లక్షల డాలర్లకు ఈ కంప్యూటర్‌ను అమ్మనున్నారు. కారణం ఏదైనా ఈ వేలం ద్వారా స్టీవ్‌ జాబ్స్‌ పనితనం మరోసారి రుజువైంది. యాపిల్‌ ఉత్పత్తులంటే అప్పటికి.. ఇప్పటికీ.. ఎప్పటికీ క్రేజే మరి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com