67 బిలియన్‌ డాలర్లను బదిలీ చేశారు

విదేశాల నుంచి ప్రవాసుల నుంచి చెల్లింపుల రూపంలో అందే సొమ్ము అత్యధికంగా భారతదేశానికే చేరుకుంటోంది. ఈ విషయంలో ప్రపంచ దేశాల్లో భారత్ ముందు వరసలో ఉందని రెమిట్ స్కోప్‌ అనే నివేదిక వెల్లడించింది. ప్రవాస భారతీయులు 2017లో భారత్‌కు 67 బిలియన్‌ డాలర్లను పంపినట్లు తెలిపింది. విదేశాల్లో ఉండే ఆసియా-పసిఫిక్ ప్రాంతీయులు మొత్తం మీద 256బిలియన్‌ డాలర్లు ఈ ప్రాంతానికి పంపినట్లు ఆ నివేదిక పేర్కొంది.‘రెమిట్‌ స్కోప్‌- రెమిటెన్స్‌ మార్కెట్స్‌ అండ్ ఆపర్చ్యునిటీస్- ఆసియా అండ్‌ ది పసిఫిక్’ పేరుతో ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. 69 బిలియన్‌ డాలర్లను ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపడంతో భారత్ అగ్రస్థానంలో నిలవగా, 64 బిలియన్లతో చైనా రెండో స్థానంలో, 33బిలియన్లతో ఫిలిఫ్పైన్స్‌ మూడో స్థానాన్ని ఆక్రమించాయి. మొదటి పది స్థానాల్లో పాకిస్థాన్ , వియాత్నం చోటు దక్కించుకున్నాయి. ఆసియా- ఫసిఫిక్ ప్రాంతానికి అందే ఈ చెల్లింపుల్లో 70 శాతం ఈ ప్రాంతానికి బయట నుంచే అందుతున్నాయి. 32 శాతం గల్ఫ్‌దేశాలు, 26 శాతం ఉత్తర అమెరికా ప్రాంతం, 12 శాతం యూరప్‌ దేశాల నుంచి స్వదేశాలకు ఈ చెల్లింపులు చేరుతున్నాయి. 2030 నాటికి 6 ట్రిలియన్‌ డాలర్లు వర్థమాన దేశాలకు చేరే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది. దానిలో సగభాగం ఆసియా-పసిఫిక్ ప్రాంతానికే చేరనున్నట్లు తెలిపింది. గత సంవత్సరం ఆసియా- పసిఫిక్‌ ప్రాంతానికి చెందిన వలస కార్మికులు తమ కుటుంబాలకు 256 బిలియన్‌ డాలర్లు పంపారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం చెల్లింపుల్లో 53 శాతం. 2008 నుంచి వీటిలో 4.87 శాతం వృద్ధి నమోదవుతోంది.పేదరికం ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెల్లింపులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఈ రెమిటెన్స్‌ పంపిణీ అసమానంగా ఉంది. అధికారికంగా అందే సహాయంతో పోల్చుకుంటే విదేశాల నుంచి అందే సొమ్మే ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో 10రెట్లు ఎక్కువగా ఉంది. 400మిలియన్ల ప్రజానీకంలో పది మందిలో ఒకరు ఈ రెమిటెన్స్‌తో ఏదో ఒక రకంగా సంబంధం కలిగిన వారే. 320 మిలియన్ల కుటుంబాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు వీటి వల్ల ఎక్కువగా లాభం పొందుతున్నారు. అయితే వీటికి కాలం చెల్లిన కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఈ చెల్లింపులను సేవింగ్స్‌, పెట్టుబడులుగా మలుచుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక వెల్లడించింది. ఇప్పటికీ ఎక్కువ భాగం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాంతంలోని 1 మిలియన్‌ లావాదేవీలు డిజిటల్‌లోకి మారాయని వివరించింది. ఈ చెల్లింపుల్లో 70 శాతం నిత్యావసరాల కోసమే వినియోగిస్తున్నారని, మిగతా 30 శాతం భవిష్యత్తు అవసరాల కోసం వాడుతున్నారని తెలిపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com