74వేల కోట్లు ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రూ.74,542 కోట్లు రావాలని జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ) అభిప్రాయపడింది. ఇది రెవిన్యూ లోటు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, వెనుబడిన ప్రాంతాల అభివృద్ధి వంటి గణించినదగిన లెక్కల్లోని భాగమేనని పేర్కొంది. రాష్ట్రానికింకా రావల్సిన రూ.74,542 కోట్ల నిధుల్ని రానున్న బడ్జెట్లలో కేంద్రం కేటాయించాలని కోరింది. ఏపీకి ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని, 10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, మాజీ ఐఏఎస్‌ అధికారులు పద్మనాభయ్య, ఐవైఆర్‌ కృష్ణారావు, జయప్రకాశ్‌ నారాయణ్‌లతోపాటు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్‌, తోట చంద్రశేఖర్‌ హైదరాబాద్‌లో సమావేశమై విభజన హామీలకు సంబంధించి 11 అంశాల అమలుపై సుదీర్ఘంగా చర్చించి నివేదిక రూపొందించారు. నివేదికలోని అంశాల్ని పవన్‌కల్యాణ్‌, కమిటీ నేతలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రధానమంత్రి మోదీకి కూడా నివేదికను పంపించనున్నట్లు కమిటీ ప్రకటించింది. నివేదికలోని అంశాలు..
* ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటించారు. నాటి కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదించింది. కానీ 14వ ఆర్థిక సంఘం ప్రత్యేకహోదా అనేది రద్దు చేయాలని సిఫార్సు చేసినట్లు ఎన్డీయే ప్రభుత్వం తెలిపింది. కానీ ఆర్థిక సంఘం నివేదికలో ఎక్కడా లేదు. ప్రత్యేక హోదాకిక కాలం చెల్లిందని కేంద్రం చెపుతోంది కానీ ఇప్పటికీ 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కలిగి ఉన్నాయి.
* రానున్న ఐదేళ్ల పాటు ఏపీ ఆదాయ లోటుతో కొనసాగనుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని 95 శాతం ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణ రాష్ట్రానికే వెళ్లాయి. పంపకానికి చాలా కాలం పడుతుంది. ఏపీకి నష్టం జరిగినందున ప్రత్యేక హోదా హామీని అమలుచేయాలి.
* కేంద్ర ఆర్థిక మంత్రి సూచన మేరకు ప్రత్యేక ప్యాకేజీ కింద సాయం తీసుకోవడానికి ఏపీ అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ.16,447 కోట్లను ఇస్తామని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ ఏమీ చెల్లించలేదు.
* అకౌంటెంట్‌ జనరల్‌ అంచనాల ప్రకారం రాష్ట్రానికి 2014-15లో ఆదాయ లోటు రూ.16,078 కోట్లు ఉంది. కానీ కేంద్రం ఈ లోటు కొత్త పథకాల వల్ల వచ్చిందని, నికరంగా రూ.4117.89 కోట్లు లోటు మాత్రమే ఉందని, అందులో రూ.3979.50 కోట్లు మాత్రమే ఇచ్చింది.
* మొత్తం 11 జాతీయస్థాయి సంస్థలు ఇస్తామని చెప్పిన కేంద్రం 9 మంజూరుచేసింది. విశాఖ, విజయవాడలకు మెట్రో ప్రాజెక్టులివ్వాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com