90ఏళ్ల అద్వానీ మళ్ళీ బరిలోకి

2019 సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ.. ఇప్పటి నుంచే కార్యాచరణ దిశగా అడుగులు వేస్తోంది. గత కొన్ని రోజులుగా ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూస్తుండటంతో ఈ ప్రభావం వచ్చే ఏడాది ఎన్నికలపై పడకుండా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలను మళ్లీ రంగంలోకి దించాలని భావిస్తోంది. వయసు నిబంధనలను పక్కనపెట్టి ఎల్‌కే అడ్వాణీ లాంటి సీనియర్‌ నేతలను ఎన్నికల బరిలో నిలబెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఎల్‌కే అడ్వాణీ పోటీ చేస్తే బాగుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడుతున్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఆయనతో పాటు మురళీ మనోహర్‌ జోషి లాంటి అగ్రనేతలను కూడా భాజపా బరిలోకి దించాలని చూస్తున్నట్లు ఆ వార్తలు పేర్కొన్నాయి. ఈ విషయమై ఇటీవలే ప్రధాని మోదీ.. అడ్వాణీని కలిసినట్లు సమాచారం. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా కూడా దీనిపై అడ్వాణీతో చర్చలు జరిపినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే 75ఏళ్ల పైబడిన వారిని ఎన్నికలు, పదవులకు దూరంగా ఉంచాలని భాజపా ఆ మధ్య భావించింది. అయితే గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ఆ నిబంధనను సడలిస్తూ వస్తోంది. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో వయసు నిబంధనను పక్కనబెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్పను ఎన్నుకొంది. తాజాగా అడ్వాణీ, జోషీలను వచ్చే ఎన్నికల బరిలో దింపాలని భావిస్తోంది. కాగా.. గత కొన్ని రోజులుగా ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో ముసలం ఏర్పడింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్డీయేకు దూరమవగా.. శివసేన, మరిన్ని మిత్ర పక్షాలు కూడా కూటమి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్‌ నేతలైన అడ్వాణీ, జోషీలను మళ్లీ ఎన్నికల కార్యకలపాల్లో భాగం చేయడంతో వారు భాజపా, మిత్రపక్షాల మధ్య వారధిగా ఉండే అవకాశాలున్నాయి. మరోవైపు పార్టీ శ్రేణులకు కూడా సానుకూల సంకేతాలు వెళ్తాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అడ్వాణీ పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత నుంచి పార్టీలో ఆయన స్థానం తగ్గుతూ వస్తోంది. భాజపా ఉన్నతస్థాయి నిర్ణాయక మండలి అయిన పార్లమెంటరీ బోర్డులోనూ అడ్వాణీ, జోషీకి స్థానం కల్పించలేదు. దీనికి బదులుగా భాజపా అధ్యక్షుడు అమిత్‌షా మార్గదర్శక మండలి పేరుతో ఐదుగురు సభ్యులతో కూడిన సలహా మండలిని ఏర్పాటుచేసి అందులో అడ్వాణీ, జోషీలను చేర్చారు. వీరితో పాటు ప్రధాని మోదీ, అమిత్‌షా, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ మార్గదర్శక మండలిలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ మండలి ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం గమనార్హం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com