DailyDose

గుజరాత్‌కు తరలిపోతున్న కియాను ఏపీకి తెచ్చా-రాజకీయం-03/31

గుజరాత్‌కు తరలిపోతున్న కియాను ఏపీకి తెచ్చా

1. ‘అధికారమివ్వండి.. రెండ్రోజుల్లోనే రుణమాఫీ’

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ధనవంతులదే రాజ్యమని ఐఏసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఐదేళ్ల పాలనలో విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, చోక్సీలకే లబ్ధి చేకూర్చారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీ రైతుల రుణాలను రెండు రోజుల్లోనే మాఫీ చేస్తామని ప్రకటించారు.

2. మీ కేసుల కోసం మేం ఓట్లు వేయాలా?

వైకాపా పేదవాళ్లను దోచుకొనే పార్టీ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. సంక్షేమం గురించి సరైన హామీలివ్వలేక ఒక్క అవకాశం.. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారన్నారు. ఆ ఒక్క అవకాశం ఇస్తే వైకాపా నాయకులు రాష్ట్రాన్ని ముంచేస్తారని ఎద్దేవా చేశారు. ‘‘జగన్‌ కేసుల కోసం ప్రజలంతా ఓట్లు వేయాలా? ఆయన జైలుకు వెళ్లకుండా మనం కాపాడాలా?’’ అని ప్రశ్నించారు.

3. భాజపా పగటికలలు కంటోంది: కేసీఆర్‌

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నామని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. పాలమూరు జిల్లా తెరాస అధికారంలోకి రాకముందు, వచ్చాక ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. విద్యుత్‌, పింఛన్లు, రైతుబంధు, మిషన్‌ భగీరథ తదితర అనేక కార్యక్రమాలను చేపడుతూ సంక్షేమంలో ముందుకెళ్తున్నామన్నారు. అధికారంలోకి వస్తామని భాజపా పగటి కలలు కంటోందన్నారు.

4. ఒకేసారి 2.3లక్షల ఉద్యోగాల భర్తీ: జగన్‌

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువత కోసం ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలను ఒకే నోటిఫికేషన్‌తో భర్తీ చేస్తామని వైకాపా అధినేత జగన్‌ ప్రకటించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. స్థానిక ఉన్న పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామన్నారు.

5. మోదీ మళ్లీవస్తే హిట్లర్‌ పాలనే:విశాఖలో కేజ్రీవాల్‌

రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలు దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ముఖ్యమైనవని ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. చంద్రబాబు ఏపీని మోడర్న్‌ రాష్ట్రంగా మార్చారని, ఆయన మరోసారి సీఎం కావాలని ఆకాంక్షించారు. విశాఖలో నిర్వహించిన తెదేపా భారీ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు, బంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కలిసి ఆయన పాల్గొన్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే హిట్లర్‌ పాలన వచ్చినట్లేనన్నారు.

6. నిధులు రావాలంటే బలమైన శక్తిగా మారాలి

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర నిధులు సక్రమంగా అందాలంటే బలమైన శక్తిగా ఉండాలన్నారు. అందుకే తెరాసకు ఓటెయ్యాలని కోరారు. రెండు సీట్లతో తెలంగాణ సాధించామని, 16 సీట్లను గెలిపిస్తే అభివృద్ధిలో ముందుంటూ, నిధులు రాబట్టుకుంటామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

7. ‘గుజరాత్‌కు తరలిపోతున్న కియాను ఏపీకి తెచ్చా’

ఆటోలు, ట్రాక్టర్లకు థర్డ్‌ పార్టీ బీమాను ప్రభుత్వమే చెల్లిస్తోందని చంద్రబాబు అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని.. పేదలకు రుణభారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించారు. రాష్ట్రమంతా తెదేపా గాలి వీస్తోందని.. దాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. గుజరాత్‌కు తరలిపోతున్న కియా మోటార్స్‌ను మన రాష్ట్రానికి.. వెనుకబడిన అనంతపురం జిల్లాకు తీసుకొచ్చానన్నారు. అదీ తన శక్తి అని చెప్పారు.

8. దేనికి అడ్డుపడ్డానో మోదీ చెప్పాలి: కేసీఆర్‌

ఐదేళ్లలో దేశానికి ప్రధాని మోదీ చేసిందేమిటో చెప్పాలని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చి అబద్ధాలు వచ్చ చెప్పారని విమర్శించారు. అభివృద్ధి చేస్తామంటే తాను అడ్డం పడ్డానంటూ మోదీ ఆరోపించారని.. దేనికి అడ్డుపడ్డానో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాన్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ మాట్లాడారు. తెరాస రాకముందు మహబూబ్‌నగర్‌ ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలను కోరారు.

9. ఆ సత్తా గులాబీ ఎంపీలకే ఉంది: కవిత

తెలంగాణ రాష్ట్రం తరహాలో దేశం సమగ్ర అభివృద్ధి జరగాలంటే 16 ఎంపీ స్థానాల్లో తెరాసకే పట్టం కట్టాలని నిజామాబాద్‌ ఎంపీ కవిత ప్రజలను కోరారు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని తీసుకొచ్చే సత్తా గులాబీ ఎంపీలకే ఉందన్నారు. ఏడాదిలో కాళేశ్వరం నీటితో గ్రామాలను సస్యశ్యామలం చేస్తామన్నారు.

10. స్పృహతోనే కాంగ్రెస్‌లో చేరా: శతృఘ్నసిన్హా

పూర్తి స్పృహతోనే భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు సినీ నటుడు, రాజకీయ నాయకుడు శతృఘ్నసిన్హా చెప్పారు. తన కుటుంబానికి ఆప్తుడైన లాలూ ప్రసాద్‌యాదవ్‌ కూడా ఇదే సలహా ఇచ్చారని అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ, సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌లు తమ తమ పార్టీల్లో చేరాల్సిందిగా తనను ఆహ్వానించారని తెలిపారు. పరిస్థితులు ఎలా ఉన్నా, తాజా లోక్‌ సభ ఎన్నికల్లో పాట్నాసాహిబ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు చెప్పారు.