గత నాలుగు నెలలుగా వేతన బాకాయిలు చెల్లించని కారణంగా ఏప్రిల్ 1 నుంచి విధులు బహిష్కరిస్తామని జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాజమాన్యం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. డిసెంబరు మాసానికి చెందిన బకాయిలు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి వినయ్ దూబే ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా లేఖ రాశారు. ‘‘సంస్థ కార్యకలాపాల్లో వీలైనంత త్వరగా స్థిరత్వం సాధించడానికి భారత బ్యాంకుల కన్సార్టియంతో చర్చలు జరుపుతున్నాం. ఇందు కోసం సంస్థ యాజమాన్యం, డైరెక్టర్ల బోర్డు నిరంతరం పరిష్కార ప్రణాళికలు రూపొందించడంలో నిబద్ధతతో పనిచేస్తోంది. ఈ ప్రక్రియలో కొన్ని సంక్లిష్ట సమస్యలు తలెత్తినందున మేం అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోంది. కాబట్టి ప్రస్తుతానికి మేం డిసెంబరు, 2018 వేతన బకాయిలు మాత్రమే చెల్లించగలుగుతున్నాం. ఇది మీ ఆర్థిక ఇబ్బందులకు ఏమాత్రం ఉపశమనం కలిగించదని తెలుసు. సంస్థ పట్ల మీ నిబద్ధతను గుర్తించిన యాజమాన్యం త్వరలోనే మరిన్ని నిధులు సేకరించి తదుపరి బకాయిలు చెల్లిస్తామని తెలియజేస్తున్నాం’’ అని ఉద్యోగులకు రాసిన లేఖలో దూబే పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఉద్యోగుల బృందం బకాయిలు చెల్లించే నిర్దిష్ట తేదీ చెప్పాలని.. అలాగే సంస్థ భవిష్యత్తు ప్రణాళికను కొత్త యాజమాన్యం వెల్లడించాలని కోరారు. అప్పుడే విధుల బహిష్కరణ నిర్ణయంపై పునరాలోచిస్తామని తెలిపారు.
నిధులు సేకరించి బకాయిలు చెల్లిస్తాం
Related tags :