కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లుగా వివిధ హోదాల్లో పని చేశానని, కరడు గట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న తాను తప్పనిసరి పరిస్థితుల్లో భాజపాలో చేరుతున్నట్లు సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న లోపాలు, దిద్దుబాటు చర్యల్లో విఫలం కావడం సహా ఇంకా అనేక విషయాల్లో కలత చెంది బాధాతప్త హృదయంతో పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శతాబ్దాల క్రితం పుట్టిన పార్టీలో మధ్యవర్తుల ప్రమేయం వల్ల తన లాంటి ఎంతో మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గత 27 ఏళ్ల నుంచి వివిధ దశల్లో సద్భావనా యాత్రలు చేశామని గుర్తు చేసుకున్నారు. ఇందుకు ఫలితంగా పీస్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా కింగ్స్ విశ్వవిద్యాలయం ద్వారా డాక్టరేట్ సైతం తనకు ప్రదానం చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు నాయకుల ఎంపికకు డబ్బులనే ప్రామాణికంగా చూస్తుండడం వల్ల కలత చెందానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత తప్పిదాలతో ఓడిపోయి ఈవీఎంలపై నెపం నెట్టారని, ఇప్పుడు అవే లోపాలతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వామి అవుదామని భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు రాహుల్‌కు లేఖ పంపినట్లు పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
40ఏళ్ల అనుబంధంతో తెగతెంపులు
Related tags :