చంద్రునిపై తిరిగి కాలు మోపేందుకు అమెరికా గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. నాసా చేస్తున్న ఈ ప్రయత్నాలను వేగవంతం చేయాలని ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తాజాగా ఆదేశించారు. 2028 నాటికి చంద్రునిపై చేరుకునేందుకు నాసా ప్రణాళికలు సిద్ధం చేసుకోగా.. 2024 నాటికే అక్కడ అడుగుపెట్టాలని తాజా లక్ష్యాన్ని పెన్స్ నిర్దేశించారు. అలబామలోని అమెరికా స్పేస్ అండ్ రాకెట్ సెంటర్లో మంగళవారం పెన్స్ మాట్లాడుతూ తాజా లక్ష్యాన్ని విధించి నాసాపై ఒత్తిడి పెంచారు. అయితే 2024 నాటికే వ్యోమగాములను అక్కడికి పంపడం అంత సులువు కాదని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా చంద్రునిపై ప్రయోగాలకు ఎందుకంత తొందరపడుతోందన్న అంశం పలువురిలో ఆసక్తి రేపుతోంది. మార్స్‌పైకి మానవ సహిత యాత్ర అనుకూలించాలంటే.. అందుకు మొదటగా చంద్రునిపై బేస్ ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యమైంది. చంద్రునిపై బేస్‌స్టేషన్.. ఒక పరీక్షా కేంద్రంగానే కాకుండా మార్స్ మిషన్లు చేపట్టే వారికి మధ్యలో విరామ కేంద్రంగా కూడా ఉపయోగపడనుంది. అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. చైనాతోపాటు భారత్ కూడా ఈ రంగంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు కూడా ఈ రంగంలో రాణిస్తున్నాయి. ఇప్పటికే ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పుల దిశగా సాగుతోంది. రాకెట్ల పునర్వినియోగం చేస్తూ ఖర్చు తగ్గిస్తోంది. మరోవైపు బిలియనీర్లు జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ కూడా స్పేస్ ఫ్లైట్ కంపెనీలను స్థాపించారు. దీంతో కొన్ని దశాబ్దాలుగా అంతరిక్షంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న అమెరికాకు ఇలాంటి సంస్థల నుంచి పోటీ ఎదురుకావొచ్చు. ఇప్పటికే చైనా చంద్రునిపై ప్రయోగాల్లో దూసుకెళ్తోంది. చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరూ అడుగుపెట్టని చంద్రుని మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో రోవర్‌ను దించి ఔరా అనిపించింది. 2030 నాటికి చందమామపై వ్యోమగాములను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు భారత్ ఏశాట్ ద్వారా కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని కూల్చి తన సత్తా ఏంటో ప్రపంచానికి ఇటీవలే తెలియజేసింది. ఈ కారణాలతో తన మూన్ మిషన్‌ను తొందరగా చేపట్టాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 2024 నాటికి చంద్రునిపై వ్యోమగాములను దింపి.. 2030 నాటికి మార్స్‌పైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే ప్రణాళికల్లో నాసా ఉంది. 1969లో నాసా అపోలో 11 మిషన్ ద్వారా చంద్రునిపై అమెరికా తొలిసారిగా వ్యోమగాములను పంపించిన విషయం తెలిసిందే.
తొందరగా పదండి-మైక్ పెన్స్ ఉత్సాహం
Related tags :