*** The life story of Wilhelm Conrad Roentgen
ఎక్స్ కిరణాల్ని కనుగొన్న గొప్ప శాస్త్రజ్ఞుడు విలియం రాంట్‌జన్. పదార్థాల్లోకి సులువుగా చొచ్చుకుపోయే ఈ కిరణాలు లోహాల అంతర్భాగంలోని లోపాలు, పగుళ్లను పసిగడతాయి. దీంతో పారిశ్రామిక రంగంలో స్ఫటికాల్లో సంక్లిష్టమైన అణువుల నిర్మాణ అధ్యయనంలో ఉపయోగపడుతున్నాయి. స్మగ్లర్లు తమ దుస్తుల్లో దాచిన ఆయుధాలు, వస్తువులను తెరపై కనపడేటట్లు చేసి.. కస్టమ్స్ అధికారులకు ఈ కిరణాలు ఓ సాధనమయ్యాయి. ఈ కిరణాలు ముఖ్యంగా వైద్య రంగంలో రోగ నిర్ణయానికి, చికిత్సకు అవసరమవుతున్నాయి. X కిరణాల ఆవిష్కరణకే 1901లో ఈయనకు భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి దక్కింది. విలియం రాంట్‌జన్ మార్చి27, 1845న జర్మనీలోని లెన్నెప్‌లో ఒక వ్యాపార కుటుంబంలో పుట్టాడు. చదువుకునే రోజుల్లో రాంట్‌జన్ అంత ప్రతిభావంతుడేమీ కాదు. బడిలో కన్నా బయట తిరగడంపైనే ఎక్కువ శ్రద్ధ. చిన్న చిన్న యంత్రాల తయారీతో కాలం గడుపుతుండేవాడు. తర్వాత ఓ టెక్నికల్ స్కూల్‌లో చేరాడు. ఆ కోర్సు పూర్తి చేయక ముందే క్లాస్ టీచర్ పై కార్టూన్స్ గీశాడని స్కూలు నుంచి వెళ్లగొట్టారు. ఆ తర్వాత ఎంట్రన్స్ పరీక్ష ప్రైవేటుగా పాసై ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో చేరాడు. అక్కడి ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడు ‘క్లాషియస్’ బోధనకు ప్రభావితుడయ్యాడు. ఇంజినీరింగ్‌లో డిప్లొమా పొందిన తర్వాత సంవత్సరమే డాక్టరేట్ డిగ్రీ పొందాడు. ఆ తర్వాత జర్మనీలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా చేశాడు. ఉర్జ్‌బర్గ్ యూనివర్సిటీలోని ఫిజికల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గానే కాకుండా ఆ సంస్థ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. పదవీ విరమణకు ముందు మ్యునిచ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర పీఠాన్ని అధిరోహించాడు. మనం పాఠాల్లో కేథోడ్ కిరణాలను వెలువరించే ఉత్సర్గ నాళం(డిశ్చార్జ్ ట్యూబ్) గురించి చదువుకునే ఉంటాం. విలియం క్రూక్స్ అనే శాస్త్రజ్ఞుడు దీన్ని రూపొందించాడు. ఈ పరికరానికి ఆకర్షితుడైన రాంట్‌జన్ తన ల్యాబొరేటరీలో 1895లో దాంతో ప్రయోగాలు ప్రారంభించాడు. ఓ రోజు రాంట్‌జన్ ట్యూబ్‌లోని కేథోడ్‌కు ఎదురుగా ఉండే ట్యూబ్ గోడలే కాకుండా ట్యూబ్ బయట దూరంగా మరో సమతలంలో ఉండే స్క్రీన్ మెరవడం చూశాడు. అలా మెరవడం కేథోడ్ కిరణాల వల్ల కాదు. ఎందుకంటే ఆ కిరణాలు ట్యూబ్ నుంచి బయటకు రాలేవు. ఆ తర్వాత ట్యూబ్‌ని నల్లని కాగితపు అట్టతో కప్పినా స్క్రీన్ మెరుస్తూనే ఉంది. కాబట్టి అంతకన్నా ఎక్కువ దూరంలో ఉన్న స్క్రీన్ మెరవడానికి కారణం కేథోడ్ కిరణాలు ఎంతమాత్రం కావు. కానీ కనబడని కిరణాలు క్రూక్స్ ట్యూబ్ నుంచి వెలువడుతున్నాయి. ఆ కిరణాల స్వభావం, ధర్మాలు తెలియకపోవడంతో గణిత శాస్త్రంలో తెలియని రాశిని X అని ఊహించుకున్నట్లు రాంట్‌జన్ ఆ కిరణాలకు X కిరణాలని పేరు పెట్టాడు. తర్వాతి ప్రయోగాల ద్వారా రుణ విద్యుదావేశం ఉన్న కేథోడ్ కిరణాలు ఒక బరువైన లోహపు లక్ష్యంపై పడితే ఆ లక్ష్యం ఎలక్ట్రాన్‌లను శోషించుకుంటుంది. X కిరణాల్ని వెలువరిస్తుంది. ఈ కిరణాలకు ఎలాంటి విద్యుదావేశం లేకపోయినా వాటికి శక్తి అధికంగా ఉండటంతో అవి పదార్థాల పరమాణువుల మధ్యలోంచి సులువుగా చొచ్చుకుని పోగలవని తెలిసింది. రాంట్‌జన్ X కిరణాల ధర్మాల్ని పరిశీలిస్తున్నప్పుడు ఓసారి ఆయన భార్య ల్యాబొరేటరీకి వచ్చింది. అనుకోకుండా ఆన్‌లో ఉన్న క్రూక్ ట్యూబ్‌కు అక్కడే ఉన్న ఫొటోగ్రాఫిక్ ప్లేటుకు మధ్య ప్రదేశంలో ఆమె చేతిని పెట్టింది. అంతే! ఫొటోగ్రాఫిక్ ప్లేటుపై ఆమె చేతి వేళ్ల ఎముకలు, ఉంగరపు నీడలు కనిపించాయి. భయంతో తన చేతి వంక చూస్తే బాగానే ఉంది. అలా ప్రపంచంలో మొదటిసారి ప్రాణంతో ఉన్న వ్యక్తి తన దేహంలోని ఎముకల్ని చూసినట్లయ్యింది. అదే తొలి ఎక్స్‌రే ఫొటో. ఈ సంఘటనకు కారణం X కిరణాలు తక్కువ సాంద్రత గల మానవ చర్మం, మాంసం గుండా చొచ్చుకుని పోగలవు. కానీ ఎక్కువ సాంద్రత గల ఎముకలు, ఉంగరపు లోహంలోకి వెళ్లలేదు. X కిరణాల ఈ ధర్మం వైద్య రంగానికి భౌతిక శాస్త్రం ప్రసాదించిన వరం. X కిరణాల్లోని ఒక రకమైన మృదు కిరణాలు మానవ శరీరంలోని మృదువైన మాంసం గుండా చొచ్చుకుపోయి శరీరంలోపలి భాగంలో ఎముకలు విరగడం, కురుపులు, అల్సర్లు, క్యాన్సర్లు, క్షయలాంటి వ్యాధుల్ని కనిపెట్టగలిగితే మరో రకమైన కఠిన కిరణాలను వాటిపై కేంద్రీకరించి ఆ వ్యాధుల్ని నయం చేయొచ్చు. అద్భుతమైన X కిరణాల్ని ఆవిష్కరించి విలియం రాంట్‌జన్‌కు మానవాళి ఎంతో రుణపడి ఉంది. బడిలో కన్నా బయట తిరగడంపైనే ఎక్కువ శ్రద్ధ. చిన్న చిన్న యంత్రాల తయారీతో కాలం గడుపుతుండేవాడు. టీచర్ పై కార్టూన్స్ గీశాడని స్కూలు నుంచి వెళ్లగొట్టారు.