మనం చిన్నప్పుడు అ అమ్మ, ఆ ఆవు అని చదువుకున్నాం. ఆలియా భట్ కూడా హిందీలో అ అనార్, ఆ ఆమ్.. అని చదువుకున్నారు. అయితే పెద్దయ్యాక తెలిసిందట ఆ అంటే ఆందోళన అని. ఎందుకంటే చిన్న విషయానికే బాగా ఆందోళన పడిపోతుంటారట. ఆ విషయం గురించి ఆలియా భట్ మాట్లాడుతూ – ‘‘అలా జరుగుతుందేమో.. ఇలా జరుగుతుందేమో అని నాకు నేను ఎక్కువగా ఆలోచించుకుని ఆందోళనపడిపోతుంటాను. ‘ఓవర్ థింకర్’ని. సినిమాల్లోకి వచ్చాక అది ఇంకా ఎక్కువ అయింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతోందంటే చాలు.. ‘సినిమా ఆడుతుందో? లేదో?’ అని ఆందోళన. ఇక చూడండి.. కంటి మీద కునుకు రాదు. ఆందోళన, భయం. నా విషయాలకు నేను ఆందోళన పడ్డానంటే ఓకే అనుకోవచ్చు. నా స్నేహితులకు ఎవరైనా జరగకూడనిది జరిగితే నాకే జరిగినట్లుగా ఆందోళనపడిపోతాను.ఒకేసారి రెండు మూడు పనులు చేయాలంటే అప్పుడు నా ఆందోళన డబుల్ అవుతుంది. అలాగే నాకు తెలిసినవాళ్లతో నేను ఎంతైనా మాట్లాడతాను. అప్పుడు ‘వాగుడుకాయ’ అని పేరు కూడా తెచ్చుంటాను. కానీ ఏదైనా పార్టీకి కానీ పెళ్లికి కానీ వెళ్లాననుకోండి.. ఏం మాట్లాడాలో తెలియదు. ‘హలో’ అంటాను. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియక వెర్రి మొహం వేస్తాను. అక్కడ నాకు తెలిసినవాళ్లెవరైనా ఉంటే ‘ఏంటి ఇలా అయిపోతున్నావ్’ అంటారు. పార్టీలకు వెళ్లేముందు ఒకవైపు శ్రద్ధగా రెడీ అవుతూనే మరోవైపు ఆందోళనపడుతుంటాను. ఆ మధ్య ఓ సందర్భంలో రణ్‌బీర్ కపూర్ ‘ఎందుకు అంతలా వరీ అవుతావు. నీ పని నువ్వు చెయ్. రిజల్ట్ గురించి ఆలోచించకు’ అన్నాడు. అది కొంతవరకూ హెల్ప్ అయింది. వరీ అవ్వడం తగ్గించాను. కానీ ఆందోళన మాత్రం పూర్తిగా నన్ను వదిలేట్లు లేదు’’ అన్నారు.
వరీ అవ్వడం తగ్గించాను
Related tags :