DailyDose

బ్యాంకులకు పదిరోజులు సెలవు–తాజావార్తలు–04/02

banks closed in india for 2019 election

* ఏప్రిల్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. బిజినెస్ వ్యవహారాలు..డబ్బు లావాదేవీలు, చెక్, డిడిలు జమ చేయడం వంటివి ముందుగానే చేసుకోండి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు పండుగ, ఇతరత్రా కారణాలతో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. బ్యాంకులు పనిచేయకపోయినా నెట్ బ్యాంకింగ్ ఉన్న వారికి సమస్యలు ఎదురు కాకపోవచ్చు. డిజిటల్‌ లావాదేవీలు జరుగుతుండడం ఖాతాదారులు ఆన్‌లైన్‌ ద్వారా సేవలు వినియోగించుకోవచ్చు. ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులో చూద్దాం. ఏప్రిల్‌ 5 శుక్రవారం బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి. ఏప్రిల్ 06వ తేదీ ఉగాది. ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం. ఏప్రిల్ 13వ తేదీ రెండో శనివారం ఏప్రిల్ 14వ తేఆదివారం. రామనవమి ఏప్రిల్ 17వ తేదీ మహవీర్ జయంతి. ఏప్రిల్ 19వ తేదీ గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 21వ తేదీ ఆదివారంఏప్రిల్ 27వ తేదీ నాలుగో శనివారం ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం. ఈ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. అయితే సెలవులకు తగ్గట్లుగా ప్లాన్‌ చేసుకోవడం బెటర్.
* ఎన్నికల వేళ వాట్సప్ కీలక నిర్ణయం
ప్రముఖ సోషల్ మీడియా వాట్సప్ ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ‘చెక్‌పాయింట్ టిప్‌లైన్’ అనే సరికొత్త సాకేంతిక విధానాన్ని మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్టవేస్తుంది. ఇండియాకు చెందిన పీఆర్ఓటీఓ అనే స్టార్టప్ సంస్థ ఆవిష్కరించిన ‘చెక్‌పాయింట్ టిప్‌లైన్’ అనే సాంకేతిక విధానంతో వాట్సప్‌లో వచ్చిన సందేశాలను 9643000888కు పంపిచడం ద్వారా ఆ వార్త నిజమా, కాదా, వదంతులా అనే విషాయాన్ని తెలుసుకోవచ్చని వాట్సప్ తెలిపింది. మనం పంపే ఫోటోలు, వీడియోలు, సందేశాల్లో ఎంత మేరకు నిజం ఉందో సత్యం, అసత్యం, తప్పుదోవపట్టించేది, వివాదాస్పదమైంది అనే నాలుగు కేటగిరీల ద్వారా విశ్లేంచుకోవచ్చని వెల్లడించింది. ఈ సదుపాయం ఇంగ్లిష్, హిందీ, తెలుగు, బెంగాలీ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉందని ఫేస్‌బుక్ సంస్థ వాట్సప్ ఓ ప్రకటనలో తెలిపింది.
* సాఫ్ట్‌ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్.. స‌ర్ఫేస్ బుక్ 2 పేరిట ఓ నూత‌న ల్యాప్‌టాప్‌ను తాజాగా విడుద‌ల చేసింది. రూ.1,03,810 ప్రారంభ ధ‌ర‌కు ఈ ల్యాప్‌టాప్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఇందులో 13.5 ఇంచ్ డిస్‌ప్లే, 3240 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెస‌ర్‌, ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ 620, 256 జీబీ ఎస్ఎస్‌డీ, 8 జీబీ ర్యామ్‌, యూఎస్‌బీ టైప్ సి త‌దిద‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌ను ట్యాబ్లెట్‌గా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.
* కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ‘అబద్ధాల పుట్ట’గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. 55 పేజీల మేనిఫెస్టోలో 55 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను కళ్లకు కట్టారని విమర్శించారు. 55 ఏళ్లలో కాంగ్రెస్ సాధించలేని అభివృద్ధిని 55 నెలల్లో ఎన్డీయే ప్రభుత్వం సాధించిందని అన్నారు.
* వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రచారానికి రాకుండా ఇవాళ లోటస్ పాండ్‌లో ఉండిపోయారని విమర్శించారు. లోటస్‌పాండులో డబ్బులు లెక్కపెట్టుకుంటూ కూర్చున్నారని ఆరోపించారు. తాను మాత్రం జనం మధ్యలోనే ఉన్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లా, మదనపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ తన తండ్రి వైఎస్‌ను అడ్డం పెట్టుకుని రూ లక్ష కోట్లు సంపాదించారని విమర్శించారు. జగన్ తప్పులు చేశారు కాబట్టే భయపడుతున్నారన్నారు. ప్రచారానికి రాకుండా కుట్ర చేయడానికి లోటస్‌పాండ్‌లో ఉన్నారని సీఎం ఆరోపించారు. జగన్ ఎప్పుడైనా ఏపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు.
* బీహార్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కేకే ఉపాధ్యాయ పట్ల దురుసుగా ప్రవర్తించిన కేసులో కేంద్రమంత్రి అశ్విన్‌కుమార్ కు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేంద్రమంత్రి అశ్విన్‌కుమార్ మార్చి 31న ఎన్నికల నియమావళి కోడ్‌ను ఉల్లంఘించడమే కాకుండా..అధికారి కేకే ఉపాధ్యాయ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.
* బుల్లితెర నటి రుహి శైలేష్ కుమార్ సింగ్ ఫుల్లుగా తాగి హల్‌చల్ చేసింది. తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తు ఏడు వాహనాల్ని ఢీకొట్టింది. ముంబైలోని శాంతాక్రజ్ దగ్గర ఈ ఘటన జరగడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాను తాగలేదని.. పోలీసులతో వాదనకు దిగింది. పోలీసులు తనపై అసభ్యంగా ప్రవర్తించారంటూ నానా హంగామా చేసింది. కానీ సీన్ రివర్స్ అవ్వంది. ఈ ఘటన నుంచి తప్పించుకోవటానికి ఆమె చేసిన హల్‌చల్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఆ నటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* వంట గ్యాస్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాదిలో రెండవసారి వినియోగదారులపై మళ్లీ వంటగ్యాస్‌ భారం పడింది. 14.2 కిలోల ఎల్‌పీజీ సబ్సిడీ సిలిండర్‌ ధరపై నామమాత్రంగా రూ. 25పైసలు, సబ్సిడీ లేని సిలిండర్‌ ధర రూ.5 చొప్పున పెరిగింది. సవరించిన ధరలు ఏప్రిల్‌ 1వ తేదీనుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్) ఒక ప్రకటన జారీ చేసింది.
* దేశంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్ 1వతేదీ నుంచి ఎండ తీవ్రత గణనీయంగా పెరిగిందని పూణే వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
*కేంద్ర దర్యాప్తు సంస్థలో డీఎస్పీ హోదాలో విధులు నిర్వహిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా బంటుమిల్లి గ్రామానికి చెందిన బండి పెద్దిరాజుకు ఉత్తమ అధికర్నిగా పురస్కారం లభించింది. సీబీఐ డైరెక్టర్ రిశికుమార్ చ్తులమీడుగా ఆయన సోమవారం ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ వార్షికోత్సవం సందర్భంగా సీబీఐలోని ప్రతి శాఖలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు ఏటా అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
*దేశంలో సూక్ష్మసేద్యం పరికరాల అమరికలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం సాధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వ్యవసాయశాఖ విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ తర్వాత కర్ణాటక (1.71లక్షల హెక్టార్లు), గుజరాత్‌(1.42లక్షల హెక్టార్లు)తో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం (37,875హెక్టార్లు)తో 8వ స్థానంలో నిలిచింది.
*తెలంగాణ హైకోర్టు నుంచి కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరచిపోలేని జ్ఞాపకాలతో వెళుతున్నానని జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ అన్నారు. కోల్‌కతాకు బదిలీపై వెళుతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌కు సోమవారం మొదటి కోర్టు హాలులో న్యాయమూర్తులందరితోపాటు న్యాయవాదులు సమావేశమై ఘనంగా వీడ్కోలు పలికారు.
*ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు తెలంగాణ నుంచి నలుగురు యువకులు బయలుదేరారు.సోమవారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. తెలంగాణ నుంచి ఇంతమంది ఒకేసారి వెళ్లడం ఇదే తొలిసారని వీరికి శిక్షణ ఇచ్చిన ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌ డైరెక్టర్‌ శేఖర్‌బాబు తెలిపారు.
*రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూర్ల బయ్యారంలో సోమవారం గరిష్ఠంగా 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌ మండలం భోరజ్‌లో 43.1, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తంగుల, నిజామాబాద్‌ జిల్లా రంజల్‌, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌లలో 42.9, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌, నిజామాబాద్‌ జిల్లా నవీపేట, కామారెడ్డి జిల్లా బిక్నూర్‌లలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్ల సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
*పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించాలంటూ తెలంగాణ రాష్ట్ర కమిటీ(భారత కమ్యూనిస్టు పార్టీ) మావోయిస్టు పేరిట వెలువడిన కరపత్రాలు భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో కలకలం సృష్టించాయి. మహాముత్తారం పోలీసుస్టేషన్‌కు కిలోమీటరు దూరంలోనే సోమవారం ఈ కరపత్రాలు కనిపించడం పోలీసులను కలవరపాటుకు గురిచేసింది. మహాముత్తారం నుండి భూపాలపల్లికి వెళ్లే దారిలో కరపత్రాలు కనిపించాయి.
*ఆగ్రో ఫారెస్ట్రీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌, మార్కెట్‌ అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.కె.జోషి అధికారులను ఆదేశించారు. సంప్రదాయ పంటలతో పాటు రైతులకు అదనపు ఆదాయం ఉండేలా ప్రోత్సహించాలని.. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రో ఫారెస్ట్రీని పెద్దఎత్తున అమలుచేయాలని ఆయన సూచించారు. ఆర్థిక, వ్యవసాయం..అనుబంధ రంగాలు, అటవీశాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సోమవారం సమావేశమైన సీఎస్‌ ఆగ్రో ఫారెస్ట్రీ అమలు, అధ్యయనంపై చర్చించారు.
*భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో పార్ట్‌-బిలో ఉంచిన వివాదాస్పద భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) ప్రభుత్వాన్ని కోరింది.
*సరుకు రవాణలో దక్షిణ మధ్య రైల్వే నూతన రికార్డు సృష్టించింది. అది సంపాదించిన ఆదాయం తొలిసారిగా రూ.పదివేల కోట్లను దాటినట్లయింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 122.51 మిలియన్‌ టన్నుల సరుకుల రవాణా ద్వారా ద.మ. రైల్వే మొత్తం రూ.10,584.94 కోట్లు గడించింది. అంటే భారతీయ రైల్వే చేసిన రవాణాలో ఇక్కడి నుంచే 30 శాతం జరిగిందని సోమవారం జోన్‌ అధికారులు వెల్లడించారు. ఉత్తమ రికార్డుకు కృషిచేసినవారిని జీఎం గజానన్‌ మల్య అభినందించారు. అత్యధికంగా బొగ్గు, ఆ తర్వాత సిమెంటు రవాణా ద్వారా కొత్త రికార్డు సాధ్యమైందని సీపీఆర్వో రాకేశ్‌ తెలిపారు.
*హైదరాబాద్‌ ఎల్‌.బి.స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగిన విజయ్‌ సంకల్ప్‌ సభ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీ దత్తాతేయ జుట్టు వైపు చూస్తూ ప్రతిసారీ హోలీ తర్వాత ‘రెండుమూడు నెలలపాటు మీ జుట్టు ఎర్రగా ఉండేది, ఈసారి తెల్లగా ఉందేం?’ అని ప్రశ్నించారు. దత్తాత్రేయ స్పందిస్తూ ‘కొద్దికాలం క్రితం మా అబ్బాయి చనిపోవడంతో ఈసారి హోలీలో పాల్గొనలేదని, అందుకే జుట్టు తెల్లగా ఉందని’ చెప్పారు. దీనికి మోదీ స్పందిస్తూ ‘నాకు ఆ విషయ జ్ఞాపకం లేదు క్షమించండి’ అని అన్నారు.
*సంచార వైద్యసేవల(104) విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని.. ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ 104 ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ కోరింది. 104 ఉద్యోగుల సేవలను జాతీయ జీవనశైలి వ్యాధుల నివారణ పథకంలో భాగంగా వినియోగించుకోవాలని కోరుతూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీందర్‌ సోమవారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ యోగితా రాణాకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కమిషనర్‌ మంగళవారం 104 సేవలపై అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
*భూమి విక్రయ వ్యవహారంలో యూనిటెక్‌ కంపెనీకి వడ్డీతో సహా రూ.660 కోట్ల దాకా చెల్లించే విషయమై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. యూనిటెక్‌ నుంచి తీసుకున్న రూ. 162 కోట్లను చెల్లించాలని స్పష్టం చేసిన న్యాయస్థానం, వడ్డీ చెల్లింపులో మాత్రం మినహాయింపునిచ్చింది.
*ఏపీలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ‘పసుపు-కుంకుమ’ పథకం కింద ఏప్రిల్‌ 5న మూడో విడతలో చెల్లించనున్న సొమ్మును, మరోవైపు ‘అన్నదాతా-సుఖీభవ’ పథకం చెల్లింపులను నిలిపివేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో గుంటూరుకు చెందిన అనీల్‌కుమార్‌ అనే వ్యక్తి వ్యాజ్యం దాఖలు చేేశారు.
*గ్రూప్‌-2 రాత పరీక్షల్లో రెండుసార్లు (డబుల్‌) బబ్లింగ్‌ వ్యవహారంలో తలెత్తిన వివాదంపై..హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అటువంటి ప్రశ్నలకు జవాబులను పరిగణనలోకి తీసుకోరాదంటూ గతేడాది అక్టోబరు 12న సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, పలు అప్పీళ్లు దాఖలు కావడం విదితమే.
* తెలుగు చలన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణను చేపట్టేందుకు సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. చిత్ర నిర్మాత రాకేశ్‌ రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ తమ పిటిషన్‌ను అత్యసరంగా విచారణకు చేపట్టాలని అభ్యర్థించారు. చీఫ్‌జస్టిస్‌ రంజన్‌ గొగొయి సారథ్యంలోని ధర్మాసనం స్పందిస్తూ…తగిన సమయంలో పిటిషన్‌ విచారణకు వస్తుందని స్పష్టం చేసింది.