Politics

తిరుపతి సీటు ఎవరిని వరిస్తుందో!

tirupati 2019 election

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన చిత్తూరు జిల్లా..తియ్య మామిడికే కాదు.. రసవత్తర రాజకీయలకూ నెలవే.రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రుల్ని అందించిన జిల్లా ఇది! ఇక్కడే ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సీఎం కావడంతో పాటు.. ఇప్పటివరకూ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన రికార్డూ ప్రస్తుత సీఎం చంద్రబాబుదే. కృష్ణా జలాలను చిత్తూరు జిల్లా పడమటి మండలాలకు రప్పించిన భగీరథుడిగా ప్రజల మన్ననలు అందుకుంటున్న ఆయన.. పరిశ్రమలను ప్రోత్సహించి యువతకు ఉపాధి కల్పనలోనూ ముందున్నారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాలు ఒడిసిపట్టాలని కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని వైకాపా కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. మిగతా పార్టీలేవీ జిల్లాలో ఎక్కడా గెలిచే అవకాశాలు పెద్దగా లేవన్నది పరిశీలకుల అంచనా. తెదేపా, వైకాపాల మధ్య పోరు కొన్నిచోట్ల హోరాహోరీగా ఉండగా జనసేన, కాంగ్రెస్‌, భాజపాలు ఎవరి ఓట్లు చీలుస్తాయోనని ఆ పార్టీలు రెండూ ఆందోళనలో ఉన్నాయి. జిల్లాలోని 10 స్థానాల్లో తిరిగి, ప్రజలను పలకరించి.. వారి మనోగతం తెలుసుకునేందుకు ‘ చేసిన ప్రయత్నమే ఈ కథనం…
చిత్తూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 14
లోక్‌సభ స్థానాలు: 2 (తిరుపతి, చిత్తూరు)
*చిత్తూరు
తెదేపా: ఏఎస్‌ మనోహర్‌
వైకాపా: శ్రీనివాసులు
మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇటీవల తెదేపాలో చేరడం.. చిత్తూరుతో పాటు జిల్లాలో పలుచోట్ల ప్రభావం చూపనుంది. సీకే బాబు వర్గంతో కలిసి మనోహర్‌ పనిచేస్తే తెదేపాకు బలం చేకూరుతుందని ప్రధాన రహదారిలోని స్వీటు షాపు యజమాని, నారాయణ అనే డ్రైవర్‌ చెప్పారు. తెదేపాలో అంతర్గత విభేదాలు మరచి అందరూ కలిసి పనిచేయడమే కీలకమని స్థానిక యువకులిద్దరు అన్నారు. వైకాపాలోనూ ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. చిత్తూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే సత్యప్రభ రాజంపేట లోక్‌సభ స్థానానికి తెదేపా తరఫున పోటీ చేస్తున్నారు. ఆమె సామాజికవర్గం తెదేపాకు అనుకూలంగా ఉండటం కలసి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
*పూతలపట్టు
తెదేపా: ఎం.లలితకుమారి
వైకాపా: ఎం.బాబు
సిట్టింగ్‌ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ని పక్కనపెట్టి వైకాపా ఎం.బాబుకు టికెట్‌ ఇచ్చింది. వైకాపాలో శ్రేణులన్నీ కలిసికట్టుగా లేవు. తెదేపా అభ్యర్థి తరఫున చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ప్రచారం చేస్తుండటం లాభించనుంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ తెదేపా స్వల్ప తేడాతోనే ఓడిపోయింది. ప్రస్తుతం అన్ని వర్గాలు ఒక్కటిగా పనిచేస్తున్నందున విజయంపై పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. కష్టపడి ప్రచారం చేసుకునే పార్టీనే నెగ్గుతుందని పూతలపట్టుకు చెందిన దినేష్‌కుమార్‌ అనే ఉద్యోగి చెప్పారు. డిగ్రీ విద్యార్థినులు సంధ్యశ్రీ, రమ మాట్లాడుతూ అసెంబ్లీకి ఒక పార్టీకి, లోక్‌సభకు మరో పార్టీకి ఓటువేసి రెండు పార్టీలకు సమన్యాయం చేస్తామన్నారు.
*చంద్రగిరి..
తెదేపా: పీవీఎం ప్రసాద్‌ (నాని)
వైకాపా (సిట్టింగ్‌ ఎమ్మెల్యే) చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతికి పక్కనే ఉన్న చంద్రగిరి స్థానంలో పూర్వ వైభవం సాధించడానికి తెదేపా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను ప్రభుత్వ సహకారంతో నాని పరిష్కరించడం ప్రజలను ఆకట్టుకుంది. చంద్రగిరిలో 50 పడకల ఆస్పత్రి, కొటాల గ్రామంలో వైద్యశాలను తెరిపించడానికి రూ.1.93 కోట్ల మంజూరు వంటి అంశాలు సానుకూలత ఏర్పడేలా చేశాయి. చెవిరెడ్డి ఇంటింటి ప్రచారంతో కొద్ది నెలలుగా ముందుకెళుతున్నారు. అసెంబ్లీకి వెళ్లలేదని, సమస్యల పరిష్కారానికి పోరాడలేదని కొంగరవారిపల్లెకు చెందిన రైతు ఒకరు చెవిరెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
*కుప్పం
తెదేపా: సీఎం చంద్రబాబు
వైకాపా: చంద్రమౌళి
కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడోసారి బరిలోకి దిగారు. చంద్రబాబు ఇంతవరకూ ఇక్కడ ప్రచారానికి రాకున్నా పార్టీ శ్రేణులు విస్తృతంగా తిరుగుతున్నాయి. అభివృద్ధి పనులపై ప్రజల్లో సానుకూలత ఉంది. చంద్రబాబు సులభంగా నెగ్గుతారని స్థానికంగా జేసీబీ యంత్రంపై డ్రైవర్‌గా పనిచేస్తున్న సాముడి చెప్పారు. జాఫర్‌ అనే పాత సామాన్ల వ్యాపారి మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటేయకపోతే ఇక్కడ అభివృద్ధి పనులేం జరగవనే భావన అందరిలో ఉందని, ఓటు తెదేపాకే వేస్తామని చెప్పారు. చంద్రబాబు మెజారిటీ అంశంపైనే కుప్పంలో చర్చ సాగుతోంది. వైకాపా అభ్యర్థి మాజీ ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండడంతో.. ఆ పార్టీ శ్రేణులు ఊరూరా తిరిగి ఓట్లు అడుగుతున్నాయి.
*పలమనేరు..
తెదేపా: మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి
వైకాపా: వెంకటేగౌడ
కుప్పంని ఆనుకుని ఉండే పలమనేరులో గత ఎన్నికల్లో వైకాపా తరఫున నెగ్గిన అమర్‌నాథ్‌రెడ్డి తరువాత తెదేపాలో చేరి మంత్రి అయ్యారు. వైకాపా నుంచి ఆయనతో వచ్చినవారు కొందరు ఇంతకాలం తెదేపాలో లబ్ధి పొంది మళ్లీ వైకాపాలోకే వెళ్లారు. తెదేపా రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసి ఉపసంహరించుకున్న సుభాష్‌చంద్రబోస్‌ని కలుపుకొని అమర్‌నాథ్‌రెడ్డి గట్టిగా ప్రచారం చేస్తే గట్టెక్కవచ్చని లారీ యజమానులు చంద్రశేఖర్‌, బాబు చెప్పారు. పక్క నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచారం చేస్తుండడంతో వైకాపా గెలుపు ధీమాతో ఉంది. అయితే పెద్దిరెడ్డి అనుచరులు కొందరు ఇక్కడ వైకాపా అభ్యర్థికి సహకరించడం లేదు.
*పుంగనూరు
తెదేపా: అనీషారెడ్డి
వైకాపా: (సిట్టింగ్‌ ఎమ్మెల్యే) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తొలిసారి బరిలో ఉన్న అనీషారెడ్డి.. మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి బంధువు. రాజకీయాల్లో కాకలు తీరిన పెద్దిరెడ్డి మరోసారి విజయంపై ధీమాతో ఉన్నారు. జనసేన అభ్యర్థిగా రామచంద్రయాదవ్‌ బరిలో ఉన్నారు. ఆయన సామాజిక వర్గం గణనీయంగా ఉన్నందున ఓట్లు చీలే అవకాశాలున్నాయి. రైతులకు చంద్రబాబు సాయం చేసినందున తెదేపాకే ఓటు వేస్తామని పెద్దవెల్గటూరు గ్రామానికి చెందిన రైతులు మంజునాథ, మోహన్‌ చెప్పారు. అందరికీ చంద్రబాబు సాయం చేశారని ఆయనకే ఓటు వేయాలని తమ డ్వాక్రా సంఘంలో అనుకున్నట్లు పుంగనూరుకు చెందిన శ్రీరాధ స్పష్టం చేశారు.
*మదనపల్లె
తెదేపా: దొమ్మలపాటి రమేశ్‌
వైకాపా: నవాజ్‌బాషా
వైకాపా తమ సిట్టింగ్‌ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిని కాదని కొత్త అభ్యర్థి నవాజ్‌బాషాను నిలబెట్టింది. తిప్పారెడ్డి అనుచరులు కొందరు అంతర్గతంగా తెదేపాకు అనుకూలంగా పనిచేస్తున్నారు. మదనపల్లె పట్టణానికి చెందిన రెడ్డెప్ప, తిప్పారెడ్డి, భాస్కర్‌రావు, మల్లయ్య అనే కూలీలు మాట్లాడుతూ తెదేపాకు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. తమ బంధువుల్లో సగం మంది వైకాపాకు, మరో సగం మంది తెదేపాకు ఓటేస్తామంటున్నారని బస్టాండులో పండ్ల వ్యాపారం చేసే నాగేంద్ర చెప్పారు.
*శ్రీకాళహస్తి
తెదేపా: బొజ్జల సుధీర్‌రెడ్డి
వైకాపా: బి.మధుసూదన్‌రెడ్డి
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి తెదేపా అభ్యర్థిగా తొలిసారి బరిలోకి దిగారు. ఇక్కడ భాజపా అభ్యర్థి కోలా ఆనంద్‌.. కాంగ్రెస్‌ తరఫున బత్తెయ్యనాయుడు, జనసేన అభ్యర్థిగా వినుత బరిలో ఉన్నారు. వీరు ముగ్గురు ఎంతమేర ఓట్లు చీలుస్తారనే దానిపైనే తెదేపా, వైకాపాల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని అంచనా. డ్వాక్రా మహిళలకు సాయం చేసినందుకు తెదేపాకు మద్దతిస్తున్నట్లు ఏర్పేడుకు చెందిన డ్వాక్రా మహిళ భారతి స్పష్టం చేశారు. ఒకసారి జగన్‌కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్లు అంగడి వ్యాపారి రామ్మూర్తి తెలిపారు. ప్రచారం, వ్యూహాలను బట్టి గెలుపోటములు నిర్ణయమయ్యే అవకాశాలున్నాయని వైకాపా నేత ఒకరు చెప్పారు.
*తిరుపతి
తెదేపా: (సిట్టింగ్‌ ఎమ్మెల్యే) ఎం. సుగుణమ్మ
వైకాపా: భూమన కరుణాకర్‌రెడ్డి
‘ఎమ్మెల్యే సుగుణమ్మను సులభంగా కలవవచ్చు. ఏదైనా సమస్య చెబితే సాయం చేయడానికి ముందుకు వస్తారు. మిగతా పార్టీల్లో మాలాంటి సామాన్యులతో ఇలా సులభంగా కలిసే నాయకులు లేరు’ అని కూరగాయల వ్యాపారి వెంకటయ్య చెప్పారు. రెండు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, వైకాపా కూడా పట్టుదలతో ప్రచారం చేస్తోందని వివరించారు. ఇక్కడ 2015 ఉపఎన్నికల్లో 1.15 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గిన సుగుణమ్మ మళ్లీ గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. వైఎస్‌పై, జగన్‌పై ఇక్కడి వారికి ఉన్న అభిమానం తనను గెలిపిస్తుందనేది భూమన భావన.
*నగరి
తెదేపా: భానుప్రకాశ్‌
వైకాపా: (సిట్టింగ్‌ ఎమ్మెల్యే) రోజా
మాజీ మంత్రి ముద్దుకృష్ణమ తనయుడు గాలి భానుప్రకాశ్‌ తొలిసారి బరిలో ఉన్నారు. తెదేపాలో టికెట్‌ ఆశించి భంగపడిన వారిని శాంతింపజేసే యత్నాలు ఫలించాయి. అన్ని వర్గాలూ కలిసికట్టుగా ప్రచారం చేసి నెగ్గాలనే వ్యూహంతో ఉన్నారు. వైకాపా తరఫున రోజా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
పిల్లలకు పాలనా పగ్గాలు అవసరం లేదుయువతకు వేగం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. పిల్లకాయలకు రాష్ట్ర పాలనా పగ్గాలు ఇప్పుడివ్వాల్సిన అవసరం లేదు. నాకు 4 ఎకరాల పొలం ఉంది. అన్నదాతా సుఖీభవా పథకం కింద రూ.వెయ్యి చొప్పున ఖాతాలో వేశారు. చంద్రబాబుకే ఓటేస్తా. – రామసముద్రం మండలం చెమ్మగూడెం రైతు తిప్పన్న.
కేంద్రం సతాయిస్తున్నా.. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు సాయం చేసేందుకు చంద్రబాబు కష్టపడుతున్నారు. ఆయనను మళ్లీ గెలిపిస్తేనే రాష్ట్రం ముందుకెళుతుంది.
* శ్రీకాళహస్తి పరిధి రాచగున్నేరి గ్రామం డ్వాక్రా మహిళ సరిత.
*చంద్రబాబు మళ్లీ సీఎం అయితే మరిన్ని పరిశ్రమలు వస్తాయి.
* తిరుపతి రైల్వే స్టేషన్‌ దగ్గరి ఓ హోటల్‌ వ్యాపారి.
*రాష్ట్ర అభివృద్ధికి ఎవరు ఉపయోగపడతారనేది చూసి ఓటు వేస్తా. రాష్ట్రం విడిపోయాక మొదలైన అభివృద్ధి పనులు సగం సగం అయ్యాయి. ప్రభుత్వం మారిపోతే ఎలా అని ఆలోచిస్తున్నా.
* పుంగనూరుకు చెందిన చిరువ్యాపారి జయమ్మ.
మొత్తంమీద… అభివృద్ధి పనులతో జిల్లా రూపురేఖలు మార్చేస్తున్న తెదేపాకు ఓటేస్తామని కొందరు చెప్పగా.. వైకాపాకు ఓ అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నట్లు మరికొందరు వివరించారు. గ్రామాల్లో పలకరించినప్పుడు కొందరు ఇంకా ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోలేదంటున్నారు. తమ గ్రామ నేతలతో మాట్లాడి నిర్ణయిస్తామని పలువురు కూలీలు, పేదలు చెబుతున్నారు.
**నీలం ఇక్కడి నుంచే
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 1952లో మద్రాసు రాష్ట్రంలో భాగంగా జరిగిన ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఓడిపోయిన నీలం.. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీకాళహస్తి నుంచి ఉపఎన్నికలో గెలుపొందారు. ఈ లెక్కన నీలంను ముఖ్యమంత్రిని చేసిన జిల్లా కూడా చిత్తూరే.