ScienceAndTech

5జీ సిం వేసుకుని ఇంటర్నెట్ వాడుకోవచ్చు

mg hector with 5g sim

ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్‌ త్వరలోనే హెక్టార్‌ పేరుతో ఓ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకురానుంది. టాటా హారియర్‌కు పోటీగా వస్తున్న ఈ కారులో అత్యాధునిక సౌకర్యాలతో పాటు, స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నాయి. మంగళవారం ఈ కారుకు సంబంధించిన పలు ఫీచర్లను సంస్థ వెల్లడించింది. 5జీ సిమ్‌, బటన్‌ ఫ్రీ వాయిస్‌ అసిస్టెంట్‌తో భారత్‌లో వస్తున్న తొలికారు ఇదే కావడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో దీనిలో స్మార్ట్‌ఫీచర్లను అభివృద్ధి చేశారు. గతంలో ఏ భారతీయ కారులో చూడని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయని ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. హెక్టార్‌ను మే చివరినాటికి మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎంజీ మోటార్‌ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాటా హారియర్‌, జీప్‌ కంపాస్‌, హ్యుందాయ్‌ టక్సన్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 500లకు దీన్ని పోటీగా భావిస్తున్నారు.

హెక్టార్‌లో స్మార్ట్‌ఫీచర్లు ఇవే!
* ఈ కారులో బటన్‌ ఫ్రీ వాయిస్‌ అసిస్టెంట్‌ ఉంటుంది. ‘హలో ఎంజీ’ అంటూ కారు రూప్‌, తలుపులు తెరవమని ఆదేశించవచ్చు. ఏసీని పెంచడం, తగ్గించడం, నావిగేషన్‌ సహా ఎన్నో సౌకర్యాలను నోటిమాటతో పొందవచ్చు. అతితక్కువ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతాల్లోనూ ఇది చక్కగా పనిచేస్తుంది.
* ఈ కారులో ఇన్‌బిల్ట్‌గా 5జీ స్మార్ట్‌ సిమ్‌ను అమర్చారు. స్మార్ట్‌ఫోన్‌తో దీనికి అనుసంధానం కావచ్చు. అంతేకాదు, పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ అప్లికేషన్లను ‘గానా.కామ్‌’ను కూడా ఉపయోగించుకోవచ్చు.
* కేవలం స్మార్ట్‌ఫీచర్లకే కాదు, భద్రతకు కూడా పెద్ద పీట వేసినట్లు ఎంజీ మోటర్‌ తెలిపింది. రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఇందులో ఉన్న ఇ-కాల్‌ ఎమెర్జెన్సీ వ్యవస్థ ద్వారా కస్టమర్‌ కేర్‌కు తెలిసేలా ఏర్పాటు చేశారు. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోగా, సంస్థ పల్స్‌హబ్‌కు టెక్ట్స్‌ మెస్సేజ్‌ వెళ్లిపోతుంది.