మువ్వన్నెల జాతీయ జెండా రూపశిల్పి… ప్రస్తుత ఎన్సీసీ శిక్షణోద్యమానికి కారకులు… విద్యావేత్త… బహుభాషా కోవిదుడు… శాస్త్రజ్ఞుడు… రచయిత… అన్నింటికీ మించి నిలువెల్లా దేశాభిమానాన్ని రంగరించుకున్న సంస్కర్త. ఇన్ని సుగుణాలు పుణికిపుచ్చుకున్న మహనీయుడు పింగళి వెంకయ్య. జాతీయోద్యమంలో తనదైన పాత్ర పోషించిన ఆయన ఏనాడూ వ్యక్తిగత ఉద్ధరణ కోరుకోలేదు.
**కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనమర్రులో 1883లో పింగళి వెంకయ్య జన్మించారు. కొలంబో, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలల్లో విద్యాభ్యాసం చేశారు. తెలుగు, ఆంగ్లంతో పాటు సంస్కృతం, ఉర్దూ, జపనీస్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. 19వ ఏట బోయర్ యుద్ధంలో పాల్గొన్న ఆయన ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చాక దేశంలోని ఓ అజ్ఞాత విప్లవ సంస్థలో పని చేశారు. ఆ తర్వాతి కాలంలో బళ్లారిలో ప్లేగు ఇన్‌స్పెక్టర్‌గా, మద్రాసు-బెంగళూరు రైలు మార్గంలో గార్డుగా కొద్దిరోజులు విధులు నిర్వహించారు.
* 1906లో కలకత్తాలో నిర్వహించిన కాంగ్రెస్ సభలకు రాష్ట్ర ప్రతినిధిగా హాజరయ్యే గౌరవాన్ని దక్కించుకున్నారు. అప్పట్లో మునగాల పరగణా రాజా వారి ఆహ్వానం మేరకు మునగాల ఎస్టేట్‌లో ఉండి పత్తి పంటపై పరిశోధనలు నిర్వహించారు. అలా అఖిల భారత అగ్రికల్చర్ సొసైటీ సభ్యత్వం పొందారు.
* మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా ప్రస్థానం ప్రారంభించిన పింగళి… వ్యవసాయం, చరిత్ర, గుర్రపుస్వారీ, వ్యాయామం, తదితరాల్లో శిక్షణ ఇచ్చేవారు. ప్రస్తుత ఎన్సీసీ శిక్షణోద్యమానికి బీజాలు వేసిన ఘనుడు ఆయనే.
* భూగర్భశాస్త్రంలో వివిధ పరిశోధనలు చేసి, పలువురి ప్రశంసలు పొంది వజ్రాల వెంకయ్యగా పిలిపించుకున్న పింగళి చేసిన రచనల్లో ‘నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ ఒకటి.
* నమూనా జాతీయ పతాకాన్ని రూపొందించిన వెంకయ్య… 1921లో బెజవాడ విక్టోరియా హాల్‌లో నిర్వహించిన జాతీయ కాంగ్రెస్ మహాసభలో గాంధీజీ ముందుంచారు. దానికి మార్పు చేర్పులు సూచించిన గాంధీజీ జెండా రూపకల్పన బాధ్యతలను పింగళిపై ఉంచారు. అలా మువ్వన్నెల జాతీయ జెండా రూపుదిద్దుకుంది.
* పింగళి వెంకయ్య ఏనాడూ పదవులు, అధికారం కోసం ఆరాటపడలేదు. వృద్ధాప్యంలో జీవితం దుర్భరంగా మారి పూరి గుడిసెలో గడిపే పరిస్థితి ఎదురైనా ఎవరిపైనా ఆధారపడని ధీశాలి.
భారత జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య
Related tags :