Politics

ఈసారి హిందూపురం బంధువు ఎవరో!

will balakrishna win hindupuram

????????????☘?????????☘???????????????☘????????????
ప్రఖ్యాత లేపాక్షి ఆలయానికి నిలయమైన.. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ తెదేపాదే గెలుపు. ఎన్టీఆర్‌ మూడుసార్లు, హరికృష్ణ ఒకసారి, 2014లో బాలకృష్ణ ఇక్కడి నుంచి విజయం సాధించారు. బాలయ్య మరోసారి పోటీ చేస్తుండగా.. వైకాపా నుంచి మాజీ ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్‌ రంగంలోకి దిగారు.మన రాష్ట్రానికి, అనంతపురం జిల్లాకు చివరన కర్ణాటకకు ఆనుకొని ఉండే హిందూపురం నియోజకవర్గంలో మైనార్టీలతో పాటు బీసీలు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. 1983లో తొలిసారి తెదేపా తరఫున పి.రంగనాయకులు గెలుపొందారు. అప్పట్లో ఎన్టీఆర్‌ స్థానంలో నాదెండ్ల భాస్కర్‌రావు సీఎం పీఠం ఎక్కగా.. దాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. హిందూపురం నియోజకవర్గం అట్టుడికింది. ఇక్కడ పలువురు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఎన్టీఆర్‌ ఈ స్థానంపై అభిమానం పెంచుకున్నారు. హిందూపురాన్ని దశాబ్దాలుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. బాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపించి, రూ.194 కోట్లతో గొల్లపల్లి జలాశయం నుంచి పైప్‌లైన్‌ వేయించి, పట్టణంలో తాగునీటి ఎద్దడి తీర్చారు. ఇటీవలే ఈ పథకం ద్వారా తాగునీటి సరఫరా మొదలైంది. ఇది బాలయ్యకు కలిసి రానుంది.రహదారుల విస్తరణ, మార్కెట్‌ యార్డ్‌, అంబేడ్కర్‌ భవనం నిర్మాణం, రూ.5 కోట్లతో లేపాక్షి అభివృద్ధి, ఇతర పనులు చేపట్టారు. బాలయ్య చాలా తక్కువగా నియోజకవర్గానికి వస్తారనే అభిప్రాయం ఉంది. కోటరీగా ఉండే కొందరు నాయకులు, వ్యక్తిగత సహాయకు (పీఏ)ల పెత్తనంపై విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ద్వితీయ శ్రేణి నాయకులూ కొంత అసంతృప్తితో ఉంటున్నారు. రాయలసీమ ఐజీగా పదవీ విరమణ పొందిన ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్‌.. వైకాపా అభ్యర్థిగా తొలిసారి పోటీ చేస్తున్నారు. హిందూపురంలో ఎక్కువ సంఖ్యలో ఉండే మైనార్టీ ఓట్లపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో విభేదాలున్న నాయకులు అందరినీ ఓ గూటికి తీసుకురావడం కొంత కలిసి రానుంది. గెలిపిస్తే స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వైకాపా అభ్యర్థి నవీన్‌నిశ్చల్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతకాలం పనిచేశారు. ఆయనకు బదులు ఇటీవల తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీకి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చారు. ఆయనకు టికెట్‌ ఇవ్వాలని వైకాపా పెద్దలు భావించినా.. చివరి నిమిషంలో ఇక్బాల్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ పరిణామాలతో అలక చెందిన నవీన్‌కు హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. నవీన్‌నిశ్చల్‌తోపాటు, ఇతర నాయకులు ఇక్బాల్‌కు ఎంత మేరకు సహకరిస్తారనేది చూడాల్సి ఉంది. మొత్తానికి ఇక్కడ గట్టి పోటీ కనిపిస్తోంది.