మహిళా సాధికారత, పదవుల్లో పడతులకు స మన్యాయం’ అంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పే రాజకీయ పార్టీలు తీరా ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నాయి.ఉభయ తెలుగు రా ష్ట్రాల్లో ప్రస్తుత లోక్సభ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపులో మహిళలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఇందుకు ప్రబల నిదర్శనం. ‘వోట్లు మహిళలవి.. సీట్లు పురుషులవి..’ అన్న మాట ఈ ఎన్నికల్లోనూ మరోసారి రుజువైంది. జాతీయ పార్టీలు సైతం లోక్సభ బరిలో మహిళలకు మొక్కుబడిగా సీట్లు కేటాయించాయి. తెలంగాణలోని 17 లోక్సభ సీట్లకు మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఇందులో మహిళల సంఖ్య 21 మాత్రమే. తెలంగాణలో తెరాస పార్టీ నుంచి ఇద్దరు, భాజపా నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకరు, సీపీఎం నుంచి ఒక మహిళా అభ్యర్థి రంగంలో నిలిచారు. తెలంగాణలో మొత్తం అభ్యర్థుల సంఖ్యలో మహిళల భాగస్వామ్యం 5 శాతానికి మించక పోవడం గమనార్హం. తెలంగాణలో మొత్తం వోటర్ల సంఖ్య 2.96 కోట్లు కాగా, ఇందులో 50 శాతం మంది మహిళా వోటర్లే. అయినా నాలుగు ప్రధాన పార్టీల తరఫున ఆరుగురు మహిళలకు మాత్రమే టిక్కెట్లు దక్కాయి.నిజామాబాద్ లోక్సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ కవిత మరోసారి తెరాస తరఫున బరిలో నిలిచారు. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడు సీటునుంచి మాజీ మంత్రి రెడ్యా నాయక్ కుమార్తె మాలోత్ కవిత తెరాస నుంచి పోటీ చేస్తున్నారు. భాజపా అభ్యర్థులుగా మాజీ మంత్రి డీకే అరుణ (మహబూబ్నగర్), బంగారు శ్రుతి నాగర్కర్నూల్ (ఎస్సీ రిజర్వుడు) నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఏకైక అభ్యర్థిగా రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేస్తుండగా, సీపీఎం తరఫున నల్గొండ నుంచి మల్లు లక్ష్మి బరిలో నిలిచారు. 2014 లోక్సభ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసిన మహిళల సంఖ్య తక్కువే. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మొత్తం 21 మంది మహిళలు పోటీ చేస్తున్నా, వీరిలో జాతీయ పార్టీల నుంచి ఆరుగురికి టిక్కెట్లు లభించగా మిగతా వారంతా స్వతంత్ర అభ్యర్థులే.. ***అసెంబ్లీలోనూ అదే వరస.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన రాజకీయ పార్టీల తీరు కారణంగా మహిళలకు నామమాత్ర ప్రాతినిధ్యం దక్కింది. 119 స్థానాలున్న తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెరాస నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి 11 మంది, తెదేపా- టీజేఎస్- సీపీఐ కూటమి నుంచి ముగ్గురు, భాజపా నుంచి 14 మంది, బహుజన వామపక్ష కూటమి నుంచి 10 మంది మహిళలు పోటీ చేశారు. తెరాస, కాంగ్రెస్ నుంచి ముగ్గురేసి మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తెలంగాణ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం మూడు శాతం మాత్రమే. 2014లో కంటే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహిళా ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాన పార్టీల తరఫున 11 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. తెదేపా నుంచి ముగ్గురు, వైకాపా నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, భాజపా నుంచి ఇద్దరు మహిళలకు టిక్కెట్లు దక్కాయి. తెదేపా నుంచి మాగంటి రూప, పనబాక లక్ష్మి, డి. సత్యప్రభ, వైకాపా నుంచి జి. మాధవి, వంగా గీత, చింతా అనూరాధ, డాక్టర్ బీవీ సత్యవతి, కాంగ్రెస్ నుంచి వి. శ్రుతీదేవి, పేడాడ రమణకుమారి, భాజపా తరఫున కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంద్రేశ్వరి, దేవినేని హంస పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి ఒక్క మహిళకూ టిక్కెట్టు కేటాయించక పోవడం గమనార్హం. 175 స్థానాలున్న ఏపీ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో 71 మంది మహిళలు పోటీలో నిలిచారు. అత్యధికంగా తెదేపా నుంచి 20 మంది, వైకాపా, జనసేన, కాంగ్రెస్ నుంచి 15 మంది చొప్పున, భాజపా తరఫున ఆరుగురు మహిళలు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఏడేసి సీట్లలో పోటీ చేస్తున్న సీపీఐ, సీపీఎంలు ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఏపీలో మొత్తం వోటర్లు 3.93 కోట్లు కాగా, ఇందులో మహిళలు 1.98 కోట్లు, పురుషులు 1.94 కోట్లు. మహిళా వోటర్లదే పైచేయి అయినప్పటికీ ప్రధాన పార్టీలేవీ వారికి తగినంతగా సీట్లు కేటాయించలేదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు అమలులోకి రాకున్నా ఒడిశా, బెంగాల్లో అధికార పార్టీలు అతివలు టిక్కెట్ల కేటాయింపులో రిజర్వేషన్ పద్ధతిని పాటించాయి. మహిళలకు రాజకీయాధికారం ఎండమావే అనడానికి ప్రధాన పార్టీల తీరే నిదర్శనంగా కనిపిస్తోంది.