ఒకసారి ప్రజాప్రతినిధి అయితే చాలు.. తరతరాలకు సరిపడా సంపదను కూడబెట్టుకొనే రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యేగా పనిచేసిన సుక్క పగడాలమ్మ పింఛన్ పైనే ఆధారపడుతూ ఇప్పటికీ సాధారణ జీవితం గడుపుతున్నారు. 1972-1978 మధ్య కాలంలో పాతపట్నం నియోజకవర్గాన్ని ఎస్సీ మహిళకు కేటాయించడంతో మెళియాపుట్టి మండలంలోని ముక్తాపురానికి చెందిన పగడాలమ్మ ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున 7,560 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పి.వి.నరసింహారావు, జలగం వెంగళరావులు ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో పగడాలమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేగా జీతం రూ.300. అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే హైదరాబాద్కు రానుపోను ఛార్జీలుగా రూ.80 చెల్లించేవారు. ‘‘1972లో జరిగిన ఎన్నికల్లో ఖర్చు కోసం జలగం వెంగళరావు రూ.10వేలు, నీలం సంజీవరెడ్డి రూ.2వేలు ఇచ్చారు. వాటికి తోడుగా మాకున్న కొంత ఆస్తిని అమ్మేసి మొత్తం రూ.18 వేలతో పోటీ చేశాను. మంచి మెజార్టీతో గెలిచాను. ఎమ్మెల్యేగా గ్రామాలకు బస్సుల్లోనే వెళ్తూ, దాహం వేస్తే గ్రామాల్లోని బావులు, చెరువుల్లోని నీటిని తాగేవాళ్లం. ఇందిరాగాంధీ నన్ను బాగా చూసుకునేవారు. నాటి రాజకీయాలు విలువలతో కూడి ఉండేవి. కాని, నేడు స్వార్థపూరితంగా మరాయి. మొదట్లో నాకు రూ.300 పింఛన్ వచ్చేది. అది సరిపోక గ్రామంలో కూలిపనులు చేసేదాన్ని. ఇప్పుడు రూ.30వేలు వస్తోంది. ఉండటానికి మాకు సరైన ఇల్లు లేదు. తుపానుకు పూర్తిగా పాడైంది. మా ఇంటికి మరమ్మతులు చేసుకొనేందుకు ప్రభుత్వం సాయం చేయాల’’ని పగడాలమ్మ వేడుకొంటున్నారు.
ఇందిర హయాంలో ఎమ్మెల్యే. నేడు కూలీ.
Related tags :