రాజకీయాల్లో హేమాహేమీలు. ఉద్ధండులు పోటీచేసిన ప్రాంతమది! కమ్యూనిస్టు నేతలు పుచ్చలపల్లి సుందరయ్య, మానికొండ సూర్యావతి.. వంటి వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమది! కృష్ణా జిల్లా రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశమైన నియోజక వర్గాల్లో ఒకటైన గన్నవరంలో ఇప్పుడు ఇద్దరు నాయకుల మధ్య రాజకీయ సంగ్రామం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మళ్లీ టీడీపీ నుంచి బరిలోకి దిగారు. ఆయనను ఎన్‌ఆర్‌ఐ, పారిశ్రామిక వేత్త యార్లగడ్డ వెంకటరావు(వైసీపీ) ఢీకొడుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలు పోటీపడుతుండటంతో ఇక్కడి పోరు రసవత్తరంగా మారింది. ఇక జనసేన మద్దతుతో సీపీఐ అభ్యర్థి అఫ్సర్ ఇక్కడి నుంచి పోటీకి సై అంటున్నారు.
* వంశీ వర్సెస్ యార్లగడ్డ పోటీ
నియోజకవర్గంలో ప్రధాన పోటీ టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్, వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుల మధ్యనే జరగనుంది. గన్నవరం నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై వంశీ గెలుపొందారు. ఈసారి రామచంద్రరావు పోటీ చేసేందుకు విముఖత చూపడంతో.. ఎన్నారై యార్లగడ్డ వెంకటరావు పేరు ప్రకటించారు. నామినేషన్ల పర్వం దగ్గర నుంచి, ప్రచారంలోనూ ఇరువురు దూకుడు పెంచారు. ఈ దఫా ఎన్నికలపై సామాజిక సమీకరణాల ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం వంశీకి అండగా ఉంది. సొంత సామాజిక వర్గం కంటే ఎక్కువగా బలహీన వర్గాలు, దళితులను వంశీ దగ్గరకు తీయటం, ప్రాధాన్యత కల్పించటంతో ఈ వర్గాల్లో వంశీ పట్టుపెంచుకున్నారు.పోలవరం కుడి కాల్వ ద్వారా వెళుతున్న పట్టిసీమ నీటిని నియోజకవర్గంలో ఉన్న వేలాది ఎకరాల పంటకు అందించటానికి సొంత నిధులను ఖర్చు చేసి మోటార్లను ఏర్పాటుచేయడం, ప్రజాహిత కార్యక్రమాలు తనకు కలిసి వస్తాయని వంశీ బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సొంత సామాజికవర్గానికి కొంత దూరమయ్యారని అంటున్నారు. ఇక, నియోజకవర్గంలో ఉన్న దళిత వర్గాల ఓట్లపై వైసీపీ అఽభ్యర్థి ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. కాపులు, రెడ్డి సామాజిక వర్గాలతో పాటు బీసీల నుంచి కూడా గణనీయంగా ఓట్లు చీల్చగలననే ధీమాతో ఉన్నారు. కమ్మ సామాజికవర్గంలో అసంతృప్తి లాభిస్తుందని భావిస్తున్నారు. వెంకటరావు చివరి ఏడాదిన్నరలో నియోజకవర్గానికి పరిచయమయ్యారు. విజయవాడ రూరల్, గన్నవరం మండలాలపై ప్రత్యేకంగా ఆయన దృష్టి సారించారు. ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో కమ్మ సామాజిక వర్గ నేతలతో పరోక్షంగా సంబంధాలు కొనసాగిస్తున్నారు.
యార్లగడ్డ వెంకటరావు (వైసీపీ)
**అనుకూలతలు
ఆర్థికంగా బలోపేతంగా ఉండటం పార్టీ కార్యకర్తలు చురుగ్గా ఉండటం
**ప్రతికూలతలు:
అవసరమైన చోట ఖర్చుకు వెనకాడటం అందరినీ కలుపుకొని వెళ్లలేకపోవటం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లలేకపోవటం
***వంశీ (టీడీపీ) అనుకూలతలు
ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటం ప్రజలతో మమేకం కావటం సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయాలు
*ప్రతికూలతలు :
బ్రహ్మయ్యలింగం చెరువు మట్టి తవ్వకం సొంత సామాజిక వర్గంలో అసంతృప్తి.
గన్నవరంలో వంశీని ఢీ కొడుతున్న ఎన్నారై
Related tags :