NRI-NRT

హెచ్-1బీ వీసాలకు భలే గిరాకీ-ఈ ఏడాది 65 వేల వీసాలు జారీ

h1b 2019 details

అమెరికాలో హెచ్-1బీ వీసాల కోసం ఈసారి కూడా దరఖాస్తులు వెల్లువెత్తాయి. 2020 ఆర్థిక సంవత్సరానికి 65 వేల హెచ్-1బీ వీసాలను జారీచేయాలని అమెరికా పార్లమెంట్ నిర్ణయించింది. ఇందుకోసం భారత వృత్తి నిపుణులు సహా విదేశీయుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన యూఎస్‌సీఐఎస్ (యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్).. కేవలం ఐదు రోజుల్లోనే పరిమితికి మించి దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించింది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు తప్పనిసరిగా హెచ్-1బీ వీసా పొంది తీరాలి. అమెరికాలోని టెక్ కంపెనీలు ఏటా భారత్, చైనా తదితర దేశాలకు చెందిన వేలాది మందిని ఉద్యోగులుగా చేర్చుకునేందుకు హెచ్-1బీ వీసాలపైనే ఎక్కువగా ఆధారపడతాయి. ఈ వీసా దరఖాస్తులను ఆమోదించే బాధ్యతను చేపట్టిన యూఎస్‌సీఐఎస్ ఈ నెల 1వ తేదీ నుంచి సంబంధిత పిటిషన్లను స్వీకరించే ప్రక్రియ ప్రారంభించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో జారీచేయదల్చుకున్న 65 వేల వీసాల కోసం తగినన్ని పిటిషన్లు వచ్చాయని యూఎస్‌సీఐఎస్ శుక్రవారం ప్రకటించింది.అయితే ఈ ఐదు రోజుల్లో మొత్తం ఎన్ని పిటిషన్లు వచ్చాయో వెల్లడించలేదు. మాస్టర్స్ క్యాప్‌గా పిలిచే అమెరికా అడ్వాన్స్ డిగ్రీ కోటాలో మరో 20 వేల హెచ్-1బీ వీసాలను జారీచేసేందుకు వీలున్నది. ఇందుకు తగినన్ని పిటిషన్లు వచ్చాయో లేదో తర్వాత నిర్ధారిస్తామని యూఎస్‌సీఐఎస్ పేర్కొన్నది. ఎంపికకాని అభ్యర్థులందరికీ వీసా రుసుమును తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. వీసాల పరిమితి నుంచి మినహాయింపు పొందిన అభ్యర్థుల పిటిషన్లను స్వీకరించి వాటిని ప్రాసెసింగ్ ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపింది. గతంలో పరిమితికి మించి ప్రత్యేకంగా ఎంపికై ఇప్పటికీ క్యాప్ నంబర్‌తో కొనసాగుతున్న వారికి ఈ ఏడాది జారీచేసే హెచ్-1బీ వీసాల్లో మినహాయింపు ఇచ్చినట్టు యూఎస్‌సీఐఎస్ పేర్కొంది. అయితే ఎన్నో ఏండ్ల నుంచి అనుసరిస్తున్నట్టుగా ఈసారి కూడా కంప్యూటరైజ్డ్ డ్రా (లాటరీ) నిర్వహిస్తారా? లేదా? అనే విషయమై యూఎస్‌సీఐఎస్ ఏమీ చెప్పలేదు. హెచ్-1బీ వీసాల కోసం గత ఆర్థిక సంవత్సరం (2018-19) తొలి ఐదు రోజుల్లో 1,90,000 పిటిషన్లు రాగా, 2017-18లో 1,99,000, 2016-17లో 2,36,000, 2015-16లో 2,32,972, 2014-15లో 1,72,581 పిటిషన్లు వచ్చాయి.