Devotional

గాలి గోపురం ప్రాముఖ్యత ఇదే

గాలి గోపురం ప్రాముఖ్యత ఇదే

ఆలయం అంటేనే సకలదేవతలు అక్కడ కొలువుంటారని భక్తుల నమ్మకం. ఆలయంలోని ప్రతి భాగంలోనూ అనేక విశేషాలు ఉన్నాయి. వాటి అధిదేవతలు కొందరు ఉన్నారు. ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికి వీటిపై కనీస అవగాహన అవసరం. ఆలయాన్ని, ఆలయ భాగాలనూ సాకల్యంగా తెలుసుకోవడం వలన మనకు మరింత ఆధ్యాత్మికత అలవడి భగవదనుగ్రహాన్ని పొందగలుగుతాం.ఉదాహరణకు గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, వాహన మండపం, రంగమండపం, పరివారదేవతలు, కోష్ఠదేవతలు, శిఖరం, విమానం ఇలా అనేక భాగాలున్నాయి. వీటి గురించి ప్రతి భక్తుడూ తెలుసుకోవాలన్న సత్సంకల్పంతో ఇకపై సాక్షి వారం వారం ఆలయంలోని అనేక భాగాలను గురించిన సమగ్ర సమాచారాన్ని అందించనుంది. వాటిలో ముందుగా ఆలయ గోపురం గురించి తెలుసుకుందాం. ఆలయం లేని ఊరిలో క్షణం కూడా ఉండరాదంటున్నాయి మన ఆగమాలు. భగవంతుడు సదా నివాసముండే చోటే ఆలయం.
అనంత విశ్వమంతా నిండిన భగవంతుని ఉనికిని ఒకచోట చేర్చి, ఆలయం నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించి, సదా అందులో సాన్నిధ్యం కల్పించి భక్తుల్ని బ్రోవమని కోరుతారు అర్చకులు. ఈ సమాజంలో మనిషిని సన్మార్గంలో నిలిపేవి రెండు ఒకటి గుడి, రెండు బడి. నిజానికి పూర్వం బడులు కూడా గుడిలోనే ఉండేవి. ఆలయం కేవలం అర్చనాదులకే పరిమితం కాలేదు. విద్యను నేర్పే పాఠశాలగా, ఆకలి తీర్చే అన్నశాలగా, సంస్కృతిని నిలిపే కళాకేంద్రంగా, ప్రజలసమస్యలను తీర్చే న్యాయస్థానంగా, వసతిని కల్పించే వాసస్థానంగా, ప్రకృతి ఒడిదుడుకులు సమయంలో రక్షణాకేంద్రంగా, సకల వృత్తులవారికీ పని కల్పించే ఉద్యోగ కేంద్రంగా నిలిచింది. ఇలా ఆలయం మానవుని జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది.
*కాలిగోపురమే గాలి గోపురంగా
ఆలయంలోని అణువణువునా భగవంతుని ఉనికిని గుర్తించాలి. అయితే, ఆలయం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది గోపురం. చాలా ఎత్తుగా, అనేక అంతస్తులతో, అనేక శిల్పాలతో, చూడగానే భక్తుడికి ఒక పవిత్ర భావాన్ని కల్పించి, మరికాసేపట్లో దేవుడిని దర్శనం చేసుకుంటామనే ఆనందాన్ని కలిగిస్తుంది గోపురం. గోపురాన్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి.ఆలయానికి తొలివాకిలి గోపురం. దీనికే ద్వారశాల అనే పేరు కూడా ఉంది. ద్వారం పైన నిర్మించే నిర్మాణం కనుక ఇది ద్వారశాల. మరికొందరు గాలిగోపురం అని చెబుతుంటారు. గోపురం లోపలికి రాగానే వాతావరణం ఎంత వేడిగా ఉన్నా చల్లటిగాలి వీస్తుంది. బహుశా అందువలన అందరూ ఇలా అంటారని భావించవచ్చు. కానీ నిజానికి ఆలయంలోని ప్రతిభాగం భగవంతుని శరీరభాగంగా కీర్తిస్తున్నాయి ఆగమాలు. అలా గోపురం భగవంతుని పాదాలుగా కీర్తించబడుతున్నాయి. కాలిగోపురం కాలక్రమేణా గాలిగోపురం అయిపోయింది. మనం ప్రయాణాలలో ఉన్నప్పుడు దూరంగా ఆలయం ఉనికిని తెలిపేది ఆలయగోపురమే.అలా గోపురం కనిపించిన వెంటనే చాలా మంది నమస్కారం చేస్తారు. ఆ నమస్కారం భగవంతునికి తప్పక చేరుతుందని పెద్దలు చెబుతారు. ఎందుకంటే, గోపురానికి నమస్కరిస్తే భగవంతుని పాదాలకు నమస్కరించినట్లే.గోపురం ఒక నిర్మాణం మాత్రమే కాదు. అది పౌరాణిక విజ్ఞానాన్ని తెలిపే పాఠశాల. గోపురంపై అనేక పురాణ ఘట్టాలు శిల్పాలుగా నయనానందకరంగా చెక్కబడి ఉంటాయి. గోపురాలకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి అతి పెద్ద గోపురాలను నిర్మించింది మాత్రం పాండ్యురాజులే. మధురైలోని మీనాక్షీ ఆలయ గోపురాలే అందుకు నిదర్శనం.హంపీ విరూపాక్ష దేవాలయంలో గోపురానికి సంబంధించిన ఒక విశేషం ఉంది. ఆలయంలోని ఒకచోట తూర్పు రాజగోపురం నీడ తల్లకిందులుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో గల నరసింహ స్వామి ఆలయ గాలిగోపురం కూడా ఎత్తయిన గాలిగోపురాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది.
1. యాదాద్రి కొండ అభివృద్ధిలో సరికొత్త ప్రణాళిక
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతిమయ ప్రాంగణంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. శిల్పరూపాలతో విస్తరణ చేపట్టిన ఆలయ పనుల ముగింపు నేపథ్యంలో మార్పులు, చేర్పులు అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించిన విషయం తెలిసిందే. సీఎం దిశానిర్దేశంతో కొండను హరితమయంగా మార్చనున్నారు. యాత్రికులకు ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదకరంగా దక్షిణ దిశలో రూపొందించేందుకు ఆలయ శిల్పి ఆనందసాయి నమూనాల తయారీ చేపట్టారు. మానసిక ప్రశాంతత, ఆహ్లాదం ఉట్టిపడేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మూడంతస్తులు హరితమయంతో పాటు గోపురం ఆకారంలో ఫౌంటేన్‌ ఆవిష్కృతం కానుంది.
2. కాణిపాకం గణపతికి రూ.కోటి కిరీటం
చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు బంగారు కిరీటం కానుకగా బహూకరించారు. 2.6 కిలోల బరువుతో వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాన్ని ఆలయ ఈవో పెనుమాక పూర్ణచంద్రరావుకు అందజేశారు. దాని విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అధికారుల అంచనా. ఆలయ మర్యాదల ప్రకారం ఈవో.. దాత, కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం చేయించి, తీర్థప్రసాదాలను అందించారు.
3. రూ.507 కోట్లు డిపాజిట్‌
గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.507 కోట్ల నిధులను డిపాజిట్ల రూపంలో జమ చేసినట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమలలో శుక్రవారం నిర్వహించిన డయల్‌ తితిదే ఈవో కార్యక్రమంలో జేఈవో లక్ష్మికాంతంతో కలిసి ఈవో సింఘాల్‌ మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.301 కోట్లను జమ చేయగా, ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.206 కోట్లు డిపాజిట్‌ చేసినట్లు వివరించారు. హుండీ ఆదాయంతోపాటు తితిదే ట్రస్టులకు వచ్చే విరాళాల మొత్తం పెరిగినట్లు గుర్తుచేశారు. ‘శ్రీవారి హుండీ ఆదాయం 2017-18లో రూ.1,147 కోట్లు రాగా 2018-19లో రూ.1,214 కోట్లు వచ్చింది. శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు కింద 2017-18లో రూ.127 కోట్లు అందగా 2018-19లో రూ.140 కోట్లకు పెరిగాయి. బర్డ్‌ ట్రస్టుకు 2017-18లో రూ.11.80 కోట్లు రాగా 2018-19లో రూ.21 కోట్లకు చేరాయి’ అని ఈవో వివరించారు. శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి జులై నెల కోసం 73,603 టిక్కెట్లను శుక్రవారం ఉదయం విడుదల చేసినట్లు ఈవో వెల్లడించారు.
4. శ్రీశైలంలో వైభవంగా మల్లన్నకు ప్రభోత్సవం
శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు వైభవంగా ప్రభోత్సవం జరిగింది. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం శివనామస్మరణల నడుమ శ్రీగిరి పురవీధుల్లో ప్రభోత్సవం జరిగింది. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ, భ్రమరాంబాదేవికి ప్రత్యేకంగా సరస్వతి అలంకారం చేసి శ్రీశైల పురవీధుల్లో ఊరేగించారు.
5. ఇంద్రకీలాద్రిపై ఉగాది-వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం
ఇంద్రకీలాద్రిపై ఈ నెల 6 నుంచి శ్రీవికారి నామ సంవత్సర ఉగాది – వసంత నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. ఈ నెల 6న ఉగాదిని పురస్కరించుకొని జగన్మాత దుర్గమ్మకు స్నపనాభిషేకం, అలంకరణ, హారతి. ఉదయం 9 గంటలకు సాధారణ భక్తులకు దర్శనానికి అనుమతిస్తారని తెలిపారు. ఈ నెల 6 నుంచి 14 వరకు అమ్మవారికి పుష్పార్చన, హోమాలు, మండప పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మల్లికార్జున మహా మండపం ఏడో అంతస్తులో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అమ్మవారికి ప్రతి రోజు వివిధ రకాల పుష్పాలతో పుష్పార్చన నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 6న మల్లెపూలు, మరువం, 7న పసుపు చామంతి, ఎర్ర గులాబీ, 8న తెల్ల చామంతి, 9న మందారం, ఎర్రకలువ, 10న తెల్లజిల్లేడు, మారేడు, తులసీ దళాలు, 11న కాగడ మల్లి, జాజిపూలు, 12న ఎర్రతామర, ఎర్రగన్నేరు, సన్నజాజులు, 13న పసుపు చామంతి, సంపెంగ పూలతో జగన్మాతకు పుష్పార్చన నిర్వహిస్తారని చెప్పారు. పుష్పార్చన పూజ రుసుం రూ.2500 అని తెలిపారు. పుష్పార్చనలో పాల్గొన్న ఉభయదాతలకు అమ్మవారి దర్శనంతో పాటు ప్రసాదాలను దేవస్థానం సిబ్బంది అందజేస్తారని పేర్కొన్నారు.
6. శ్రీశైలంలో వైభవంగా మల్లన్న రథోత్సవం
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని శనివారం వైభవంగా రథోత్సవం జరిగింది. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య రథం వద్దకు తీసుకువచ్చారు. లక్షలాది మంది కన్నడ భక్తుల శివనామస్మరణల నడుమ శ్రీస్వామిఅమ్మవార్లకు పురవీధుల్లో రథోత్సవం జరిగింది.
7. భద్రాద్రి ఉత్సవాలకు గవర్నర్‌కు ఆహ్వానం
ఉగాది వేళ భద్రాద్రి, యాదాద్రి ఆలయాల అర్చకులు శనివారం రాజ్‌భవన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, గవర్నర్‌ నరసింహన్‌ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రాచలంలో 14న కల్యాణం, 15న మహాపట్టాభిషేకం తిలకించేందుకు వారు రావాలని కోరారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా గవర్నర్‌కు ఆహ్వాన పత్రాన్ని రామాలయ ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకుడు మురళీకృష్ణమాచార్యులు, వేద పండితుడు హనుమత్‌శాస్త్రి అందించారు. ఇలాంటి వేడుకలకు ముఖ్యమంత్రిని పిలవడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, ఎన్నికల కోడ్‌ ఉండటంతో అధికారికంగా శుభలేఖలను అందించలేదు. కల్యాణ కార్యక్రమాల సమాచారాన్ని మాత్రం తెలియజేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులను వైదిక పెద్దలు ఉత్సవాలకు ఆహ్వానించారు.
8. శివకేశవులు… ఎదురెదురుగా!
శ్రీమాహావిష్ణువు అశ్వర్థ నారాయణుడిగా, మహాశివుడు శ్రీచక్రభీమలింగేశ్వరుడిగా ఒకేచోట కొలువైన ప్రాంతం అనంతపురంలోని చిన్నపప్పూరు అశ్వర్థ క్షేత్రం. పాపాలను తొలగించే స్వామిగా అశ్వర్థ నారాయణుడు పూజలందుకుంటుంటే భక్తులపాలిట కొంగుబంగారంగా భీమలింగేశ్వరుడు భాసిల్లుతున్నాడు.
*శివకేశవులకు అభేదాన్ని తెలుపుతున్న అశ్వర్థ క్షేత్రం అనంతపురం జిల్లా చిన్నపప్పూరులో ఉంది. పెన్నానది ఒడ్డున కొలువైన ఈ క్షేత్రం జిల్లాలోనే ప్రముఖ దర్శనీయ స్థలంగా వెలుగొందుతోంది. ఇక్కడ స్వయంభూలుగా వెలసిన అశ్వర్థ నారాయణుడూ శ్రీచక్రభీమలింగేశ్వరుడూ ఎదురెదురుగా దర్శనమివ్వడం విశేషం. వేములవాడ భీమ కవి ఈ క్షేత్రంలోనే చాలా ఏళ్లు గడిపాడని చెబుతారు. ఇక్కడి పెన్నానదిలో స్నానమాచరించి శివకేశవులను దర్శించుకుంటే పాపాలు తొలగి, కోరిన కోర్కెలు నెరవేరతాయనీ సంతానం లేనివారికి తప్పక సంతానం కలుగుతుందనీ భక్తుల విశ్వాసం.
*స్థలపురాణం
పూర్వం శింగరభట్టు అనే మునీశ్వరుడికి విధివశాత్తు బ్రహ్మహత్యా దోషం ప్రాప్తిస్తుంది. దీని నుంచి విముక్తి పొందేందుకు నివారణోపాయాన్ని తెలపమంటూ వేదవ్యాసుడిని అడుగుతాడు శింగరభట్టు. అప్పుడు వేదవ్యాసుడు దక్షిణ భారదేశంలోని ఒక చోట పెన్నానది దక్షిణం నుంచి ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్పి, ఆ నదీతీరంలోనే అశ్వర్థం అనే ప్రాంతం ఉందనీ అక్కడికి వెళ్లి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేయమని చెబుతాడు. వేదవ్యాసుడు చెప్పిన విధంగానే శింగరభట్టు ఆ ప్రాంతానికి చేరుకుని తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అతడి తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై శింగరభట్టుకు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. అనంతరం శింగరభట్టు కోరికమీద స్వామివారు ఆ ప్రాంతంలోనే అశ్వర్థ నారాయణుడిగా వెలశాడని ప్రతీతి. తన భక్తితో గోవిందుడిని మెప్పించిన శింగరభట్టు కూడా స్వామి చెంతనే శిలారూపంలో దర్శనమివ్వడం విశేషం.
*భీముడు ప్రతిష్ఠించిన లింగం
పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలోని పెన్నానదిలో స్నానమాచరించి గట్టుమీద కొంతసేపు సేదతీరుతారు. ఆ సమయంలో పాండవ మధ్యముడు భీముడికి ఇక్కడే భూమిలో శివలింగం ఉన్నట్టు కల వస్తుంది. ఈ విషయాన్ని అగ్రజుడైన ధర్మరాజుకు చెబుతాడు. అనంతరం అన్నదమ్ములందరూ కలిసి ఆ ప్రాంతంలో తవ్వి చూడగా శివలింగం దర్శనమిస్తుంది. భీముడి చేత ఆ లింగాన్ని పైకి తీయించి, పంచామృతాలతో అభిషేకించి ఆ ప్రదేశంలోనే శ్రీచక్రం మీద ప్రతిష్ఠచేయిస్తాడు ధర్మరాజు. అందుకే ఈ క్షేత్రానికి భీమలింగేశ్వర ఆలయం అన్న పేరు వచ్చిందని చెబుతారు. హైందవ సంప్రదాయంలో శ్రీచక్రానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఆదిశక్తి అనంత రూపాలూ నవావరణాల్లో ఇమిడి ఉంటాయని ప్రతీతి. ఒక్కో ఆవరణంలో దుర్గ, లలిత, మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి, గాయత్రి, త్రిపుర, చండి, కాళీ అమ్మవార్లు కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. అంతటి శక్తిసంపన్నమైన శ్రీచక్రం మీద శివయ్య కొలువై ఉండటంతో ఇక్కడి స్వామిని శ్రీచక్రభీమలింగేశ్వరుడిగా కూడా అర్చిస్తారు. కార్తికమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో స్వామివారిని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.
*విశేష పూజలు
శివకేశవులు ఇద్దరూ కొలువైన ఆలయం కావడంతో కార్తిక, మాఘమాసాల్లో భక్తులు విశేషంగా పూజలు చేస్తారు. మాఘమాసంలో అశ్వర్థనారాయణుడి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. దీంతోపాటు ప్రతి పౌర్ణమికి స్వామివారి కల్యాణోత్సవం కనుల పండగగా నిర్వహిస్తారు. కార్తికమాసంలో భీమలింగేశ్వరుడు శోభాయమానంగా దర్శనమిస్తాడు. శివయ్య ఈ మాసమంతా నిత్యాభిషేకాలూ, విశేషపూజలతో అలరారుతాడు. ఆలయ ఆవరణలోనే ఆంజనేయస్వామి, నాగదేవతల విగ్రహాలూ ఉన్నాయి.
*ఇలా చేరుకోవచ్చు
అనంతపురం జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్లు, తాడిపత్రి పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో అశ్వర్థ క్షేత్రం ఉంది. రోడ్డు మార్గం ద్వారా తాడిపత్రి నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మాఘమాసంలో తాడిపత్రి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు.
9. ఏ వారం ఏ దేవుడికి పూజ చేయాలి?
పంచాంగం ప్రకారం ప్రతి రోజుకీ ఒక దేవుడు అధిపతిగా ఉంటాడు. ఆ రోజున ఆ దేవుడికి పూజచేస్తే కార్యసిద్ధితోపాటు దైవానుగ్రహం తప్పక లభిస్తుందంటారు. ఏ రోజు ఎవరిని అర్చించాలంటే…ఆదివారం నవగ్రహాల్లో అగ్రజుడైన సూర్యభగవానుడిని స్మరించుకోవాలి. ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల నేత్ర వ్యాధులూ చర్మ వ్యాధులూ తగ్గుతాయని చెబుతారు.సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు.ఆ రోజున నీలకంఠేశ్వరుడిని పూజించాలి.పాలూ బియ్యం పంచదారతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.మంగళవారం హనుమంతుడిని అర్చించాలి.కాళీదేవతనూ దుర్గామాతనూ పూజించినా మంచి ఫలితం ఉంటుంది.బుధవారం విఘ్నేశ్వరుడిని పూజించాలి.గణనాథుడిని గరికతో అర్చించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.గురువారం విష్ణుభగవానుడినీ లేదా ఇష్టదైవాన్నీ ఆరాధించడం వల్ల శుభఫలితాలు ఉంటాయి.దక్షిణామూర్తిని పూజిస్తే సకల దోషాలూ తొలగిపోతాయి.శుక్రవారం దుర్గాదేవినీ, రాజరాజేశ్వరినీ అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలూ విజయాలూ చేకూరుతాయి.శనివారం పూట రుద్రాది దేవతల ఆరాధన మంచిది. శని దేవుడికి దీపారాధన చేయాలి.
10.మరోసారి ప్రధానిగా మోడీ
కేంద్రంలో మరోసారి అధికార పక్షమే అధికారాన్ని కైవసం చేసుకుంటుందనీ, మోదీ జన్మనక్షత్రం ప్రకారం వికారి నామ సంవత్సరంలో శుభయోగం ఉందనీ, ఆయన మరోసారి ప్రధాని అయ్యే అవకాశం వంద శాతం ఉందని కంచిపీఠ ఆస్థాన సిద్ధాంతి, ఏపీ ప్రభుత్వ ఆగమ సలహాదారు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరులోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన ఉగాది పంచాంగాన్ని పఠించారు. వికారి నామ సంవత్సరంలో కేంద్రం ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ ఏడాది మోదీకి శుభకాలం నడుస్తుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా వెంటనే తొలగిపోతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విరోధాలు చోటు చేసుకుంటాయన్నారు. రాష్ట్రంలో అధికార పక్షానికి కష్టకాలం నడుస్తుందన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జన్మ నక్షత్రం ప్రకారం 2018 నుంచి శని మహర్దశ శుక్రుడు-గురుడు మధ్య నడస్తుంటంతో కేంద్రం, రాష్ట్రానికి వారధిగా పనిచేస్తారని శాస్త్రం చెబుతోందన్నారు. భాజపా 39వ ఆవిర్భావ దినోత్సవం కూడా వికారి నామ సంవత్సరం, శనివారం రావటం పార్టీకి కలిసి వస్తుందన్నారు.