Agriculture

మల్బరీ సాగులో కరీంనగర్ మహిళల ముందంజ

mulberry cultivation success by karimnagar women

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లిలో పలువురు మహిళా రైతులు పట్టు పురుగుల పెంపకంలో పట్టు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాలు మల్బరిని విరివిగా సాగు చేస్తూ, మల్బరీ పట్టు ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పోషిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లా తుమ్మనపల్లికి చెందిన నర్ర ధనజ ఐదేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నారు. మల్బరీ సాగు ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో నర్ర ధనజ, స్వామిరెడ్డి దంపతులను సన్మానించారు. మల్బరీ సాగులో ప్రతి యేటా రూ.3 లక్షలు ఖర్చు చేసి రూ. 11 లక్షలు ఆదాయం పొందుతున్నట్లు ధనజ తెలిపారు. ఆమెతోపాటు ఆ ఊళ్లో అనేక మంది మహిళా రైతులు మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రైతాంగం అనాదిగా సాధారణంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేస్తుండగా అతివృష్టి, అనావృష్టి వలన పంటలను నష్టపోయిన సందర్భాలు అనేకం. ఇదే సమయంలో తుమ్మనపల్లి మహిళా రైతులు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను ఆర్జించే మల్బరీ పంటపై దృష్టి సారించారు. మల్బరీ సాగు పట్టు ఉత్పత్తిలో రెండు దశలు ఉంటాయి. మొదటిది మల్బరీ పంట సాగు, రెండోది మల్బరీ ఆకులు తినిపించి పట్టు పురుగులను పెంచడం. మొదట 8 నెలల పాటు మల్బరీ తోటను పెంచుతారు. మల్బరీ పంటకు ఎకరాకు సుమారు రూ.10 వేలు ఖర్చవుతుండగా, సుమారు రూ. 55 వేల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మల్బరీ తోటను ఒకసారి నాటితే 20 సంవత్సరాల పాటు సాగు చేయవచ్చు. సంవత్సరంలో సుమారు నాలుగు నుంచి ఆరు సార్లు పంటను పొందుతున్నారు. తుమ్మనపల్లిలో 50 మంది మహిళా రైతులు 2–3 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ తోటలు పెంచుతున్నారు. మల్బరీ తోట పక్కనే షెడ్‌ నిర్మించుకుని శ్రద్ధగా పట్టు పురుగులు పెంచుతున్నారు. ఇక్కడి సాగు తీరును తెలుసుకునేందుకు ఇతర జిల్లాల నుంచి రైతులు వచ్చి చూసి వెళ్తుండటం విశేషం.