తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు పాలించిన చారిత్రక ప్రాంతమిది. ఆ రాజ్యపు రాజధానిగా కూడా ఉండే రాజమహేంద్రవరం గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలిచారు. రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా పేరొందింది. రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం గోదావరి నది చుట్టూ విస్తరించి ఉంది. ఆర్థిక, సాంఘిక, చారిత్రక, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. పోలవరం వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశించిన గోదావరి నది ధవళేశ్వరం వద్ద రెండు ప్రధాన పాయలుగా చీలి ఏర్పరచిన డెల్టా ఇక్కడే ఉంది.
*నియోజకవర్గ స్వరూపమిదీ
రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో దీని రూపురేఖలు మారిపోయాయి. అంతకుముందు రాజమహేంద్రవరం నియోజకవర్గంలో భాగంగా ఉన్న బూరుగుపూడి, కడియం, రామచంద్రాపురం, ఆలమూరు శాసనసభ నియోజకవర్గాలను తొలగించి.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అదనంగా రెండు సెగ్మెంట్లను దీని పరిధిలో చేర్చారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.
*గత చరిత్ర ఇది
1952లో భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున తొలి ఎంపీగా కానేటి మోహనరావు ఎన్నికయ్యారు. ఆ తర్వాత నల్లా రెడ్డినాయుడు, డీఎస్ రాజు, ఎస్‌బీపీబీకే పట్టాభి రామారావు, చుండ్రు శ్రీహరిరావు, సినీ నటి జూలూరి జమున, కేవీఆర్ చౌదరి, చిట్టూరి రవీంద్ర, గిరిజాల వెంకట స్వామినాయుడు, ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, మాగంటి మురళీమోహన్ ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచారు. డీఎస్ రాజు(దాట్ల సీతారామరాజు), ఎస్‌బీపీబీకే పట్టాభి రామారావు వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించారు.వారి తర్వాత ఉండవల్లి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే డీఎస్ రాజు 1957లో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. కాగా, ఇక్కడి నుంచే ఎంపీలుగా ఎన్నికైన ఎస్‌బీపీబీకే పట్టాభి రామారావు(కాంగ్రెస్), ఎస్‌బీపీబీకే సత్యనారాయణ స్వయానా అన్నదమ్ములు. వీరిద్దరూ కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో 16 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 10 సార్లు, టీడీపీ మూడుసార్లు, బీజేపీ రెండుసార్లు, భారత కమ్యూనిస్టు పార్టీ ఒకసారి విజయం సాధించాయి.
*అవినీతి ఊబిలో టీడీపీ
అధికార టీడీపీని అవినీతి వెంటాడుతోంది. ఈ నియోజకవర్గ పరిధిలో దోచుకున్నంతగా ఇసుకను ఎక్కడా దోచుకోలేదు. ఇసుక ద్వారా అధికార పార్టీ నాయకులు రూ.వేలాది కోట్లు ఆర్జించారు. ఒక్క ఇసుకే కాదు.. మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలతో భారీగా దోపిడీ చేశారు. రియల్టర్ల దగ్గర ముడుపులు తీసుకుని అక్రమ లేఅవుట్లు వేయించారు. ఆ ముసుగులో పక్కనున్న ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించారు.నీరు–చెట్టు, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, సాగునీటి పనులు.. ఇలా ప్రతి దాంట్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఇక, పుష్కర పనుల్లో పెద్దఎత్తున దోపిడీ జరిగింది. ఆ పనులను టీడీపీ నేతలకు కట్టబెట్టి పుష్కర నిధులను ధారాదత్తం చేశారు. వాటికి తోడు టీడీపీ నేతల మధ్య ఎక్కడికక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ముఖ్యంగా కొవ్వూరులో విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన అనితను తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
*పుష్కర పాపం చంద్రబాబుదే
సీఎం చంద్రబాబు ప్రచార యావకు గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులు బలి అయ్యారు. ఆయన ప్రచార డాక్యుమెంటరీ కోసం భక్తులను కట్టడి చేసి, అనంతరం ఒక్కసారిగా వదిలేయడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ప్రాణాలను కోల్పోయారు. దీనికి ముమ్మాటికీ చంద్రబాబుదే బాధ్యత. రాజమహేంద్రవరం చరిత్రలో పెను మృత్యుఘంటిక మోగించిన ఆ ఘటనను ఇక్కడి ప్రజలంతా ఎప్పటికీ మరిచిపోలేరు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు ప్రత్యేకించి చేసిందేమీ లేదు. ఆ పార్టీ నేతల అవినీతిని ప్రోత్సహించడం తప్ప అభివృద్ధికి ఏమాత్రం పాటు పడలేదు.
*రాజన్న అడుగులు
డెల్టా ఆధునికీకరణకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1,710 కోట్ల నిధులు కేటాయించారు. గోదావరి నీటిని మెట్టకు తరలించే పుష్కర ఎత్తిపోతల పథకానికి వైఎస్సార్ రూ.900 కోట్లు కేటాయించారు. 1.45 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. నన్నయ యూనివర్సిటీ ప్రగతికి పాటు పడ్డారు.
*బరిలో వీరే
వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మార్గాని భరత్, టీడీపీ తరఫున మాగంటి రూప, జనసేన నుంచి ఆకుల సత్యనారాయణ, బీజేపీ అభ్యర్థిగా సత్య గోపీనాథ్‌దాస్, కాంగ్రెస్ తరఫున ఎన్.విజయ శ్రీనివాసరావు రంగంలో ఉన్నారు. ఇక్కడ పోటీ ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యనే ఉంది. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ కొత్త వారే. ఓటమి భయంతో సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ ఎన్నికల నుంచి తప్పుకోవడంతో ఆయన కోడలు మాగంటి రూప అభ్యర్థిత్వం తెరపైకి వచ్చింది. వైఎస్సార్ సీపీ తరపున యువకుడు, బీసీ నేత, సినీ నటుడు మార్గాని భరత్ పోటీ చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
*భరత్ సుపరి చితుడు
బీసీ వర్గానికి చెందిన యువకుడు. సినీ పరిశ్రమతో పరిచయం ఉన్న వ్యక్తి. ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. వైఎస్సార్ సీపీలో చేరి ఇప్పటికే లోక్‌సభ పరిధిలోని అన్ని ప్రాంతాలనూ చుట్టి వచ్చారు. దాదాపు అందరికీ సుపరిచితులయ్యారు. లోక్‌సభ వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ గాలి వీస్తుండటంతో విజయావకాశాలు మెండుగా కనబడుతున్నాయి.
*ప్రజలకు తెలియని రూపం
ఎంపీ మురళీమోహన్ ఎన్నికల బరినుంచి తప్పుకోవడంతో ఆయన కోడలు మాగంటి రూప పోటీ చేస్తున్నారు. గతంలో మామకు సహకారంగా ఉన్నా నియోజకవర్గంలో ఆమె మార్క్ ఏమీ లేదు. నామినేషన్లకు కొన్ని రోజుల ముందు ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. దీంతో నియోజకవర్గ ప్రజలకు అంతగా పరిచయం కాలేదు. మామ మురళీమోహన్ ప్రత్యేకంగా చేసిందేమీ లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ ప్రభావం రూపపై పడనుంది.