Kids

తల్లిదండ్రులు మందలించేది మన మంచికోసమే

parents scolding is good

‘ఏంబుజ్జీ! ఈ మధ్య బంటీ కనిపించడం లేదు’ అడిగాడు తాతయ్య.‘అవును తాతయ్యా! మొన్న వాళ్ల అమ్మ తిట్టిందని అలిగాడు. అప్పటి నుంచి బయటకు రావడం లేదు. అన్నం కూడా తినడం లేదంట. వాళ్ల అమ్మతోనే కాదుఎవరితో మాట్లాడడంట.’ వరదలా చెప్పేసింది బుజ్జీ.‘అదేంట్రా! అమ్మ తిడితే అలుగుతారా..! ఆమె చెప్పిందాంట్లో ఉన్న మంచిని తీసుకోవాలి కదా. తప్పు చేయబట్టే కదా కోప్పడింది’.‘అయినా ఈ మధ్య మా అమ్మ, నాన్నలు ఊరికే తిట్టేస్తున్నారు తాతయ్యా. ఈ పెద్దోళ్లున్నారే’ కోపంగా అన్నాడు చింటూ.‘తప్పు. అలా అనకూడదు. అమ్మ కోపం వెనకకచ్చితంగా కారణం ఉంటుంది. పూర్వం మహారాజులైన వాళ్లే అమ్మ మాట విన్నారు. మహాభారతంలో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పిన ఓ కథ చెబుతాను వినండి.’ అన్నాడు తాతయ్య. పూర్వం ఓ రాజమాత ఉండేది. ఆమె పేరు విదుల. ఆమెకు ఎంతో ముందుచూపు ఉండేది. ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులన్నీ మంత్రులతో, ఇతర పరివారంతో తెలివిగా చేయిస్తూ ఉండేది. అంత మాత్రం చేత అన్నీ తనకే తెలుసని గర్వపడేది కాదు. ఆ రాజమాతకు ఓ కుమారుడు ఉండేవాడు. అతను రాజ్యపాలన చేసే రోజుల్లో ఓ రోజున సింధు దేశపు రాజుతో యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధానికైతే వెళ్లాడు కానీ… శత్రుసైన్యాన్ని చూసేసరికి తాను గెలవలేనని భయపడి వెనక్కి వచ్చేశాడు. పిరికివాడిలా యుద్ధ రంగం నుంచి వచ్చేసిన కుమారుడిని చూసి రాజమాత ఎంతో బాధ పడింది. వెంటనే అతని దగ్గరకొచ్చి ధైర్యంగా యుద్ధానికి వెళ్లేలా చేసేందుకు నాలుగు మాటలు చెప్పింది. ఆ క్రమంలో గట్టిగా మందలించింది. అమ్మ తిడుతుంటే మొదట రాజుకు చాలా బాధేసింది. ఆ తర్వాత కర్తవ్యం తెలిసొచ్చింది. తన రాజ్య ప్రజలకు రక్షకుడినైన తాను ఇలా పిరికివాడిలా వెనుదిరిగి రావడం సరికాదనుకున్నాడు. వెంటనే సేనలను బయలుదేరదీసి శత్రుసేనతో వీరోచితంగా పోరాడి విజయకేతనం ఎగురవేశాడు. పోరాడి విజయం సాధించి తిరిగివచ్చాడు. ‘చూశారా! ఇక్కడ అమ్మ కర్తవ్య బోధ కోసం కాస్త పరుషంగా మాట్లాడింది. రాజు కూడా అమ్మ తిట్టిందని అనుకుంటే రాజ్యం వేరే వాళ్ల పరం అయ్యేది. అమ్మ కోపంలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి విజేత అయ్యాడు. మనం కూడా అమ్మ, నాన్న ఎప్పుడైనా మందలిస్తే కుమిలిపోకూడదు. మన బాగుకోసమే అదంతా అని గ్రహించి, అందులో మంచిని తెలుసుకోవాలి. అర్థమైంది కదూ’ అంటూ తాతయ్య కథ ముగించాడు. ‘అర్థమైంది తాతయ్యా!’ అని చెప్పి ఎవరిళ్లకు వాళ్లు బయల్దేరారు పిల్లలంతా.