ఏపీలో గతంలో సంచలనం సృష్టించిన తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల చోరీ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులో కిరీటాలు దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉపాలయంలో రెండు నెలల క్రితం వజ్రాలు పొదిగిన మూడు కిరీటాలు చోరీకి గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తిరుపతి పోలీసులు, తితిదే నిఘా విభాగం అధికారులు ఏడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా దేశంలోని పలు చోట్ల విచారణ జరిపారు. అయితే, ఆలయంలో కిరాటాలు చోరీకి గురైన రోజున ఆలయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీలో ఓ వ్యక్తిని గుర్తించారు. దీని ఆధారంగా ఆ వ్యక్తికి సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు.ఆ వ్యక్తికి సంబంధించి ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించి మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన వాడిగా గుర్తించారు. దొంగతనం జరిగినప్పటి నుంచి అతడి కదలికలపై నిఘా వుంచారు. నిందితుడు పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తున్నట్టు గుర్తించి దాదర్ రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తిరుపతికి తీసుకొచ్చి పూర్తిస్థాయిలో విచారించనున్నారు. స్థానికుల సహకారంతో దొంగిలించాడా? ఎలా చేశాడనేది విచారణలో తేలనుంది. అతడే దొంగతనం చేసినట్టు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. చోరీకి గురైన కిరీటాలు మాత్రం ఇప్పటివరకు తితిదే అధికారులకు గానీ, పోలీసులకు గానీ లభ్యం కాలేదు. వీటిని ఎత్తుకెళ్లినట్టు గుర్తించిన ఆ వ్యక్తిని విచారించడం ద్వారా వాటిని ఎక్కడైనా దాచాడా? లేదా ఎవరికైనా విక్రయించాడా అనే విషమం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తిరుమల కిరీటాల దొంగ అరెస్టు
Related tags :