జమ్మలమడుగు: తెదేపా-రామసుబ్బారెడ్డి, వైకాపా-సుధీర్‌రెడ్డి
రాష్ట్రంలో ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గాల్లో జమ్మలమడుగు ఒకటి. ఏళ్ల తరబడి వైరి వర్గాలుగా పోరాడిన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలను ఒకేతాటిపైకి తెచ్చి ఈ నియోజకవర్గ రాజకీయాలను చంద్రబాబు అనూహ్యంగా మార్చేశారు. రాష్ట్రమంత్రి ఆదినారాయణరెడ్డిని కడప లోక్‌సభ స్థానానికి తెదేపా అభ్యర్థిగా, రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి తెదేపా తరఫున నిలబెట్టారు. సుధీర్‌రెడ్డి వైకాపా నుంచి తొలిసారి బరిలోకి దిగారు. కడప జిల్లాలో నిజమైన ముఖాముఖి పోరు వైకాపా, తెదేపాల మధ్య జరుగుతున్న స్థానాల్లో జమ్మలమడుగు అగ్రస్థానంలో ఉందని చెప్పాలి. రాజకీయాల్లో తలపండిన రామసుబ్బారెడ్డికి ఆదినారాయణరెడ్డి కూడా మద్దతిస్తున్నందున ఇక్కడ తెదేపా నెగ్గే అవకాశమున్న స్థానాల్లో మొదటిదని పరిశీలకుల అంచనా.
* జమ్మలమడుగుకు చెందిన చిరువ్యాపారి నగేశ్ మాట్లాడుతూ నిజంగా వీరిద్దని కలిపి ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చంద్రబాబు చేయడం ఆనందించాల్సిన విషయమన్నారు.
***నాడి పట్టుకున్నోళ్లదే విజయం
బద్వేలు: తెదేపా -డాక్టర్ రాజశేఖర్, వైకాపా-డాక్టర్ పి.వి.సుబ్బయ్య
ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినా బలమైన సామాజిక వర్గాలే అనుచరులను బరిలోకి దించి రాజకీయాలను శాసిస్తున్నాయి. 2014లో వైకాపా తరఫున నెగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు తెదేపాలో చేరినా టిక్కెట్ రానందున చివరికి భాజపా నుంచి బరిలోకి దిగారు. కానీ ఇక్కడ భాజపాకు స్థానికుల్లో ఆదరణ లేనందున ఆయన నామమాత్రంగానే మిగిలారు. ప్రధాన పోటీ తెదేపా, వైకాపాల మధ్యనే ఉంది. బద్వేలు నియోజకవర్గ కేంద్రంలో తెదేపా, పల్లెల్లో వైకాపా ఆధిక్యంలో కనిపిస్తున్నాయి. తెదేపా తరఫున 2014 ఎన్నికల్లో పోటీచేసిన విజయజ్యోతికి ఈసారి టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా బరిలోకి దిగారు. తెదేపాకు పట్టున్న మండలాల్లో నేతలను వైకాపా ఆకర్షిస్తోంది.
* బద్వేలు పట్టణానికి చెందిన కూరగాయల వ్యాపారి షేక్‌బాషా మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన, అభివృద్ధి బాగున్నాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని, కానీ జిల్లా రాజకీయాల వల్ల జగన్‌కు ఒకసారి అవకాశం ఇవ్వాలని కొందరు అడుగుతున్నారని చెప్పారు.
****గద్దెనెక్కేదెవరు?
ప్రొద్దుటూరు: తెదేపా – లింగారెడ్డి, వైకాపా-ఆర్.శివప్రసాద్‌రెడ్డి
ప్రొద్దుటూరులోనూ రెండు వైరి వర్గాలను కలిపిన తెదేపా గెలిచేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. తెదేపా అభ్యర్థి లింగారెడ్డికి ప్రత్యర్థి వర్గంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డిని తెదేపా విజయానికి కృషిచేసేలా చంద్రబాబు ఒప్పించారు. ఆయన లింగారెడ్డితో కలసి తిరిగి తెదేపాకు ఓట్లు వేయాలని ప్రజలను అడిగితే రాజకీయ సమీకరణలు మారతాయి. వీరిద్దరూ కలవకూడదని వైకాపా లోలోన ప్రయత్నాలు చేస్తోంది. ఈ నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల వారి ఓట్లు 60 వేలకు పైగా ఉన్నాయి. ఈ వర్గానికి చెందిన బుర్రా రామాంజనేయులు సైతం తెదేపాకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నియోజకవర్గం కీలకనేత మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి వైకాపాలో ఉంటే ఆయన బావమరిది సురేంద్ర(సూరి) తాజాగా తెదేపాకు మద్దతు ప్రకటించారు. ఇది ఇక్కడ కీలక పరిణామం అని నగర ఓటరు రాజేశ్ తెలిపారు.
* రాజుపాలెంకు చెందిన రైతు ఎస్.రమణారెడ్డి మాట్లాడుతూ తెదేపా పథకాలు బాగున్నందున ఆ పార్టీకే మద్దతిస్తామన్నారు.
వైకాపా కోటలో పాగా వేయడానికి తెదేపా తహతహ
Related tags :