Politics

ప్రజావిధేయతకు నిదర్శనం మా అమ్మ

priyanka praises sonia

ప్రజల పట్ల తన తల్లి, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి ఉన్న విధేయతను చూసి దేశంలోని రాజకీయ నేతలందరూ నేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గానూ గురువారం సోనియా నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె వెంట కుమారుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. ఆమె నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం తిరిగి వెళ్లిన ప్రియాంక ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ… ‘రాయ్‌బరేలీ ప్రజల పట్ల మా అమ్మ చూపిన శ్రద్ధ, విధేయతలను చూసి ప్రతి అభ్యర్థి, ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాలి. ప్రజలకు సేవ చేయడం, వారి పట్ల అంకితభావంతో ఉండడమే రాజకీయాలకు అసలైన అర్థం. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఎవరికి లభించిందో వారంతా ప్రజల పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి’ అని పేర్కొన్నారు. కాగా, రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ ఇప్పటికి నాలుగు సార్లు విజయం సాధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మూడుసార్లు గెలుపొందారు. ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక గాంధీ.. ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు విభాగానికి బాధ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడంపై పార్టీయే నిర్ణయం తీసుకుంటుందని ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.