ScienceAndTech

ఈ కాఫీకి పాలు చక్కెర కాఫీపొడి అక్కర్లేదు

Artificial Coffee Without Beans Sugar Or Milk - Atomo- TNILIVE

మాంసం కావాలంటే పశువులు.. పాలు కావాలంటే ఆవులు కావాలన్నది మనకు తెలిసిన సత్యం. కానీ.. టెక్నాలజీ పుణ్యమా అని పరిశోధనశాలలోనే మాంసం కృత్రిమంగా తయారైపోతే.. పాలకు ప్రత్యామ్నాయాలు బోలెడున్నాయని కూడా ఇటీవలే స్పష్టమైంది. మరి మనలో చాలామంది రోజూ ఉదయాన్నే ఎంతో ఆస్వాదించే కాఫీ? దీనికీ ఓ ప్రత్యామ్నాయం తయారు చేసేశాం అంటోంది సియాటెల్‌ స్టార్టప్‌ అటోమో. కాఫీగింజలు ఏమాత్రం వాడకుండా తాము తయారు చేస్తున్న కాఫీలో పాలు, చక్కెర కూడా వాడాల్సిన అవసరం లేదని, పైగా మీకు నచ్చిన విధంగా రుచిని మార్చుకోనూవచ్చని అంటున్నారు అటోమో సీఈవో యాండీ క్లీస్టెక్‌. కాఫీ వాసన, అదిచ్చే ఫీలింగ్, రంగు వంటి అన్ని అంశాలకు సంబంధించి తాము 40 వరకూ పదార్థాలను గుర్తించామని… వాటిని కృత్రిమంగా కలిపేయడం ద్వారా తయారైన తమ కాఫీ అసలుదానికి ఏమాత్రం తీసిపోదని ఆయన వివరించారు. ప్రస్తుతం మనం పండిస్తున్న కాఫీ కారణంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని.. పైగా ఇప్పటికే 60 శాతం నాటు కాఫీ మొక్కలు కనిపించకుండాపోయాయని చెప్పారు. అంతేకాకుండా కాఫీ తోటలు ఎదుర్కొంటున్న కూలీల కొరత తదితర సమస్యల వల్ల కాఫీ పెంపకం పెద్దగా లాభదాయకం కాదని నెస్లే లాంటి కంపెనీలే ఒప్పుకుంటున్నాయని ఈ నేపథ్యంలోనే తాము కృత్రిమ కాఫీని తయారు చేశామని.. సహజసిద్ధమైన మొక్కల పదార్థాలతోనే దీన్ని తయారు చేసినప్పటికీ అందులో ఏమున్నాయో ప్రస్తుతానికి వెల్లడి చేయలేమని అన్నారు.