99 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు ఏం చేస్తారు. మీరు భలే ప్రశ్నలు అడుగుతారు. అసలు 99 ఏళ్లు బతికితే కదా. 99 ఏళ్ల వరకు బతకడమే గొప్ప. ఆ వయసులో ఉన్నవాళ్లు ఇంకా ఏం చేస్తారు అని అడుగుతున్నారా? అంటారా? ఈ 99 ఏళ్ల బామ్మ మాత్రం ఏంచక్కా స్కూలుకెళ్తోంది. హాయిగా ఇంట్లో కృష్ణారామా అంటూ కూర్చోక ఎందుకు ఈమెకు ఈ స్కూల్ అంటారా? మరి.. ఆ బామ్మ ఎందుకు 99 ఏళ్ల వయసులో స్కూల్‌కు వెళ్లానుకుంటున్నదో ఆమెనే అడిగి తెలుసుకుందాం పదండి. అర్జెంటైనాకు చెందిన ఆ బామ్మ పేరు యుసెబియా లియోనర్ కోర్డల్. పేరు పెద్దగా ఉంది కదా. సరే కోర్డల్ అని పిలుచుకుందాం మనం. డియర్ కోర్డల్ బామ్మ.. మీరు ఇప్పుడెందుకు స్కూలుకు వెళ్తున్నట్టు? నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. దీంతో మా ఇంట్లో సమస్యలు ఎక్కువయ్యాయి. వాటికి ఆర్థిక సమస్యలూ తోడవడంతో నేను నా చదువుకు పుల్‌స్టాప్ పెట్టాల్సి వచ్చింది. ఇన్నాళ్లకు నా సమస్యలన్నీ తీరాయి. అందుకే మళ్లీ స్కూల్‌కు వెళ్లాలనుకుంటున్నాను.. అంటూ సెలవిచ్చింది బామ్మ. బామ్మ ప్రస్తుతం లప్రిడాలో ఉన్న ప్రైమరీ స్కూల్‌కు వెళ్తోంది. అయితే ఆ స్కూల్ పిల్లలది కాదు. ఇలాగే చిన్నప్పుడు చదువుకోలేకపోయినవాళ్లు పెద్దయ్యాక చదువుకోవడం కోసం ఏర్పాటు చేసిన స్కూల్. తనకు 98 ఏళ్లు వచ్చినప్పటి నుంచే స్కూల్‌కు వెళ్లడం ప్రారంభించిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా స్కూల్‌కు డుమ్మా కొట్టలేదట. అది స్పిరిట్ అంటే. తనను రోజూ స్కూల్లో పనిచేసే టీచర్లే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి… మళ్లీ సాయంత్రం ఇంటి దగ్గర వదిలిపెడతారట. ఇప్పుడు ఆ బామ్మ చదవడం, రాయడం నేర్చుకున్నదట. త్వరలోనే కంప్యూటర్ ఆపరేటింగ్ కూడా నేర్చుకోబోతున్నదట. వావ్.. సూపర్ బామ్మ. నేర్చుకోవాలన్న నీ తపనకు హేట్సాఫ్.
అర్జెంటీనా బామ్మ మారాం చేయకుండా బడికి వెళ్తోంది
Related tags :