Movies

పిల్లల గురించి ఎందుకు?

deepika padukone pregnancy rumors

వివాహమైన వెంటనే పిల్లల గురించే ఎందుకు అడుగుతారు?అంటూ మీడియాకు సూటి ప్రశ్న వేశారు బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె. గతేడాది నవంబర్‌లో దీపిక, రణ్‌వీర్‌ సింగ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే దీపిక తల్లి కాబోతోందంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. దీని గురించి దీపిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను గర్భం దాల్చలేదు. అది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. అలాగని పెళ్లైన వారిని పిల్లల గురించి అడిగి విసిగించడం ఎందుకు? అది చాలా తప్పు. ఎవరి ఇష్టం వారిది. ఒక జంటపై అలా ఒత్తిడి తేవడం సబబు కాదు. పిల్లలు పుట్టాక వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఎంజాయ్‌ చేయలేమని చాలా మంది నాతో చెప్పారు. మనం (మీడియాను ఉద్దేశిస్తూ) ఇలాంటి ప్రశ్నలు అడగటం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది’ అన్నారు.గతంలో బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ, ఇలియానా, ప్రియాంక చోప్రాలపై కూడా ఇలాంటి వార్తలే వెలువడ్డాయి. వ్యక్తిగత విషయాల్లో మీడియా జోక్యం అవసరం లేదని వారు ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం దీపిక ‘ఛపాక్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. మేఘనా గుల్జార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్లీకి చెందిన యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితాధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2020 జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.