Business

వారంలో 6రోజులు 12గంటలు పనిచేయాలి

jack ma wants emoloyees who can work 12hrs everyday

పని గంటలపై ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌ ఛైర్మన్‌ జాక్‌ మా చేసిన వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ‘ఆలీబాబా గ్రూప్‌లో మీరు కొనసాగాలంటే వారంలో ఆరు రోజుల పాటు రోజుకు 12గంటల చొప్పున పనిచేయాలి’ అన్నారు. ఇటీవల జరిగిన కంపెనీ అంతర్గత సమావేశంలో జాక్‌ మా సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 8గంటలు పనిచేసే ఉద్యోగులు కంపెనీకి అవసరం లేదని ఆ సంస్కృతి పోవాలని ఆలీబాబా అధికారిక వైబో అకౌంట్‌లోనూ పోస్ట్‌ చేశారు. అన్ని చోట్లా అందరూ ‘996’ పని సంస్కృతి అలవాటు చేసుకోవాలని, అలా పనిచేయడం అదృష్టంగా భావించాలన్నారు. ‘9-9-6’ అంటే ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ వారంలో ఆరు రోజులూ పనిచేయాలన్నది జాక్‌ మా ఉద్దేశం. ‘మీరు ఆలీబాబా గ్రూప్‌లో చేరాలనుకుంటున్నారా. అయితే రోజుకు 12గంటల పాటు పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. లేకపోతే మీరు చేరనందుకు బాధపడాల్సిన అవసరం లేదు’ అని చైనాకు చెందిన ఈ సంపన్నుడు వ్యాఖ్యానించాడు. దీనిపై చైనా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్‌మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే స్టార్టప్‌ కంపెనీలను ప్రారంభించి, అత్యధిక పనిగంటలు చేస్తున్న అనేకమంది ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇది కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తారు. ‘996’ కల్చర్‌ ప్రకారం పనిచేసినా, అందుకు తగిన వేతనం ఇవ్వాలి కానీ, అదే జీతంపై అన్నేసి గంటలు పనిచేయడం దుర్మార్గమని విమర్శిస్తున్నారు. ‘ఆయన కంపెనీ యజమాని కాబట్టి 996 చేసినా పర్వాలేదు. ఎందుకంటే అందువల్ల ఆయన సంపదే పెరుగుతుంది. కానీ, ఉద్యోగులు ఎందుకు చేయాలి. జాక్‌ మా సంపదను మరింత పెంచడానికా..’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘996=ఐసీయూ’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.