WorldWonders

భర్తకు బురఖా వేసిన పాకిస్థాన్ అమ్మాయి

pakistani lady covers husband in burkha

భర్తకు పరదా వేసి.. ఇతనే నా అందమైన శ్రీవారు. ఆయన ముఖాన్ని చూపించలేను. ఎందుకంటే ఈ పాడు ప్రపంచం నా భర్త అందాన్ని చూసేస్తే ఎలా?  అంటూ క్వశ్చన్ వేసిన తీరు ఒక సంచలనమైతే.. ఆ అమ్మాయి ఒక పాకిస్థానీ కావటం.. పాక్ లో ఇలాంటి తెగువను ప్రదర్శించిన ఆమె ఇప్పుడు ఇంటర్నెట్ సంచలనంగా మారారు. లైంగిక వివక్షపై సదరు యువతి చేసిన ఎటకారం దాయాది దేశంలో మంట మడిస్తుంటే.. అందుకు రెట్టింపు శభాష్ లు ఆమె ముందు మోకరిల్లుతున్నాయి. పరదా వెనుక మహిళల్ని ఉంచేసి.. వారిని కట్టుబాట్లతో కట్టేసే తీరును కాస్త వ్యంగ్యంగా.. మరికాస్త ఎటకారంగా క్వశ్చన్ వేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. న్యూలీ వెడ్స్ అనే ఇన్ స్టా అకౌంట్లో తన భర్తతో కలిసి ఫోటో దిగింది ఒక అమ్మాయి. ఆమె చుడీదార్ వేసుకొని నవ్వుతూ ఉంటే.. ఆమె పక్కన పరదాలో శ్రీవారు ఒద్దికగా నిలుచున్నారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసిన ఈ మహిళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మీలాంటోళ్ల కోసమే పోస్ట్ పెట్టాను.. ఇప్పటికైనా ఆడ.. మగ అంతా సమానమని గుర్తిస్తే ఇలాంటి వాటి అవసరం రాదంటూ తనను తప్పు పడుతున్న వారికి ఘాటు సమాధానం చెబుతోంది ఆ అమ్మాయి. ఇంతకీ ఇన్ స్టా అకౌంట్లో ఆ అమ్మాయి పెట్టిన పోస్ట్ చూస్తే.. ‘‘ఈయనే అందమైన నా శ్రీవారు. కానీ మా ఆయన అందమైన ముఖాన్ని మీరు చూడలేరు. నా కోసం ఆయన తన అందాన్ని ఇలా దాచుకుంటారు. ఎందుకంటే ఆయన అందం.. సాధించిన విజయాలు.. కలలు ఇలా ఒక్కటేమిటి తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయానికి నేనే హక్కుదారును కదా? తనకు దిష్టి తగలకూడదనే ఈ పాడు ప్రపంచానికి దూరంగా.. తనను ఎప్పుడూ ఇంట్లోనే ఉండమంటాను. నాతో పాటు అప్పుడప్పుడూ బయటికి తీసుకువెళ్తా. నిన్న రాత్రి తనను డిన్నర్కు తీసుకువెళ్లాను. అక్కడ స్టెరాయిడ్  ఫ్రీ చికెన్ మాత్రమే ఆర్డర్ చేశాం. ఎందుకంటే తన ఆరోగ్యం గురించి నాకెంతో శ్రద్ధ”  ‘‘ఒకవేళ ఇలాంటి ఫుడ్  తినడం వల్ల అతను పిల్లల్ని కనిపెంచే  అవకాశానికి మిస్ అయితే ఎలా?  అసలు ఆయన ఉన్నదే నన్ను తల్లిని చేయడానికి. పిల్లల్ని కనివ్వడానికి. అందుకే ఏం తినాలో ఏం తినకూడదో నేనే నిర్ణయిస్తా. తనను బయటికి తీసుకువెళ్లినపుడు ఇలా దాచేస్తా”  అంటూ బుర్ఖా వేసిన తన భర్తను చూపిస్తూ ఆమె పేర్కొన్నారు. ఇక్కడితో ఈ ఎటకారం ఆగలేదు.. మరింతగా కంటిన్యూ చేస్తూ..‘‘ఒకవేళ ఆయన అందానికి ముగ్ధులై ఎవరైనా వేధిస్తే? వేధించారే అనుకోండి అప్పుడు వాళ్లను ఎవరో శిక్షిస్తారని సరిపెట్టుకుంటా. వేరే వాళ్లకే నేను నియమాలు విధిస్తా. నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటా. ఎలాంటి దుస్తులైనా సరే వేసుకుని తిరుగుతా. ఎందుకుంటే నేను ఆడదాన్ని. ఇతర ఆడవాళ్ల గురించి పట్టించుకోను. ఒకవేళ నాపై ఎవరైనా దాడి చేసినా ఏమైనా అన్నా తిరిగి మాట్లాడను. అలా చేస్తే నేను పిరికిదాన్నని ఈ లోకం భావిస్తుంది. ఆడవాళ్లు బలహీనంగా ఉండకూడదు కదా. నేను మరీ అంత లింగ వివక్ష చూపనులెండి. మా ఆయన్ను డ్రైవింగ్ చేసేందుకు అనుమతిస్తా. ఉద్యోగానికి పంపిస్తా. అయితే అక్కడ ఆయన ఎవరితోనైనా మాట్లాడటం పూర్తిగా నిషిద్ధం. నా భర్తను కాపాడుకోవాలంటే కేవలం ఇలా చేస్తే చాలు’’ అంటూ మహిళల పట్ల ప్రదర్శించే లైంగిక వివక్ష పైన తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. ఇప్పుడీ పోస్ట్ పాక్ లోనే కాదు.. పలువురిని విపరీతంగా ఆకర్షిస్తోంది.