Devotional

ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

vontimitta brahmotsavam started

* ఒంటిమిట్టలో ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని పురాతన చారిత్రకప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశపంచామృతాభిషేకం చేసి సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆలయ ప్రధాన కంకణబట్టర్‌ శ్రీరాజేష్‌ కుమార్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది.

తలంబ్రాల తయారీ : 
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్‌ 18న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీని ప్రారంభించారు. ఇందులో భాగంగా బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి ఆధ్వర్యంలో దాదాపు 500 మంది శ్రీవారి సేవకులు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్‌బాబు, ఏఈవో శ్రీ రామరాజు, ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఇతర అధికార ప్రముఖులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కవి సమ్మేళనం : 
పోతన జయంతిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు కవి సమ్మేళనం జరుగనుంది. ఈ సందర్భంగా పోతన వ్యక్తిత్వం, భాగవత విశిష్టత, పోతన భక్తిత్వం, జనప్రియ రామాయణం, రాయామణ కల్పవృక్షం తదితర అంశాలపై ప్రముఖ కవులు సమ్మేళనం నిర్వహిస్తారు.

శేషవాహనం :  
కాగా, శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన శనివారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ జరుగనుంది. ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా,ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.