దశావతార పురుషుడు శ్రీరాముడు జన్మించిన శుభదినమే శ్రీరామనవమి. రాముడు పుట్టినరోజును పండుగలా జరుపుకుంటున్నాం. ఈ పండుగ వేసవికాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదే కాకుండా పానకం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే పెసరపప్పు, శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలువను అందిస్తుంది. జీర్ణశక్తిని అభివృద్ధి పరుస్తుంది. దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక పెసరపప్పునే వడపప్పు అంటారు. ఇది మండుతున్న ఎండల్లో ‘వడదెబ్బ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. శ్రీరామనవమి రోజున ఉదయం ఆరుగంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరం, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజా మందిరం, గడపకు పసుపు, కుంకుమ, ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉండాలి. శ్రీ సీతారామలక్ష్మణ, భరత, శత్రఘు్నలతో కూడిన పటం లేదా శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామరపువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాపండ్లను సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామ రక్షాస్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామపట్ట్భాషేకము అనే అధ్యాయమును పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇక శ్రీరామ దేవాలయం, భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ వంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకాలు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకల్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించడం మంచిది. నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచుదీపం, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు రామునికి తులసి మాలను ధరింపచేయాలి. పూజ పూర్తయిన తర్వాత శ్రీ రామరక్షాస్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముతె్తైదువులకు వాయనం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు.
*** వీక్షణ ఫలితం
శ్రీరామనవమి రోజున భద్రాద్రిలో జరిగే సీతారామకల్యాణం అట్టహాసంగా జరుగుతుందన్న విషయం తెలిసిందే.. అయితే సీతారామ కల్యాణం వీక్షిస్తే కలిగే ఫలితం ఏంటో చూద్దాం. సీతారామకల్యాణం లోక జీవన హేతుకం. సకల దోష నివారణం అని పండితులు అంటున్నారు. సాధారణంగా సర్వ సంపదలకు నిలయం భద్రాచలం. అలాగే సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని, అచలుడు అంటే కొండ అని.. అందుకే రాముడు కొండపై నెలవైన దివ్యధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడ గడపడమే ఈ పుణ్యక్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీ రామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలు చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వం సీతారాముల కల్యాణం మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాల నుంచి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామచంద్రుని పుట్టినరోజు వేడుకలు, కల్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీసీతారామ కల్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే.. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్ట్భాషేకం రామునికి జరిగింది. కోదండ రామకల్యాణాన్ని చూసేందుకు మనమే కాదు, సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంట.. శ్రీరామచంద్రుని దివ్యదర్శనం మహనీయంగా, నేత్రపర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. మనమూ రేపు సీతారామకల్యాణాన్ని గాంచి పునీతులమవుదాం.