ఆసుపత్రి సంచిత (నాసోకోమియల్) ఇన్‌ఫెక్షన్లు కొత్తవేమీ కాదు. ఒకరకంగా ఆసుపత్రులు వెలసినప్పట్నుంచే ఇవీ పుట్టుకొచ్చాయని చెప్పుకోవచ్చు. జబ్బులతో బాధపడేవారిలో అసలే రోగనిరోధక శక్తి తక్కువ. పైగా శస్త్రచికిత్సల మూలంగానో ఇతరత్రా కారణాలతోనో ఆసుపత్రిలో ఎక్కువకాలం ఉండాల్సి రావటం వల్ల ఎంతోకొంత రోగనిరోధకశక్తి తగ్గుముఖం పడుతుంటుంది కూడా. ఫలితంగా కొత్త ఇన్‌ఫెక్షన్ల బారినపడే ముప్పూ పొంచి ఉంటుంది. అందువల్ల వీటిని నివారించటం అత్యవసరమనే విషయాన్ని 19వ శతాబ్దంలోనే గుర్తించారు. ఆధునిక నర్సింగ్ సేవలకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్, యాంటీసెప్టిక్ పద్ధతులకు మార్గం వేసిన ఇగ్నాజ్ సెమెల్‌వీస్ తొలిసారిగా దీని ప్రాధాన్యాన్ని గుర్తించారు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు బాగా మారిపోయాయి. జబ్బుల తీరుతెన్నులు మారిపోయాయి. శస్త్రచికిత్సలు ఎక్కువయ్యాయి. ఒంట్లోకి గొట్టాల వంటివి వేసి చేసే రోగ నిర్ధరణ పద్ధతులు పెరిగిపోయాయి. వీటికి హానికారక బ్యాక్టీరియా మొండిగా తయారు కావటం మరింత ఆజ్యం పోస్తోంది. బ్యాక్టీరియా జన్యు స్వభావం వేగంగా మారిపోతుండటం, యాంటీబయోటిక్ మందులను విచ్చలవిడిగా వాడటం వల్ల బ్యాక్టీరియా మందులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందిచుకుంటోంది. దీంతో సమస్యల తీవ్రత మరింత ఎక్కువకావటం, మరణించే ముప్పు పెరగటం, ఆసుపత్రుల్లో ఎక్కువకాలం ఉండాల్సి వస్తుండటం, చికిత్స ఖర్చులు బాగా పెరిగిపోవటం వంటివి రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. అందువల్ల ఆసుపత్రి సంచిత ఇన్‌ఫెక్షన్ల నివారణ అనేది ప్రస్తుతం చాలా కీలకంగా తయారైంది. ఇందుకు ఆసుపత్రులు, వైద్యులు, సిబ్బంది, ప్రజలంతా బాధ్యతగా వ్యవహరిస్తూ.. సమష్టిగా జాగ్రత్తలు తీసుకోవటం అత్యవసరం. ఆసుపత్రి సంచిత ఇన్‌ఫెక్షన్లు మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరింత ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నవారిలో అమెరికాలో ప్రతి 20 మందిలో ఒకరికి, ఐరోపా సమాఖ్య దేశాల్లో ప్రతి 10 మందిలో ఒకరికి కొత్త ఇన్‌ఫెక్షన్ల ముప్పు పొంచి ఉంటుండగా.. మనలాంటి దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరికి వీటి ముప్పు ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం.. ఏ సమయంలోనైనా ప్రపంచ వ్యాప్తంగా 14 లక్షల మంది ఆసుపత్రి సంచిత ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్నారని అంచనా. ఏటా 20 లక్షల ఆసుపత్రి ఇన్‌ఫెక్షన్లు నమోదవుతుండగా.. వీటితో సుమారు 80 వేల మంది మృత్యువాత పడుతుండటం విషాదకరం. ఆసుపత్రుల్లో చేరుతున్నవారితో పాటు పరామర్శించేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటం, సిబ్బంది కొరత.. అలాగే చేతుల శుభ్రత, పరికరాల శుభ్రతకు సరైన, ఆధునిక పద్ధతులను పాటించకపోవటం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఆసుపత్రి ఇన్‌ఫెక్షన్లలో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లే అధికం. ప్రధానంగా ఇ-కొలై, స్టెఫెలోకాకస్, క్లెబ్సెలా, అసినెటో బ్యాక్టర్, సూడోమోనస్, ఎంటరో బ్యాక్టర్/కొకైయ్ బ్యాక్టీరియా (ఎస్కేప్) ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. న్యుమోనియా వంటి వాటిల్లో అసినెటో బ్యాక్టర్ ఎక్కువగా కనబడుతుంటుంది. మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లలో, కడుపులో తలెత్తే ఇన్‌ఫెక్షన్లలో ఇ-కొలై, క్లెబ్సెలా, సూడోమోనస్ ఇన్‌ఫెక్షన్లు తరచుగా చూస్తుంటాం. శస్త్రచికిత్స జరిగిన చోట స్టెఫెలోకాకస్ వంటి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. మన చర్మం మీద రకరకాల సూక్ష్మక్రిములు ఉంటాయి. మూత్రమార్గంలోకి గానీ రక్తనాళంలోకి గానీ గొట్టాల వంటివి అమర్చినపుడు అక్కడ శుభ్రంగా ఉండేలా చూసుకోవటం చాలా కీలకం. లేకపోతే ఎక్కువకాలం గొట్టాన్ని అలాగే ఉంచినపుడు వాటి ద్వారా హానికర సూక్ష్మక్రిములు లోపలికి చేరుకునే ప్రమాదముంది. ముఖ్యంగా ఆడవారిలో జననాంగం మలద్వారానికి దగ్గరగా ఉంటుంది. దీంతో గొట్టం ద్వారా సూక్ష్మక్రిములు లోపలికి వెళ్లే అవకాశం ఎక్కువ. అందువల్ల అసలు గొట్టాన్ని అమర్చాల్సిన అవసరముందా లేదా అనేది ముందే చూసుకోవటం మంచిది. ఆ తర్వాత కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చికిత్స తీసుకుంటున్నవాళ్లు తనకు తానుగా మూత్రానికి వెళ్లే అవకాశముంటే వీలైనంత త్వరగా గొట్టాన్ని తీసేయాలి. దీంతో ఇన్‌ఫెక్షన్ ముప్పు తగ్గించుకోవచ్చు.
* మూత్రమార్గంలోకి గొట్టాన్ని అమర్చినపుడు మూత్రం నిల్వ ఉండే సంచీ కింది వైపున ఉంటుంది. అయితే చాలామంది మంచం మీది నుంచి లేచినపుడో, ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినపుడో సంచీని పైకి ఎత్తి పట్టుకుంటుంటారు. దీంతో దానిలోని ఇన్‌ఫెక్షన్ వెనక్కి చేరుకొని, సమస్యాత్మకంగా పరిణమించొచ్చు.
* ఒంట్లో అమర్చే ఎలాంటి పరికరమైనా ఎంతో కొంత ఇన్‌ఫెక్షన్‌కు దారితీసే అవకాశముంటుంది. కృత్రిమ కీలు, కృత్రిమ తుంటి, కృత్రిమ గుండె కవాటాల వంటివి సహజమైనవి కావు కాబట్టి ఎంతోకొంత ‘రియాక్షన్’ కలగజేస్తాయి. దీంతో అక్కడ సూక్ష్మక్రిములు వృద్ధి చెందిన ఇన్‌ఫెక్షన్ మొదలు కావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కృత్రిమ పరికరాల నాణ్యత లోపించినా, వాటిని అమర్చే ముందు సరిగా శుభ్రం చేయకపోయినా సమస్యలు తెచ్చిపెట్టొచ్చు.
* చికిత్స కోసం వాడే పరికరాల అపరిశుభ్రత కూడా ఒక కారణమే. ముఖ్యంగా శస్త్రచికిత్సకు ఉపయోగించే పరికరాలన్నింటినీ స్టెరిలైజ్ చేసి శుభ్రం చేయాల్సి ఉంటుంది. దీంతో వాటికి సూక్ష్మక్రిములేవైనా అంటుకొని ఉంటే పూర్తిగా నశిస్తాయి. సాధారణంగా ఆసుపత్రుల్లో పెద్ద ప్రెషర్ కుక్కర్ మాదిరిగా ఉండే ఆటోక్లేవ్ ఛాంబర్‌లో కత్తుల వంటి పరికరాలను పెట్టి శుభ్రం చేస్తారు. ఇందులో మరుగుతున్న నీటికి ఒత్తిడి తోడవటం వల్ల మరింత వేడితో కూడిన నీటి ఆవిరి పుట్టుకొస్తుంది. ఈ వేడికి పరికరాల మీదుండే సూక్ష్మక్రిములు, బీజకణాల వంటివి పూర్తిగా చనిపోతాయి. అయితే గొట్టాల వంటి కొన్ని పరికరాలు వేడిని తట్టుకోలేవు. ఇలాంటివాటిని ప్రత్యేకమైన ద్రావణాలు, రసాయనాలతో శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియ సరిగా జరక్కపోతే ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశముంది.
* మనదగ్గర నర్సుల కొరత ఎక్కువ. ఇంటెన్సివ్ కేర్ విభాగాల్లోనూ ఒకరే ఇద్దరు ముగ్గురికి సేవలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్‌ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించొచ్చు. ఉదాహరణకు- థర్మామీటరుతో చంకల్లో ఉష్ణోగ్రతను చూస్తున్నారనుకోండి. చంకల్లో చెమట ఎక్కువగా పోస్తుంటుంది. అందువల్ల అక్కడ సూక్ష్మక్రిములు ఎక్కువగా పెరుగుతాయి. ఒకవేళ థర్మామీటరును సరిగా శుభ్రం చేయకపోతే హానికర సూక్ష్మక్రిములు మరొకరికి వ్యాపించొచ్చు. ఇవి ఒంట్లో ఎక్కడైనా కోత, పుండు వంటివి ఉంటే వాటి ద్వారా ఒంట్లోకి చేరుకొని ఇన్‌ఫెక్షన్ కలగజేయొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే- చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన తర్వాత కొత్త ఇన్‌ఫెక్షన్ తలెత్తటం. ఆసుపత్రిలో చేరిన 48 గంటల తర్వాత కొత్తగా తలెత్తే వాటిని ఆసుపత్రి సంచిత ఇన్‌ఫెక్షన్లుగా భావిస్తారు. అంటే అప్పటివరకూ లేని సమస్య ఆసుపత్రిలో చేరిన తర్వాత మొదలవ్వటం అన్నమాట. అలాగే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఏడాది లోపు వరకు.. ముఖ్యంగా శస్త్రచికిత్సలు, ఒంట్లో అమర్చిన పరికరాలు, గొట్టాల వంటి వాటి మూలంగా తలెత్తే ఇన్‌ఫెక్షన్లు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఆసుపత్రి ఇన్‌ఫెక్షన్లు ఎవరికైనా రావొచ్చు. అయితే కొందరికి వీటి ముప్పు ఎక్కువ. వయసు, సమస్యల తీవ్రత, చికిత్సల తీరుతెన్నులు, ఆసుపత్రి, చుట్టుపక్కల పరిసరాల వంటివన్నీ వీటిపై ప్రభావం చూపుతాయి.
* 70 ఏళ్లు పైబడిన వారికి
* షాక్‌లో ఉన్నవారికి
* తీవ్రమైన గాయాలైనవారికి
* కిడ్నీ వైఫల్యం గలవారికి
* కోమాలోకి వెళ్లిపోయినవారికి
* అంతకుముందు యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడినవారికి
* వెంటిలేషన్ మీదుండే వారికి
* స్టీరాయిడ్లు, కీమోథెరపీ వంటి వాటితో రోగనిరోధకశక్తి తగ్గినవారికి
* ఒంట్లోకి గొట్టాల వంటివి వేసిన వారికి
* ఇంటెన్సివ్ చికిత్స విభాగంలో ఎక్కువరోజులు (3 రోజుల కన్నా ఎక్కువ) ఉన్నవారికి
నిరంతర పర్యవేక్షణ-నియంత్రణ
ఆసుపత్రి ఇన్‌ఫెక్‌షన్ల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవటం తప్పనిసరని ఆసుపత్రులకు, వైద్య సేవలు అందించేవారికి గుర్తింపునిచ్చే జాతీయ అక్రిడేషన్ సంస్థ మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ ప్రక్రియను ఇన్‌ఫెక్షన్ నియంత్రణ కమిటీ నిశితంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ నర్సులు ఉదయం, సాయంత్రం అన్ని వార్డులను పరిశీలిస్తూ.. ఆసుపత్రిలో చేరిన 48 గంటల తర్వాత ఎవరికైనా కొత్తగా ఇన్‌ఫెక్షన్లు మొదలైతే గొట్టం, పరికరాల వంటివి అమర్చిన చోటు నుంచి నమూనాలు సేకరించి పరీక్షకు పంపిస్తారు. కల్చర్ పరీక్ష చేస్తే సూక్ష్మక్రిముల రకాలు కచ్చితంగా బయటపడతాయి. వాటిని బట్టి తగు యాంటీబయోటిక్స్ ఆరంభిస్తారు. ఆసుపత్రి ఇన్‌ఫెక్షన్ల మూలంగా మరింత ఎక్కువకాలం ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. దీంతో అసలు సమస్య కన్నా కొత్త సమస్యకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అసలు సమస్యలూ తీవ్రం కావొచ్చు. ఆసుపత్రి ఇన్‌ఫెక్షన్లతో మరో ముప్పేంటంటే- వీటికి కారణమయ్యే బ్యాక్టీరియా యాంటీబయోటిక్ మందులను తట్టుకొనే మొండి రకాలు కావటం. అమెరికా, ఇంగ్లాడ్ వంటి దేశాల్లో స్టెఫిలోకాకస్, ఎంటెరో బ్యాక్టర్ వంటి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఎక్కువ. వీటిల్లో యాంటీబయోటిక్ నిరోధకత చాలా ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. చాలా శక్తిమంతమైన యాంటీబయోటిక్ మందులను కూడా ఇవి తట్టుకోగలవు. అందువల్ల వీరికి ఒకట్రెండు యాంటీబయోటిక్ మందులు కలిపి వాడాల్సి వస్తుంది. దీంతో ఖర్చు బాగా పెరిగిపోతుంది. ఆసుపత్రి సంచిత ఇన్‌ఫెక్షన్లలో ఇలాంటి మొండి బ్యాక్టీరియానే ఎక్కువగా ఉంటుండటం గమనార్హం.