Politics

ఒక్క నిజామాబాద్ ఓట్ల లెక్కింపుకే రోజున్నర

nizamabad 2019 results can take upto 30hours

నిజామాబాద్‌ పార్లమెంటు స్థానం ఎన్నిక పలు ప్రత్యేకతలను చాటుకుంటోంది. పెద్దసంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండటంతో మొదటిసారిగా 12 బ్యాలెట్‌ యూనిట్లతో ఓటింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. మే 23న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సైతం ప్రత్యేకతను సంతరించుకొనుంది. శాసన మండలి ఎన్నికల్లో మాదిరి ఈ ఎన్నిక ఫలితమూ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మరుసటి రోజుగానీ తేలే పరిస్థితి లేదు. ఈ ప్రక్రియకు 30 గంటలకు వరకు పట్టే అవకాశం ఉంది. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 185 అభ్యర్థులు బరిలో నిలిచారు. 12 బ్యాలెట్‌ యూనిట్లలో వీరి గుర్తులతోపాటు నోటాతో కలిపి 186 ఉంటాయి. మొత్తం 1788 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లను రెండు జిల్లా కేంద్రాల్లో లెక్కించనున్నారు. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి ఈవీఎంలను జగిత్యాల జిల్లా కేంద్రంలో.. నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను డిచ్‌పల్లిలోని క్రిస్టియన్‌ వైద్య కళాశాల భవనంలో లెక్కించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికో లెక్కింపు కేంద్రం ఉంటుంది. ప్రతి రౌండ్‌కు ఏడు చోట్ల లెక్కించనున్నారు. కాగా.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రౌండ్‌కు 14 టేబుళ్లపై లెక్కించిన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్యా 18 టేబుళ్లపై నిర్వహించనున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 12 బ్యాలెట్‌ యూనిట్లను వినియోగించారు. అంటే 18 టేబుళ్లపై 216 బ్యాలెట్‌ యూనిట్లు ఉంచి ఒక్క కేంద్రంలో లెక్కించాల్సి ఉండటంతో ఎక్కువ ప్రదేశం అవసరం ఉంటుంది. ఇందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇలా ఏడు కేంద్రాల్లో జరిగే ఓట్ల లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణిస్తారనేది తెలిసిందే. అయితే కంట్రోల్‌ యూనిట్‌లో ఆ పోలింగ్‌ కేంద్రంలో పోలైన ఓట్ల సంఖ్య ఉంటుంది. అభ్యర్థివారీగా ఓట్లు తేలాలంటే బ్యాలెట్‌ యూనిట్లల్లోని నోటా వరకు గుర్తులను వరుస క్రమంలో నొక్కి లెక్కించాల్సిందే. ఇందుకు ఎక్కువ సమయం పటటనుంది. మాక్‌పోలింగ్‌ సందర్భంలో ఒక పోలింగ్‌ కేంద్రంలో 186 గుర్తులు నొక్కి పరిశీలించేందుకు రెండు గంటల వరకు పట్టింది. ఓట్ల లెక్కింపునకూ అటూఇటుగా అంతే సమయం పట్టే అవకాశం ఉంది.

లెక్కింపు ఇలా..
* 1788 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సెంటర్లుగా విభజించి ఒక్కోచోట 18 టేబుళ్లపై లెక్కిస్తారు.
* అంటే 18×7=126 కేంద్రాల ఓట్లను ఒక రౌండ్‌లో లెక్కించనున్నారు.
* మొత్తం 1788 కేంద్రాల ఓట్లను లెక్కించాలంటే 14కు పైగా రౌండ్లు పట్టే అవకాశం ఉంది.
* 126×14=1764 కేంద్రాలు పూర్తవుతాయి. మిగిలిన 24 కేంద్రాల ఈవీఎంలను 15వ రౌండ్‌లో లెక్కించాల్సి ఉంటుంది. ఏడు చోట్ల 126 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను లెక్కించటాన్ని ఒక రౌండ్‌గా పరిగణిస్తారు.
* ఇలా ఒక రౌండ్‌ లెక్కింపు పూర్తి కావటానికి సుమారుగా రెండు గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
* జగిత్యాల జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కింపు వివరాలు ఇక్కడి రిటర్నింగ్‌ అధికారికి అంది.వాటికి ఇక్కడి ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో వచ్చిన ఓట్లతో కలిపి వెల్లడించాల్సి ఉంటుంది.
* ఇలా 15 సార్లు జరగాల్సి ఉంటుంది. అంటే ప్రతీసారి రెండు గంటలు పడితే 15×2=30 గంటలు పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే ఇందూరు పార్లమెంట్‌ నియోజకవర్గం ఎన్నిక ఫలితం కోసం మరుసటి రోజు వరకు వేచి చూడాల్సిందే.