భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నాడు. ఓటర్ల జాబితా నుంచి ఆయన పేరును తొలిగించడమే ఇందుకు కారణం. ద్రవిడ్ ఓ ఇంటి నుంచి మరో ఇంటికి నివాసాన్ని మార్చడంతో ఆయన పాత నియోజకవర్గమైన ఇందిరానగర్‌లో ఓటర్ల జాబితా నుంచి పేరును తొలిగించారు. గడువు ముగిసేలోగా కొత్త నియోజకవర్గ (శాంతినగర్) ఓటర్ల జాబితాలో అతని పేరును చేర్చలేదు. పాత నియోజకవర్గంలో తమ పేర్ల ను తొలిగించాల్సిందిగా కోరుతూ సంబంధిత పత్రాలను ద్రవిడ్ సోదరుడు అధికారులకు సమర్పించాడు. అయితే కొత్త నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తన పేరును చేర్చేందుకు అవసరమైన ఫామ్‌ను ద్రవిడ్ నింపలేదు. ఈ వ్యవహారంపై బెంగళూరు నగర మున్సిపల్ కమిషనర్ ఎన్ మంజునాథ్ ప్రసాద్ కూడా వివరణ ఇచ్చారు. ఓటర్ల జాబితా నుంచి ద్రవిడ్ పేరును తొలిగించేందుకు అవసరమైన పత్రాలను అతని సోదరుడు సమర్పించాడని, కొత్త నియోజకవర్గంలో పేరును చేర్చేందుకు అవసరమైన పత్రాలను స్వయంగా ఓటరే సమర్పించాలని ఆయన తెలిపారు. మా అధికారులు రెండుసార్లు ద్రవిడ్ ఇంటికి వెళ్లారు. కానీ వారిని లోనికి అనుమతించలేదు. ద్రవిడ్ విదేశీ పర్యటనలో ఉన్నట్టు తెలిపారు. ఓటర్ల జాబితాలో తన పేరును చేర్చాల్సిందిగా ద్రవిడ్ నుంచి విజ్ఞప్తి రాలేదు అని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రూప వివరించారు.
ఓటు కోల్పోయిన ద్రవిడ్
Related tags :